దేశంలో వినియోగిస్తున్న వంటనూనెల్లో దాదాపు 60 శాతాన్ని భారత్ దిగుమతి చేసుకుంటున్నది. వంట నూనెల్లో దేశం స్వయం పోషకత్వాన్ని సాధించాలని గత ప్రభుత్వాల లాగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా పదే పదే చెబుతున్నది. కాని దేశంలో వినిమయదారులకు తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో సుంకాలు లేకుండా దిగుమతులు చేసుకోవటం వల్ల దిగుమతులు పెరిగిపోతున్నాయి. 2022లో రష్యా- యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత 2022లో ప్రపంచ మార్కెట్లో వంటనూనెల ధరలు భగ్గుమన్నాయి. కాని ఆ తర్వాత 2023, 2024లో ప్రపంచ మార్కెట్లో వంట నూనెల ధరలు 30 శాతం తగ్గాయి. దిగుమతి సుంకాలు లేకపోవటం వల్ల వంటనూనెలు, నూనెగింజల ధరలు బాగా తగ్గాయి. నూనె గింజల ధరలు దేశంలో కనీస మద్దతు ధరల స్థాయి కన్నా బాగా తక్కువగా ఉంటున్నాయి. రైతులకు నూనెగింజల సాగు గిట్టుబాటుగా లేక, ఆ పంటల సాగుపై రైతులకు ఆసక్తి సన్నగిల్లుతున్నది.
వినిమయదారులకు లీటరుకి 100 నుండి 150 రూపాయలకు వంటనూనెలు లభ్యమౌతున్నాయి. 2022లో వంట నూనెలు ధరలు బాగా పెరిగినప్పుడు వినిమయదారులు లీటరుకి 175 నుండి 250 రూపాయలు చెల్లించేవారు. అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు తగ్గుతున్నప్పుడు దిగుమతి సుంకాలను విధించినట్లయితే రైతులకు నూనె గింజలకు కనీస మద్దతు ధరలన్నా లభించేవి. కాని ద్రవ్యోల్బణం తగ్గించటానికి వంటనూనెల ధరలు తగ్గటాన్ని సానుకూల అంశంగా భావించిన ప్రభుత్వం ఒక సంవత్సరకాలం పాటు తాత్సారం చేసింది. రైతుల్లో పేరుకు పోతున్న అసంతృప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కొంత ప్రతికూల ఫలితాలు రావడంతో, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలనెదుర్కోవాల్సి రావటంతో రైతుల గోడుని పట్టించుకోవాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. తాజాగా వంటనూనెల దిగుమతి సుంకాలను పెంచింది.
పెంచిన దిగుమతి సుంకాలు
ఇంతకు ముందు ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాలు లేవు. అయితే ఇతర సుంకాలు 5.5 శాతం మాత్రం చెల్లించి ముడి వంటనూనెల్ని దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ముడివంట నూనెలపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించారు. దిగుమతి చేసుకునే ముడి వంటనూనెలపై సెప్టెంబరు 15వ తేదీ తర్వాత 27.5 శాతం సుంకాలనుచెల్లించాలి. మన దేశం ముడి పామాయిల్ నూనెను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. దేశీయంగా పామ్ ఆయిల్ తోటల్ని పెంచే వాళ్ళకు పండ్ల గెలలకు కంపెనీలు టన్నుకి 13 వేల రూపాయలు చెల్లిస్తున్నాయి.
రోజులకు దిగుమతి సుంకాల పెంపు
ఈ ధర తమకు గిట్టుబాటుగా లేదనీ, దానిని 15 వేల రూపాయలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. వారి కోరికను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రికి తెలియజేసారు. అది జరిగిన వారం రోజులకు దిగుమతి సుంకాల పెంపు గురించిన ప్రకటన రావటంతో రైతుల కోరికను ప్రభుత్వం మన్నించిందని అందరూ భావించారు. శుద్ది చేసిన పామాయిల్, పొద్దు తిరుగుడు గింజల నూనె, సోయాచిక్కుడు గింజల నూనెలను కూడా మన దేశం దిగుమతి చేసుకుంటున్నది. గతంలో ఈ రిఫైన్డ్ నూనెల దిగుమతిపై అన్ని సుంకాలు కలిపి 13.75 శాతం పన్నుని ప్రభుత్వం వసూలు చేసేది.
