- నష్టపోయిన మొక్కజొన్న రైతులకు పరిహారం ఇవ్వాలి
- రైతుల కష్టనష్టాలు పట్టించుకోని పాలకులు.
- మండలాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
- క్వింటా రూ. 2.400 ప్రకారం పంటను ప్రభుత్వమే కొనాలి.
వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు పేర్కొన్నారు. బుధవారం మహానంది మండలం బసాపురం గ్రామంలో రైతుల తెలుగు గంగా కట్టమీద ఆరబోసిన మొక్కజొన్న పంటను, పొలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ…120 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.ఒక్కొక్క ఎకరాకు రూ.30,000 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే,వర్షాల వల్ల 30 కింటాలు రావాల్సిన దిగుబడి 15 కింటాలు లోపు మాత్రమే వచ్చిందన్నారు. కోసిన మొక్కజొన్న పంటను తెలుగు గంగా కట్టవెంట మూడు కిలోమీటర్ల వరకు ఆరబెట్టుకుంటే అధిక వర్షం వల్ల, పంట రంగు మారుతుందని, మొలకలు వస్తున్నాయన్నారు.
టార్ఫాలిన్ పట్టాలు కప్పడం, తీయడంలో పంటంతా తడిసి నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని,మద్దతు ధర అమలు చేయాలని రైతులు తమ గోడు విన్నవించుకున్నారన్నారు.మండలంలో బసవపురం గ్రామంతో పాటు జిల్లాలో వ్యాప్తంగా శ్రీశైలం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె నియోజవర్గాల్లో అత్యధికంగా రూ.1, లక్ష57, వేలఎకరాలు సాగుచేసిన రైతులందరూ అధిక వర్షం వల్ల మద్దతు ధరలు, జాడ లేని పంట కొనుగోలు కేంద్రాలు వల్ల తీవ్రంగా రైతాంగం నష్టపోతున్నారన్నారు. ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న కనీసం పలకరింపు కైనా ప్రజాప్రతినిధులు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి నంద్యాల మొక్కజొన్న రైతుల సమస్యలను తీసుకువెళ్లి అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఎకరాకు రూ. 40,000 వేలు నష్టపరిహారం ఇప్పించాలని, తక్షణమే ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని కోరారు.
కేంద్ర, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.2,400 తక్షణం అమలు చేసి ప్రతి రైతు వద్ద ఉన్న మొత్తం పంటను మద్దతు ద్వారా ప్రకారం కొనుగోలు చేసి, మధ్య దళారుల దోపిడీ నుండి ఆదుకోవాలని కోరారు. రైతాంగం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దళారులు క్వింటాలు కేవలం రూ.1,600 రూ.1,700 లకు కొనుగోలు చేస్తూ, తూకాల్లో ఒక్కొక్క బస్తా పై ఐదు కేజీల వరకు తరుగుగా తీసుకుంటూ దోపిడీ చేస్తున్న పాలకులు మాత్రం పట్టినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.ఇప్పటికైనా పాలకులు స్పందించి, మొక్కజొన్న రైతుల కష్టాలు నష్టాలు తెలుసుకోని వారికి మేమున్నాము అని ధైర్యం కల్పించాలన్నారు. పంటలను మద్దతు ధరకు అమ్మించి వారిని ఆదుకోండి అని కోరారు.గురువారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పంట కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరలు, నష్టపరిహారం సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాలో రాజకీయాలకతీతంగా రైతులందరూ పాల్గొని తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు హుస్సేన్ భాష, జ్యోతుల మునియన్న, అక్బర్, సుభాన్, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు











