రేణుక అలియాస్ ‘మిడ్కో’
కొంతమంది చనిపోయినా వారిని చూసి మురిసిపోయే సందర్భాలు చాలా అరుదు. మనల్ని బతికించే ఏదో ఒక ఆశ వాళ్ళు వదిలి వెళ్ళినప్పుడే అది సాధ్యమౌతుంది. అటువంటి అచంచలమైన విశ్వాసాన్ని కామ్రేడ్ రేణుక ఇప్పుడు రాష్ట్రంలోని వందలాది మందికి కలిగించింది. అందుకే ఆమెను ఎన్‌కౌంటర్ పేరిట పోలీసులు హత్యచేశారని తెలియగానే ఒకరకమైన ఉలికిపాటు, ఆందోళన, అదే సమయంలో ఆమె అమరత్వాన్ని కీర్తిస్తూ ఎక్కడికక్కడ స్పందనలు వెల్లువెత్తాయి.
అలా స్పందించిన వాళ్లలో ఎక్కువ మందికి ఆమె ప్రత్యక్షంగా పరిచయం కూడా వుండకపోవచ్చు. కొందిరికి ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వుంటే, మరికొందరికి అమె రచనలు పరిచయం వుండొచ్చు. అతి కొద్దిమందికే తప్ప రేణుక మిడ్కోగా మారిన పరిణామం తెలియకపోవచ్చు. కానీ అందరిలో ఆమెలేని లోటును ఒకేలా కలిగించే అరుదైన జ్ఞాపకం ఆమె.
బహుశా ఆ జ్ఞాపకమే ఆమె మరణాంతరం అంతమందిని దగ్గరకు చేర్చింది.
ఆమె దహనసంస్కారాలకు వచ్చిన జనాలతో కడివెండి నిండిపోయినప్పుడు ఆ జనాలను చూసి అప్పటికప్పుడు నా ఫేస్‌బుక్ వాలుపై రాస్తూపోయాను దారిపొడవునా జనం / ఇళ్ల ముందూ జనం / అరుగు మీద జనం / మూల మలుపున జనం / మేడమీద జనం బ్రిడ్జీ మీద జనం / ఎటుచూసినా జనమే / ఇది కదా బతుక్కి అర్థం / ఇది కదా అమరత్వం అని.
నిజానికి ఇలాంటి అమరత్వం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కొందరే ఆ అమరత్వాన్ని ముద్దాడుతారు. ఆ అమరత్వాన్ని ముద్దాడుతూ కూడా అనే ప్రశ్నల్ని, సవాళ్లను ఎక్కుపెడుతూ, మరి మీ సంగతేంటీ అంటూ నిలదీస్తారు. కామ్రేడ్ రేణుక అదే పని చేసింది.
నిస్తేజంగా పడున్న ఆమె దేహం ఏమీ చేయలేదు అని రాజ్యం అనుకోవచ్చు ఇవాళ. కానీ ఆ నిస్తేజమైన దేహం ఎంతమందికి దారిచూపించిందో ఎవరికి తెలుసూ..!?
ఒకనాడు మౌనంగా కనిపించే రేణుకలో కూడా ఆ ఆనవాళ్లు కనిపించి వుండకపోవచ్చు.
కామ్రేడ్ రేణుక మరణం తర్వాత అమెను కడసారి చూడటానికి వచ్చిన జనాలతో కడివెండి ఎరుపెక్కినప్పుడు ఆ గుంపులోంచి ఒక పెద్దావిడ అంది ‘‘అమ్మాయిని చూస్తే ఎప్పుడు అలా అనిపించేది కాదు. ఎంతో సౌమ్యంగా, చాలా ముచ్చటగా, పెద్ద జడతో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రేణమ్మ దళంలోకి వెళుతుందని కానీ, ఇలా తిరిగొస్తుందని కానీ ఎవ్వరం అనుకోలేదు బిడ్డ’’ అని.
బహుశా ఇదే అభిప్రాయం కనిపెంచిన తల్లిదండ్రులకు, కలిసి చదువుకున్న స్నేహితులకు, తొడబుట్టిన వాళ్లకు కలిగివుండొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి అది కాదు కదా?
రేణుక మరణ వార్త తెలిననప్పటి నుండి ‘‘నా కొడుకు దళంలోకి వెళతా..” అంటున్నాడని ఓ తండ్రి ఆందోళనతో చెబుతున్నాడంటే ఆమె అమరత్వం ఎన్ని ప్రశ్నలను ముందుంచవచ్చు. దొడ్డి కొమురయ్యను హత్యచేస్తే ఆగుతుందనుకున్న విప్లవం రేణుకక్క మరణం కూడా ఆపలేకపోతుందంటే ఈ వ్యవస్థ నిర్మాణంలోనే రేణుకలాంటి వాళ్లు పురుడుపోసుకునే అసమానత్వం వుందనే కదా అర్థం. దాన్ని రూపుమాపకుండా వ్యక్తులను హతమారుస్తూపోతూ వుంటే సమస్య జఠిలమవ్వడం తప్ప ఎప్పటికీ సమాధానం దొరకదు.
నిజానికి రేణుక నాకు ఎలా పరిచయం అంటే ఏం చెప్పాలి?
మిడ్కో తెలుసు గానీ ఊరందరికి తెలిసిన రేణుక నాకు తెలియదనే చెప్పాలి..!
‘మిడ్కో’. గమ్మత్తుగా అనిపించే ఈ పేరును నేను మొదటి సారి విన్నది 2012లోనే
2012లో ఉస్మానియా యూనివర్సిటీలో మేమంతా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు ఓవిధమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.
బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకవైపు, మతోన్మాద ఏబీవీపీ మరో వైపు ఓయూ విద్యార్థులపై కన్నెర్ర చేస్తూ అడ్డుకుంటామని తమ శ్రేణులతో కలిసి కార్యచరణను ప్రకటించినప్పుడు, అప్పటిదాక ప్రోగ్రెసివ్ శక్తులనుకుంటున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుండి మాకు ఎటువంటి మద్దతు లభించకపోగా తీవ్ర వ్యతిరేక వ్యక్తం అయింది.
కొంతమంది దళిత ప్రొఫెసర్ల నుండి ‘బి వేర్ ఆఫ్ బీఫ్ పాలిటిక్స్’, ‘తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే వామపక్ష, విప్లవ విద్యార్థి సంఘాల విద్యార్థులు ఈ బీఫ్ ఫెస్టివల్ ను ముందుకు తీసుకొచ్చారు’ అని ఆరోపణలుచేస్తున్నప్పుడు మాకు మద్దతుగా నిలిచింది కామ్రేడ్ మిడ్కోనే..!
నాగరిక సమాజం అని చెప్పుకునే దగ్గర, ఎదుటివ్యక్తి ఆహారపు అలవాట్లను అవమానిస్తూ, తింటే నీచంగా చూస్తున్న దగ్గర, అకారణంగా ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో, విప్లవోద్యమం అట్టడుగు కులాల ఆహారపు అలవాట్లను సొంతం చేసుకొని, ఎలా సంరక్షిస్తుందో మాతో పంచుకుంది మిడ్కో…!
బీఫ్ తినడం పట్ల ఉన్న అనుకూలత పంది మాంసం పట్ల లేని కొన్ని మత సమూహాల విషయంలో కూడా విప్లవోద్యమం ఎలా వ్యవహరించిందో సుదీర్ఘ వ్యాసంలో వివరించింది మిడ్కో.
సంఖ్య పరంగా ముస్లిం సామాజిక నేపథ్యం నుండి విప్లవోద్యమం లోకి వెళ్ళిన వాళ్ళు తక్కువే అయినప్పటికీ పంది మాంసాన్ని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లు వివరిస్తుంది. పైగా అట్టడుగు కులాల ఆహారాన్ని ఎవరైనా తినకపోవడం అంటే చైతన్యంలో ఒకడుగు వెనకబడినట్లే అనే ‘కొత్త ఎరుక’ను కలిగించింది మిడ్కో.
‘ఈకాలంలో కూడా బీఫ్ తింటారా…ఇంత చదువులు చదువుకొని ఇంకా తిండి గోలేనా’ అని మేధావులనబడే యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎద్దేవ చేస్తున్నపుడు అట్టడుగు కులాల ఆహారాన్ని అలవాటు చేసుకోవడం అంటే, ఆ అట్టడుగు కులాలతో కలిసిపోవడంగా, డి క్లాసిఫై అవ్వడంగా, ఆహారపు అలవాట్లను గౌరవించడం అని ప్రస్తావించింది మిడ్కో.
అప్పటిదాక మిడ్కో అంటే ఎవరో తెలియని నాలాంటి వాళ్లకు తన విప్లవోద్యమ ఆచరణ ద్వారా విషయాలను అర్థం చేస్తున్నప్పుడు తనెవరో మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించింది.
మూడు దశాబ్దాల క్రితం మాలాగే ఓ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న ఆమె, పుట్టిన ఊరు, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న సమాజం తననో విప్లవ మహిళగా తీర్చిదిద్దితే, ప్రత్యామ్నాయ రాజకీయాల ద్వారా తప్ప ఈ సమాజ మార్పు సాధ్యం కాదని భావించిన ఆమె విప్లవోద్యమమే తన గమ్య స్థానంగా భావించి ‘మిడ్కో’ గా పరిణామం చెందిందని అర్థమైంది.
