తెరపైకి మళ్లీ ‘ప్రత్యేక’ సీమ నినాదం

siddeswaram-byreddy-rajasekhar-reddy.jpg

సీమ కోసం బైరెడ్డి ఉద్యమ బాట

సీమ హక్కులు, ప్రాజెక్టులతో ప్రజల్లోకి

ఉమ్మడి జిల్లాలో మొదలైన సీమ ఉద్యమం

పార్టీలకతీతంగా స్టీరింగ్ కమిటీ
అధికార, ప్రతిపక్ష నేతలను కలవనున్న వైనం

జనవరి 28న ఛలో సిద్దేశ్వరం

ఆత్మకూరు జనవరి9 .. అధికార పార్టీ చేష్టలు, మంత్రుల వ్యాఖ్యలు, మూడు రాజధానుల అంశంతో పాటు ప్రత్యేక ఉత్తరాంధ్ర వంటి అంశాలు రాయలసీమ వాసులను ఇరకాటంలో పడేసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాయలసీమ అంశం తెరపైకొచ్చింది. అందుకు నాడు రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించి ప్రత్యేక సీమ కోసం పోరాటం సాగించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి నేడు మళ్లీ ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. రాస్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల రీత్యా పాలకులు రాయలసీమకు మరోసారి అన్యాయం చేసేందుకు పావులు కదుపుతున్నారనే ఉద్దేశంతో సీమ వాసులను చైతన్యం చేసి సీమ హక్కులను కాపాడుకునేందుకు, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమ బాట పట్టనున్నారు. అందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఈయన ఉద్యమానికి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు, మేధావులు ఉద్యమ బాటలో కలుస్తారా ? లేదా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ప్రాంతాలు కరువుకు ప్రతీకలు. ఉమ్మడి ఆంధ్ర రాష్ర్టం నుంచి నేటి వరకు కూడా ఈ జిల్లాలు కరువు పీడిత ప్రాంతాలుగానే వర్ధిల్లుతున్నాయి. అందుకు పాలకుల వైఖరే కారణంగా చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్ర రాష్ర్టం నుంచి నేటి వరకు రాయలసీమ ప్రాంతాలు అన్యాయానికి గురౌతూనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ర్టానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కర్నూలును రాజధానిగా ప్రకటించి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. తర్వాత కొంత కాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పాటు కావడంతో రాజధానిని హైదరాబాద్ కు మార్చారు. నాడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమ వాసులు కర్నూలును రాజధాని కోరుకుంటే రాజధాని చేయాలనే అంశాలను ఒప్పంద పత్రలో పొందు పర్చారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు ప్రత్యేక రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత అమరావతిని రాజధాని చేశారు. నేడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖలో పరిపాలన, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో న్యాయ రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు ఈ రాజధానుల విషయంలో గందర గోళం నడుస్తోంది. రాష్ర్ట మంత్రులు అభివృద్ధిని విస్మరించి మూడు రాజధానుల అంశంతో ప్రజలను మభ్య పెడుతున్నారు.

తెరపైకి ‘ప్రత్యేక’ నినాదం

ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నాలుగు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. తర్వాత కొంత కాలం పాటు స్థబ్ధుగా ఉన్న ఈయన పాలకుల తీరుతో సీమ హక్కుల కోసం మరోసారి ఉద్యమ బాటకు సిద్దమయ్యారు. అందుకోసం ఇప్పటికే కర్నూలు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాలులో ‘రాయలసీమ మేధావుల సమావేశం’ నిర్వహించి అందరినీ ఒక తాటిపై తెచ్చే ప్రయత్నం చేశారు. అందులో నీళ్లు, నిధులు, నియామకాలను ఎజెండాగా చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి జిల్లాలో పడకేసిన ప్రాజెక్టులు, నీరున్నా ఉపయోగించుకోలేని దౌర్భగ్య స్థితి, ఐకాన్ బ్రిడ్జితో పాటు బ్యారేజీ నిర్మాణం వంటి వాటిని సాధించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రారంభ ఉద్యమంగా ఈ నెల 28న ఛలో సిద్దేశ్వరంలో భాగంగా రాయలసీమ ప్రజా ప్రదర్శన చేపట్టనున్నారు. అందుకోసం మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు, వామపక్షాలను కలుపుకుని ఉద్యమం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని సమస్యను విన్నవించనున్నారు. అలాగే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీ రాష్ర్ట నాయకులను కలిసి మద్దతు అడగనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కలవగా మిగతా వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లా నేతలు సహకరిస్తారా ?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, తోగూరు ఆర్థర్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, సాయి ప్రసాద రెడ్డి, వై.బాలనాగి రెడ్డి, సుధాకర్ లు ముఖ్యమంత్రిని కాదని ముందుకు కదలని పరిస్థితి. అలాంటిది బైరెడ్డి చేపట్టిన ఉద్యమంలో పాల్గొనరనే ప్రచారం నడుస్తోంది. అలాగే టిడిపి జిల్లాల అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు కూడా బైరెడ్డితో కలిసి ముందుకు నడుస్తారా ? లేక వారి అధినేతల మాటలకు కట్టుబడి ఉంటారా అనేది ప్రశ్నగా మారింది. అయితే ఎవరు కలిసినా కలవకపోయినా ప్రజలు, మేధావులు, రైతులు, యువకులు, నిరుద్యోగులను కూడగట్టుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే యోచనలో బైరెడ్డి ఉన్నారు. విభేదాలు, వైరుధ్యాలు మరచి రాయలసీమ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పూర్తి కాని ప్రాజెక్టులు

జిల్లాలో హంద్రీనీవా ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 3,800 క్యూసెక్కులు లిఫ్టు చేయాల్సి ఉంటే..2 వేల క్యూసెక్కులు కూడా లిఫ్టు చేయడంలేదు. పూర్తి సామర్థ్యంతో లిఫ్టు చేయాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.350 కోట్లతో విస్తరణ పనులు చేపడితే..జగన్ ప్రభుత్వం ఆ పనులు నిలిపేసింది. తర్వాత 10 వేల క్యూసెక్కులు లిఫ్టు చేసేలా సమాంతర కాల్వ చేపడతామని చెప్పారు. కానీ కాల్వ పనులు ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు. సీమ దుర్భిక్ష నివారణ పేరుతో రూ.33.862 కోట్లతో 23 సాగు నీటి ప్రాజెక్టులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. అయితే అందులో ఒక్క ప్రాజెక్టు పని కూడా మొదలు కాలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిని వాటి ద్వారా వచ్చే నీరు కర్నూలు జిల్లాతో పాటు కనీసం రాయలసీమ జిల్లాలకు కాకుండా నెల్లూరు, చెన్నైకి తీసుకెళ్లేలా పనులు చేపట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సమయంలో రాయలసీమ జీవనాడిగా భావించే శ్రీశైలం జలాశయం ఎగువన 854 అడుగుల లెవెల్లో సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి హామీచ్చారు. కానీ నేటికీ అలుగు ప్రస్తావనే లేదు. ఇవన్నీ విస్మరించి కేవలం మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top