ఇప్పుడు తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వంట నూనెల విలువపై 35.75 శాతం సుంకాలు చెల్లించాలి. వీటివల్ల నూనె గింజల ధరలు పెరుగుతాయని ఆశించవచ్చు. ప్రకటన వెలువడిన వెంటనే వంట నూనెలను అమ్మే కంపెనీలు ధరలు పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వం దేశంలో 30 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలున్నాయనీ, మరో 15 లక్షల టన్నుల వంట నూనెలు దేశంలోకి రానున్నాయని అందువల్ల ధరలు పెంచవద్దనీ విజ్ఞప్తి చేసింది. కాని లాభాపేక్షతో పని చేసే కంపెనీలు ఆ విజ్ఞప్తిని పట్టించుకోవటంలేదు. ఇంకా ఖరీఫ్ పంట మార్కెట్లోకి రాలేదు కాబట్టి రైతులకు అధిక ధరలు లభిస్తున్నాయో లేదో చెప్పలేము. కాని విని యోగదారులు మాత్రం ఎక్కువ ధరలు చెల్లించటం మొదలైంది.
ప్రస్తుతం పామాయిల్ గెలలు కంపెనీలకు సరఫరా అవుతున్నాయి. రైతులకు కంపెనీలు ఎంత ఎక్కువ ధర ఎప్పటి నుండీ చెల్లిస్తాయో వేచి చూడాలి. ప్రభుత్వాలు కనీస మద్దతు ధరను పెంచితేనే కంపెనీలు ధరలు పెంచవచ్చు. సోయాచిక్కుడు గింజలు, వేరుశనగ, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు త్వరలో మార్కెట్లోకి వస్తాయి. వాటి ధరలు కనీస మద్దతు ధరలకన్నా ఎంత ఎక్కువగా ఉంటాయో చూడాలి. ఒక్క నువ్వులకే ప్రస్తుతం కనీస మద్దతు ధరకన్నా అధిక ధరలు లభిస్తున్నాయి. సోయాచిక్కుడు గింజలు, వేరుశనగలకు కనీస మద్దతు ధర కన్నా పదిశాతం తక్కువ ధరలు లభిస్తున్నాయి. దిగుమతి సుంకాల ప్రభావంతో వాటి ధరలు ఇరవై శాతం పెరిగే అవకాశం ఉంది. దేశంలో పొద్దు తిరుగుడు గింజల సాగు నామమాత్రంగానే ఉంది.
నూనెగింజల సాగు, ఉత్పత్తిలో ఆటుపోట్లు
2014లో దేశంలో 28.1 మిలియన్ హెక్టార్లలో నూనె గింజల సాగు జరిగింది. ఆ తర్వాత నూనె గింజల సాగు విస్తీర్ణం తగ్గుతూ 2018లో 24.5 మిలియన్ హెక్టార్లకు తగ్గింది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ తగ్గుదల నమోదైంది. 2019 నుండి క్రమంగా వర్షపాతం పెరిగి, స్థిరమైన పరిస్థితుల వల్ల నూనెగింజల సాగు పెరుగుతూ 2023 ఆర్థిక సంవత్సరంలో 30.2 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. 2023-24లో దేశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం వల్ల నూనె గింజల సాగు కొంత తగ్గి 30.1 మిలియన్ హెక్టార్లుగా నమోదైంది. నూనెగింజల ఉత్పాదకత 2014లో 1168 కిలోలుగా ఉంది. 2016తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో నూనె గింజ పంటల ఉత్పాదకత 968 కిలోలకు తగ్గింది.
ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ 2022-23 సంవత్సరంలో 1368 కిలోలకు పెరిగింది. 2023-24లో ఉత్పాదకత 1,316 కిలోలకు తగ్గింది. 2017-18లో 31.46 మిలియన్ టన్నులు నూనెగింజలు ఉత్పత్తయ్యాయి. వాటి నుండి 10.38 మిలియన్ టన్నుల వంట నూనెలు తయారయ్యాయి. ఆ సంవత్సరం 14.59 మిలియన్ టన్నుల వంట నూనెలు దిగుమతయ్యాయి. మొత్తం వంట నూనెల లభ్యత 24.97 మిలియన్ టన్నులుగా ఉంది. అయితే అందులో 1.15 మిలియన్ టన్నుల వంటనూనెలు ఇతర దేశాలకు ఎగుమతయ్యాయి. 2021-22లో నూనె గింజల ఉత్పత్తి 37.96 మిలియన్ టన్నులకు, వంటనూనెల ఉత్పత్తి 11.57 మిలియన్ టన్నులకు పెరిగాయి. వంటనూనెల దిగుమతి 14.19 మిలియన్ టన్నులుగా ఉంది.
Also Read వరి నాటే యంత్రము తో రైతుకు మేలు
రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలు నూనె గింజల ఉత్పత్తికి ముఖ్యమైన రాష్ట్రాలు. తెలంగాణాలో 6.81 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 5.49 లక్షల టన్నుల నూనెగింజల ఉత్పత్తి జరిగింది. హెక్టారు ఉత్పాదకత తెలంగాణాలో 1817 కిలోలు, ఆంధ్రప్రదేశ్లో 643 కిలోలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 9.11 లక్షల హెక్టార్లలో నూనె గింజల సాగు జరగగా తెలంగాణాలో 3.75 లక్షల హెక్టార్లలోనే అది జరిగింది. అయితే ఆయిల్ పామ్ సాగులో 1,84,840 హెక్టార్లతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచి, దేశంలో సగం విస్తీర్ణాన్ని కలిగి ఉంది. తెలంగాణాలో ఆయిల్ పామ్ సాగు 21,382 హెక్టార్లలో జరుగుతున్నది.
నూనెగింజల సాగు విస్తీర్ణంలో 9 శాతం వృద్ధి
2023-24 వంట నూనెల సంవత్సరం (అక్టోబరు నుండి సెప్టెంబరు)లో 42.7 మిలియన్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వ అంచనా. 2024-25 సంవత్సరంలో ఉత్పత్తి కొంత తగ్గి 41.9 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. 2025-26 సంవత్సరంలో 44.75 మిలియన్ టన్నుల నూనెగింజల్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా సోయాచిక్కుడు, ఆవ, వేరుశనగ పంటల ద్వారానూ, ఆముదం, నువ్వులు, పొద్దు తిరుగుడు పంటల ద్వారా కొంతమేరకు ఉత్పత్తి చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2024-25లోని ఖరీఫ్ కాలంలో 16.3 మిలియన్ హెక్టార్లలో నూనె గింజల సాగు జరిగినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2023-24 ఖరీఫ్ 15.09 లక్షల హెక్టార్లలో నూనెగింజల సాగు జరిగింది. నూనెగింజల సాగు విస్తీర్ణంలో 9 శాతం వృద్ధి నమోదవటం, వర్షాలు బాగా పడటం వల్ల ఉత్పాదకత బాగా ఉండవచ్చనే అంచనా వల్ల ఉత్పత్తి లక్ష్యంకు చేరువగా ఉండవచ్చు. ఖరీఫ్ పండే సోయాచిక్కుడు, వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలకు మంచి ధరలు లభిస్తే రబీ కాలంలో కూడా నూనెగింజల సాగు పెరగవచ్చు.
