రాజ్యసభ కు నాగబాబు కు నో ఛాన్స్

No chance for Nagababu in Rajya Sabha

No chance for Nagababu in Rajya Sabha

ఏపీ నుంచి రాజ్యసభకు మూడు సీట్లల్లో రెండు టీడీపీ కీ ఒకటి బిజెపి కీ నాగబాబు కు నో ఛాన్స్

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు మూడు సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వైసీపీకి చెందిన ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఆ సీట్ల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి.

అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో మూడు స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. తొలుత మూడు పార్టీలు ఒక్కో స్థానం పంచుకునేలా ప్రతిపాదన వచ్చింది. దీంతో, జనసేన నుంచి నాగబాబు కు ఖాయమని భావించారు. కానీ, ఇప్పుడు లెక్కలు మారాయి. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురి పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయి.

ఢిల్లీతో చర్చలు – ఖరారు

ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాల భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. కూటమి పార్టీలకే మూడు సీట్లు దక్కనుండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముందుగా మూడు పార్టీలు ఒక్కో సీటు దక్కించుకునేలా ప్రతిపాదనల పైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలకు రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ నేతలే కావటంతో నిర్ణయం మారింది. బీసీల స్థానాల్లో ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వటం ద్వారా విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెర మీదకు వచ్చింది. అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసే సమయంలో వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తోంది. దీంతో, ఇప్పుడు అభ్యర్ధుల ఖరారులో లెక్కలు మారాయి.

బీజేపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య

జనసేన నుంచి రాజ్యసభకు నాగబాబు కు ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగింది. పవన్ తాజా ఢిల్లీ పర్యటనలోనూ నాగబాబుకు పెద్దల సభకు ఎంపిక చేసే అంశం పైన చర్చలు చేసారనే కథనాలు వచ్చాయి. కానీ, తాజాగా బీజేపీ నాయకత్వం ఏపీ నుంచి ఎంపిక చేసే మూడు స్థానాల్లో ఒక స్థానం తమ పార్టీ అభ్యర్దిగా ఆర్ క్రిష్ణయ్యకు తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది. అదే విధంగా బీదా మస్తాన రావుకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ తిరిగి ఆయన్నే ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపనుంది. దీంతో.. ఇక మిగిలిన ఒక్క స్థానం పైన ప్రస్తుతం తర్జన భర్జనలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆర్ క్రిష్ణయ్య సేవలు రాజకీయంగా పార్టీకి వినియోగించుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా క్రిష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. తిరిగి ఇప్పుడు బీజేపీ అభ్యర్దిగా రాజ్యసభకు వెళ్లనున్నారు.

రెండు టీడీపీ – ఒకటి బీజేపీ

ఇక, మూడో స్థానం సైతం టీడీపీకే దక్కేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం టీడీపీ నుంచి పలువురు రేసులో ఉన్నారు. వీరిలో కంభంపాటి రామ్మోహన్‌రావు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, సానా సతీశ్ పేర్లు ఉన్నాయి. పవన్ తన సోదరుడు నాగబాబుకు సీటు కోసం పట్టుబడితే లెక్కలు మారే అవకాశం ఉంది. కానీ, తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ తో ఆయన ఈ పోటీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, రెండు స్థానాలు టీడీపీ..ఒకటి బీజేపీ దక్కించుకోవటం దాదాపు ఖాయమైంది. కాగా, ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్‌, కృష్ణయ్య పదవీకాలం 2026 జూన్‌ వరకు ఉన్నాయి. ఇక..ముగ్గురు అభ్యర్ధుల పైన సోమవారం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top