ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అభివృద్ధి పనులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ… కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. గత ఐదేళ్ళ కాలంలో వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి గురైన రహదార్లకు కూటమి పాలనలో మోక్షం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో కూడా ఘోరంగా విఫలమైంది. మరీ ముఖ్యంగా అన్ని రహదార్లు ఛిద్రమై గుంతలతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు సృష్టించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు.
గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే గుంతలకు తాత్కాలిక మరమ్మత్తులు చేయించడంతో పాటు పూర్తిగా ధ్వంసమైన రహదారులను పునర్నిర్మిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. దానిలో భాగంగానే గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఏలూరు 7వ డివిజన్ లోని సత్యన్నారాయణ- విజయలక్ష్మీ థియేటర్ మధ్యలో రోడ్డుపై ఉన్న గుంతలకు మరమ్మత్తు పనులకు నగర మేయర్ నూర్జహాన్ తో కలసి ఎమ్మెల్యే బడేటి చంటి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
also read హజ్ యాత్ర అడ్వాన్స్ డిపాజిట్ గడువు పెంపు – మంత్రి NMD ఫరూక్
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గుంతల పూడ్చివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఏలూరు నగర పరిధిలోని 50 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, వచ్చే జనవరి నాటికి ఎక్కడా గుంతలు లేకుండా అన్ని రహదార్లను పూర్తిస్థాయిలో చక్కదిద్దేందుకు నిధులు మంజూరుచేసినట్లు చెప్పారు. కాంట్రాక్టర్లు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయాలని, తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత బాగా పాడైపోయిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేసేందుకు పది కోట్ల రూపాయలు మంజూరుచేసినట్లు ఆయన ప్రకటించారు. ప్రజావసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా కూటమి పాలన కొనసాగుతుందని, భవిష్యత్ లో ఏలూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ… పరిపాలనాదక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందన్నారు.
గుంతలరహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలో దాదాపు 600కు పైగా గుంతల రోడ్లు ఉన్నట్లు గుర్తించి, వాటికి మరమ్మత్తులు చేసేందుకు జనరల్ ఫండ్స్ నుండి 25 లక్షల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఏలూరు నగరాన్ని గుంతల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి సారధ్యంలో కార్పొరేషన్ పాలకవర్గం కృషిచేస్తుందని పేర్కొన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, క్లస్టర్ ఇంఛార్జ్ మారం అను, డివిజన్ ఇంఛార్జ్ రాజా మురళీకృష్ణ, కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్, సబ్బన శ్రీనివాస్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కార్పొరేషన్ ఏఈ రాజేంద్ర కృష్ణ, ఈఈ సురేంద్ర, డిఈ లు కొండలరావు, రజాక్, తాతబాబు, ఏఈలు సాయి, అరుణదేవి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.