ఆ పరిచయమే ఆమె రచనల్ని వెతికి పట్టుకునేలా చేసింది. మూడున్నర దశాబ్దాల తన రచనా జీవితంలో రచయితగా నాలుగు పదులు మించని కథలు రాసినప్పటికీ ఒక్కో కథ చదువుతున్నప్పుడు అందులోని వాక్యాలు చేర్నకోలలా తగులుతాయి.
ఆమె కన్నా గొప్ప సైద్ధాంతిక పరిజ్ఞానం కలిగిన వాళ్లు ఉండొచ్చు కానీ..!
ఆమె కన్నా గొప్ప సైద్ధాంతిక పరిజ్ఞానం కలిగిన వాళ్లు, సాహసోపేతంగా పనిచేసిన వాళ్ళూ విప్లవోద్యమంలో ఎందరో వుండొచ్చు. కానీ తను చదివిన, తన అనుభవంలోకి వచ్చిన ప్రతి విషయాన్నీ నేరుగా హృదయంలోకి తీసుకుని వ్యక్తికరించే మనస్తత్వం ఆమెది. అందుకే ఆమె రచనల్లో ఆ సూటిదనం కనిపిస్తుంది.
‘సంకెల’ కథలో ఓ చోట అంటుంది మిడ్కో ‘‘ సినిమాలలో ఆడవాళ్ళను ఇంత నీచంగా చూడటానికి అలవాటు పడిన మగవాళ్ళు నిజ జీవితంలో మాత్రం వాళ్లను ఎలా గౌరవిస్తారు..’’ అని.
Also Read ముష్టపల్లె గ్రామంలో..శ్రీ కోదండరాముల వారి కళ్యాణం
పదేళ్ళ క్రితం చదివాను ఆ కథను. కానీ ఎప్పుడూ ఏ సినిమా చూస్తున్నా అందులో అసభ్యకరమైన ఏ సన్నివేశం కనిపించినా మిడ్కో రాసిన ఆ కథ గుర్తుకు వచ్చి చురకంటించినట్లు అనిపిస్తుంది.
‘ప్రవాహం’ కథలో భర్తను/సహచరుడిని అనుసరిస్తూ ఉద్యమంలోకి వెళ్లిన స్త్రీ, తన సహచరుడు లొంగిపోయి ఆమెను తనవెంట రమ్మంటూ ‘‘అప్పుడు నన్ను ఇష్టపడ్డావు, నేను చెబితే విన్నావు. ఇప్పుడు వినవేంటి’’ అంటే, ‘‘నీకు పార్టీ ఇచ్చిన చైతన్యమే లేకుంటే మంచి భర్తగా వుండేవాడిని కాదు. నేను నిన్ను ఇష్టపడేదాన్నే కాదు. నిన్నింత మంచిగా తయారు చేసింది పార్టీ అని అర్థమయిన తర్వాత పార్టీని ఇంకా ఎక్కువ ఇష్టపడ్డాను, అందుకే వదిలి రాలేను..’’ అని నిక్కచ్చిగా చెబుతుంది మిడ్కో.
ఇలా ఒక్కటేమిటి తను రాసిన ప్రతి కథలో స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించే ప్రయత్నాన్ని ఎత్తిపడుతుంది మిడ్కో.
‘‘లల్లీ (లలిత) ఉద్యమంలోకి పోయి కొన్నేళ్ల తర్వాత తనుకూడా తిరిగోస్తదా? రాదు! తను చాలా గట్టిగా నిలబడుతది. ఎందుకంటే తను ఉద్యమావసరాన్ని తన జీవితసారంలోంచి గుర్తించింది…’’ అని ‘మెట్లమీద’ కథలో లలిత గురించి చెబుతుంది మిడ్కో. నిజానికి ఆ కథలోనీ లలితలో మిడ్కోనీ చూడవచ్చు మనం..
లలితలా మిడ్కో కూడా చివరికంటా వెనుతిరిగి చూడలేదు.
అందుకే సంపూర్ణ విప్లవ జీవితాన్ని జీవించిన ఆమెను చూడటానికి, స్మరించుకోవడానికి తండోప తండాలుగా జనం కడివెండికి తరలి వచ్చారు.
ఇవాళ మిడ్కోను స్మరించుకోవడమంటే విప్లవ నిబద్ధతను, విప్లవ ఆచరణను స్మరించుకోవడమే. విప్లవ రాజకీయాలతో పనిచేసిన అందరూ విప్లవకారులు కాలేరు. విప్లవ ఆచరణలో తమను తాము పూర్తిగా లీనం చేసుకున్న వారు మాత్రమే నిజమైన విప్లవ కారులు కాగలరు. కామ్రేడ్ రేణుక సంపూర్ణ విప్లవకారిణి.
- ఎస్.ఎ.డేవిడ్
9848176945