తగ్గని వంట నూనెల దిగుమతులు
2022-23లో దేశీయంగా 12.41 మిలియన్ టన్నుల వంట నూనెలు ఉత్పత్తికాగా 16.5 మిలియన్ టన్నుల వంట నూనెలు దిగుమతయ్యాయి. 2023 నవంబరు నుండి 2024 ఆగస్టు వరకు జరిగిన పది నెలల కాలంలో 13.68 మిలియన్ టన్నుల వంటనూనెలు దిగుమతయ్యాయి. 2022 నవంబరు నుండి 2023 ఆగస్టు మధ్య కాలంతో పోలిస్తే దిగుమతులు 3 శాతం తగ్గాయి. అయితే వ్యాపార వర్గాల అంచనాలను ಬಟ್ಟೆ సెప్టెంబరు- అక్టోబరు మాసాల్లో దిగుమతులు 2.8 మిలియన్ టన్నులుండవచ్చు. 2023-24 వంట నూనెల సంవత్సరంలో వంటనూనెల దిగుమతులు క్రితం సంవత్సర స్థాయిలోనే ఉండవచ్చు. రాబోయే సంవత్సరంలో నూనె గింజల ఉత్పత్తి, వంట నూనెల ఉత్పత్తి ఉత్పత్తి దేశీయంగా దేశీయంగా పెరిగి 13.5 మిలియన్ టన్నులకు పెరగవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యమైన వంటనూనెల్లో స్వయం పోషకత్వాన్ని సాధించటం అనేది సమీప భవిష్యత్లో సాధించే అవకాశం లేదు. మొదటి లక్ష్యంగా దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంచి మొత్తం వంటనూనెల వినియోగంలో సగానికి వంట నూనెల దిగుమతిని తగ్గించగలగాలి.
రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా
వచ్చే రెండేళ్ళలో దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని 15 మిలియన్ టన్నులకు పెంచి, వంట నూనెల దిగుమతిని కూడా 15 మిలియన్ టన్నులకు తగ్గిస్తే మొదటి లక్ష్యాన్ని నెరవేర్చినట్లు అవుతుంది. ఇందుకోసం దేశంలో నూనెగింజల ధరలు కనీస మద్దతు ధరలకన్నా 15 శాతం ఎక్కువగా ఉండేలా ప్రయత్నించాలి. నూనెగింజలపై పరిశోధనల్ని రెట్టింపు నిధులు, రెట్టింపు శాస్త్రసాంకేతిక నిపుణుల సంఖ్యతో బలోపేతం చేయాలి. ఉత్పాదకతను హెక్టారుకి 1500 కిలోల స్థాయికైనా పెంచగలగాలి. ఎక్కువగా వర్షాధారంగా నూనె గింజల పంటలను సాగు చేయడం వల్ల ఉత్పాదకత పెరగటం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా దిగుమతి సుంకాలనుంచడం, పరిశోధనలను ఉధృతం చేయడం ద్వారా ఉత్పాదకతను పెంచడము ద్వారానే దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని పెంచగలము.
ఏటా 92 వేల కోట్ల రూపాయల ఖర్చుతో దిగుమతులు జరుగుతున్నాయి. వాటిని కొంతమేరకైనా తగ్గించాలంటే దిగుమతి సుంకాలను పెంచి, రైతులకు గిట్టుబాటు ధరలనందించాలి. వినిమయదారులపై కొంత భారం పడినా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు బాగా పెరిగినప్పుడు దిగుమతి సుంకాలను తగ్గించడం, ధరలు తగ్గినప్పుడు సుంకాలను పెంచడం చేయాలి. ధరలు తగ్గినప్పుడు కూడా దిగుమతి సుంకాలను ఎత్తివేయడం వల్ల రైతులకు నూనె గింజల ధరలు తగ్గి, కనీస మద్దతు ధరలు కూడా లభించడం లేదు. దిగుమతిదార్ల లాబీలకు, వినిమయదారుల ప్రయోజనాలకు లొంగిపోవడం వల్ల పదేపదే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి.