గోరింటాకు గొప్పతనం

USES OF MEHANDI

USES OF MEHANDI

శుభ సందర్భాలలో ముఖ్యంగా పండుగలు, వివాహాది సందర్భాల్లో అన్ని వర్గాల ప్రజల మనస్సులను ఇట్టే ఆకర్షించే గోరింటాకు లైథేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన బహువార్షిక గుల్మం. దీని శాస్త్రీయ నామం లాసోనియా ఇనర్మిస్, దీనిని వివిధ భాషల్లో వివిధ నామాలతో పిలుస్తారు. హిందీ, రాజస్థానీ భాషల్లో మెహంది, కన్నడలో, తెలుగులో గోరింట, తమిళంలో మరుతోన్రి, మళయాలంలో మయిలాంచి అని పిలుస్తారు. పూర్వకాలంలో దీనిని కాస్మెటిక్ ద్రవ్యంగా వుపయోగించటం అంతగా వాడుకలో లేదు. పూర్వం ఈజిప్టియన్లు పీనుగ యొక్క వెంట్రుకలు, గోళ్ళపై దీనిని పెట్టేవారు. అంతేగాక దెబ్బలు తగిలి స్మృతి తప్పిపడిపోయినపుడు, నీటిలో పడిపోయినపుడు, విషపదార్థా లను సేవించినపుడు వాళ్ళను యధా స్థితికి తీసుకొని వచ్చుటకు గోరింటను ఉపయోగించేవారు. అశోక చక్రవర్తి పంపిన మత బోధకుల ద్వారా భారత దేశంలో దీనికి మంచి గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ కాలంలో గోరింట పత్రాల కషాయాన్ని గాయకులు వారి స్వరాన్ని మెరుగుపరచుకొనేందుకు వాడేవారు. ఇప్పటికీ ఈ పద్ధతి వాడుకలో ఉంది.

పశ్చిమాసియా ప్రాంతంలో మహమ్మదీయులు ఉష్ణం తగ్గడానికి గోరింట ఆకులను దంచి నుదుటిపై పట్టు వేస్తారు. పెండ్లికూతురు వివాహదినం “శుక్రస్” రోజున, ఆమెను గోరింటాకుతో అలంకరిస్తారు. ఈ గోరింట కషాయాన్ని బట్టలకు. రంగులు వేసేందుకు వాడతారు. పర్షియా, అరేబియా మొదలైన దేశాల్లో గుర్రాల జూలు, వెంట్రుకలు, తోకలకు గోరింటాకు పూసి ఎర్రగా వుండేట్లు చేస్తారు. యూదియా దేశస్తులు గోరింట పుష్పాల నుంచి తీసిన పరిమళ ద్రవ్యాలను స్నానాదుల కోసం, వివాహాలు -ఇతర ప్రముఖమైన పండుగలు “కుర్భాన్-బైరా” మొదలైన సందర్భాల్లో చాలా ఎక్కువగా వుపయోగిస్తారు. అయితే అతి ప్రాచీన భారతీయ వైద్య గ్రంధమైన “సుశ్రుత సంహిత”లో అలంకారంకోసం కూడా దీనిని వాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే దీనికి సఖరంజని అంటే గోళ్ళను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ద్రవ్యంగా పేరుంది.

Also Read వాత వ్యాధులకు మేలైన ఔషధం-అక్కలకర్ర

గోరింట పూలు దిండు కింద పరిచి పడుకుంటే చక్కటి నిద్ర

మహమ్మదీయుల రాకతో-పెదాలు, కాళ్ళు, చేతులు, గోళ్ళను మంచి వర్ణయుక్తంగా చేసికోవటంతో పాటు వెంట్రుకలు నల్లబడకుండా కాంతివంతంగా, నిగనిగలాడుతూ వుండేందుకు దీన్ని వాడటం వల్ల గోరింట ఇంకా వ్యాప్తిలోనికి వచ్చింది. మన దేశంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని వుపయోగిస్తున్నప్పటికీ ఉత్తర, పశ్చిమోత్తర భారతదేశంలో దీనిపై మోజు మరీ ఎక్కువ. ఏమైనప్పటికీ రాజస్థాన్ ప్రజలకు, గోరింటాకుకు మాత్రం ఎంతో అనినాభావ సంబంధముండేదన్నది అక్షరాల నిజం. ఈ గోరింటాకుకు సంబంధించి అనేక విధమైన పాటలు కూడా అక్కడ వాడుకలో వున్నాయి. వారణాసి, లక్నో మొదలగు ప్రాంతాల్లో దీని పుష్పాలను సువాసన ద్రవ్యాలతో కలుపుతారు. హెనిగ్ బర్జెల్ అనే ప్రముఖునికి గ్రీసు దేశంలో రుమాటిజం అనే నొప్పుల వ్యాధి వచ్చి ఇతర ఔషదాల వల్ల అంతగా ప్రయోజనం కనిపించకపోగా దీన్నుపయోగించటం వల్ల ఆ బాధ నుంచి విముక్తుడు కాగలిగినట్లు స్వయంగా వ్రాసుకున్నాడు. ఆయన రోజూ పడుకునే ముందు గోరింటాకు బాగా దంచి అందులో నీరు కలిపి దాన్ని ఆయా భాగాలకు పూసి తెల్లవారి కడిగివేస్తూ ఉండటం వల్ల మంచి ప్రయోజనం చేకూరిందట.”డిక్షనరి ఆఫ్ ఎకనమిక్ ప్రొటక్ట్స్ ఆఫ్ ఇండియా” అనే గ్రంథంలో ఒక – 1 ప్రముఖ వైద్యుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ వెనిగర్, లేక సున్నపు నీళ్ళు కలిపి వాడటం వల్ల కాళ్ళ మంటలు తగ్గిపోతాయని తెలియజేశాడు.

గోరింటాకు, కొంచెం సబ్బు ముక్క కలిపి నీటితో నూరి పై పట్టు వేస్తుంటే దెబ్బల వల్ల కలిగిన వాపులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ పట్లు తగ్గుతాయి, ” గోరింట పూలు దిండు కింద పరిచి పడుకుంటే చక్కటి నిద్ర పడుతుంది. ఒకట్రెండు స్పూన్ల గోరింటాకు రసంలో కొద్దిగా పంచదార కలిపి రోజూ ఉదయం, సాయంత్రం త్రాగుచుంటే మంట, నొప్పితో కూడిన మూత్ర విసర్జన తగ్గుతుంది. గోరింటాకును మెత్తగా నూరి కంతులపై పట్టిస్తుంటే కంతులు కరిగిపోతాయి. పిప్పగోళ్ళపై పట్టిస్తుంటే పిప్పగోళ్ళ సమస్య, వేళ్ళ సంధుల్లో పట్టిస్తే వేళ్ళు పాచిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి. గోరింటాకు, ఉమ్మెత్తాకు, మిరియాలు సమంగా కలిపి మెత్తగా నూరి పట్టిస్తే తామర వ్యాధి తగ్గిపోతుంది. గోరింటాకు పొడి ఇరవై అయిదు గ్రాములు, జీలకర్రను వేయించి చేసిన పొడి ఇరవై అయిదు గ్రాములు కలిపి వుంచుకొని పూటకు అర స్పూను పొడిని అరకప్పు నీటిలో కలిపి రెండు పూటలా తాగుచుంటే రక్త శుద్ధి జరిగి చర్మ రోగాలు నయమవుతాయి. గోరింటాకు పొడి, కరక్కాయ పొడిలను సమానంగా కలిపి వుంచుకుని తగినంత పొడిని నీటితో నూరి పిప్పి గోళ్ళపై పట్టిస్తుంటే పిప్పి గోళ్ళ సమస్య త్వరగా తగ్గుతుంది.

గోరింటాకు పెట్టుకోవడం వల్ల నమ్మకాలు

ఈ గోరింటాకుకు సంబంధించి సమాజంలో అనేక విధమైన నమ్మకాలు ఆ ప్రబలివున్నాయి. ఉత్తర భారతదేశంలో వివాహ సందర్భంలో వివాహానికి ఒక రోజు ముందు కాబోయే దంపతులకు గోరింటాకు పెట్టి అలంకరిస్తారు. కాబోయే భర్త ఆయుష్షు, అత్తగారి ప్రేమ మొదలైన వాటికి, పెండ్లి కుమార్తె గోరింట ఎరుపుదనానికి పరస్పర సంబంధముందనే నమ్మికవుంది. కొందరు స్త్రీలు “లీజ్” పండుగ సందర్భంలో భర్తలు వూరికి దూరంగా వున్నపుడు గోరింటాకు పెట్టుకుంటారు. అలా పెట్టుకోకపోతే భర్తలు తిరిగిరారనే భావనవుంది. అంతేగాక గోరింటాకు మరచిపోయిన స్త్రీ గొడ్రాలవుతుందనే నమ్మకం కూడా ప్రబలివుంది.గర్భిణులు ప్రసవానికి ముందు, ప్రసవమైన పిదప వారి అర చేతులకు, అరికాళ్ళకు గోరింటాకు పూయటం వల్ల త్వరలో కోలుకుంటారట. మెహందితో చిత్రాలు వేయటం స్త్రీలకు – ముఖ్యంగా రాజస్థాన్ వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు వేసే చిత్రాలు చిన్నవి. పెద్దవి అన్నీ కలగాపులగంగా వుండి, అద్భుతంగా వుండటంతో పాటు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. వివిధ రకాలైన పుష్పాలు, తీగలు, ధనుస్సులు, కళశాలు, మనుషులు, జంతువుల బొమ్మలు మొదలైన రకరకాల డిజైన్లు వేస్తారు. ఒక్కొక్క డిజైనుకు ఒక ప్రత్యేకత వుంటుంది.

పుట్టబోయే శిశువు మంచి అదృష్టవంతుడై, ఆరోగ్యంగా వుండేందుకు చిహ్నంగా గర్భిణి అరచేతులకు స్వస్తిక ఆకారంలో గోరింట పెడతారు. తేలు ఆకారంలో గోరింటాకు పెట్టుకుంటే అది ప్రేమకు చిహ్నం. సాధారణంగా పెళ్ళి కూతురుకైతే అరచేతులపై తామరపూలు లేక చేప వంటి చిత్రాన్ని వేస్తారు. ఈ గోరింటాకు పెట్టేవారికి కూడా ఒక ప్రత్యేకత వుంది. పెళ్ళయిన స్త్రీ తన చుట్టూ అయిదు మంది స్త్రీలను కూర్చోబెట్టుకుని మెహంది పాటలు పాడుతూ గోరింటాకు పెట్టడం పవిత్రమైంది. శుభప్రదమైనది. మెహంది కలికం తయారుచేసే విధానం వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా వుంటుంది. పూర్వంలాగా పచ్చి ఆకులను కాకుండా ప్రస్తుతం ఎండిన ఆకులను చూర్ణం చేసి వాడుకోవటం జరుగుతోంది. ఆ చూర్ణాన్ని జల్లెడపట్టి అందులో నీళ్ళు కలుపుతారు. ఎరుపుదనం ఎక్కువగా వచ్చేందుకు ఇతర ద్రవ్యాలను కూడా కలుపుతారు. సాధారణంగా గోరింటాకు పొడిలో చక్కెర నీళ్ళు, టీ డికాక్షన్, లవంగాల పొడి, నీలగిరి తైలం యివన్నీ బాగా కలిపి మృదువైన సన్నటి పుల్ల లేక సూదులతో డిజైన్ వేస్తారు. ఏనుగు దంతాలతో కూడా డిజైన్ వేయటం అలావాటు. మంచి వెన్నెల రాత్రి మెహంది పూసికొని పడుకుంటే చంద్రకిరణాల శీతల స్పర్శ వల్ల చాలా ఎరుపుగా తయారవుతుందనే నమ్మకం వుంది.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top