మన నీరు- మన సంపద కాపాడుకోవడం అందరి బాధ్యత…
రాయలసీమలో కరువు అనేది లేకుండా చేయడమే లక్ష్యం…
ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తాం…
వ్యవసాయ ఆధారిత మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు..
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం- రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం..
శ్రీశైలం దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా కృషి..
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
శ్రీశైలం/నంద్యాల, ఆగస్టు 01:-
మన నీరు మన సంపద దానిని కాపాడుకోవడం అందరి బాధ్యతని రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
గురువారం శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి సుండిపెంట గ్రామంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మనకు మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకుని, శ్రీశైలం ప్రాజెక్టులో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చాను.
గతంలో 20 సంవత్సరాల క్రితం జూలై నెలలో శ్రీశైలం నిండింది. ఇప్పుడు మరలా నిండుగా పరవళ్ళు తొక్కుతోంది. ప్రజలందరి ఆశీస్సులు, మల్లన్న స్వామి అనుగ్రహం లభించింది.
రాయలసీమలో కరువు అనేది లేకుండా చేయడం మనందరి బాధ్యత. ఇది దివంగత ఎన్టీఆర్ కల. మొదటిసారిగా కృష్ణా మిగులు జలాలు వాడుకోవచ్చు అని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారు. తెలుగు గంగ ద్వారా రాయలసీమకు నీరు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీరు ఇస్తామని చెప్పి దాన్ని సాధ్యం చేసిన మహనీయుడు.
ఎన్టీఆర్ హంద్రీనీవా, ఎస్సార్ బీసీ, గాలేరు నగరి రిజర్వాయర్లు ప్రారంభిస్తే వాటిని నేను పూర్తి చేశాను. ఐదేళ్లలో దాదాపు 69 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. వీటి కొరకు గత ప్రభుత్వంలో ఖర్చుపెట్టింది కేవలం 19 వేల కోట్లు మాత్రమే. మేము దాదాపు ప్రతి సంవత్సరం 13600 కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రీ నీవా కొరకు ఐదేళ్లలో 5520 కోట్లు ఖర్చు చేశాం.
గత ప్రభుత్వం కేవలం 515 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అలాగే మేము గాలేరు దగ్గరికి రూ.2050 కోట్లు ఖర్చు చేస్తే, వారు రూ.448కోట్లు ఖర్చు పెట్టారు.
రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని చెప్పారు. కానీ వాటి కొరకు మా పార్టీ పోరాటం చేసాం. మొన్నటి ఎన్నికలు ఒక సునామి. కొన్నిచోట్ల 95 వేల భారీ మెజారిటీ కూడా వచ్చింది. మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిండుగా ఉంది. అలాగే నాగార్జునసాగర్ పులిచింతల కూడా నిండుగా ఉన్నాయి. సముద్రంలోకి వెళ్లే నీటిని అన్ని ప్రాజెక్టులకు పంపితే కరువు అనేది ఉండదు. నీటి విలువ ఎనలేనిది. దీనిని కాపాడుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
CM చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో
నీరు ఉంటే సాగు పెరుగుతుంది ఆహారం ఉత్పత్తి వస్తుంది నిండుగా ఉపాధి లభిస్తుంది. మీ అందరిలో ఒక బాధ్యత ఉండాలి. నీరు మన సంపద. నీరు ఉంటే సంపద సృష్టించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి.
పళ్ళతోటలు ఉద్యాన పంటలు బాగా పండించాలి. రాయలసీమను రతనాల సీమ చేస్తాం… ఇది సాధ్యం. రాయలసీమలో నాలుగు ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
హైడ్రో, విండ్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. రాయలసీమలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్నాం.
ఇందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం. మనందరికీ మంచి గాలి, ఆహారం నీరు కావాలి. ప్రజలందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని నీటిని సంరక్షణ చేయాలి.
యువతలో నైపుణ్యాలు నేర్పించడానికి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేస్తాం. ఎస్సీలకు ఏ,బి,సి,డి కేటగిరైజేషన్ సబబని సుప్రీంకోర్టు ఆమోదించింది. సామాజిక న్యాయం అందరికీ కావాలి. జనాభా ప్రాతిపదికన ప్రతి కులం మతం, వర్గం వారికి న్యాయం చేస్తాం. ఎక్కడ పేదవారు ఉంటే అక్కడ ఈ ప్రభుత్వం ఉంటుంది.
సమాజంలో బాగుపడ్డవారు గ్రామంలో పేదవారిని పైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలి. ఆర్థికంగా బాగా ఉన్న 10మంది బిపిఎల్ కు చెందిన 25 మందిని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంకల్పం తీసుకోవాలి. ఆ భగవంతుని ఆశీస్సులతో రూ. 33 వేల కోట్లు ఖర్చు పెట్టి పెన్షన్లు ఇస్తున్నాం.
సంపదని సృష్టించి అది పేదవారికి పంచిపెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఐదు సంవత్సరాలు కరువు లేకుండా చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ పెంచాలి.
అన్ని రిజర్వాయర్లలో నీటిని పొదుపు చేసి వాటిని సద్వినియోగం చేసుకొని సంపద సృష్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
శ్రీశైలాన్ని దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా సహకారం అందిస్తాం. ఇక్కడి స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం. సిద్దేశ్వరం వద్ద ఐకానిక్ హైవే బ్రిడ్జి తో పాటు రిజర్వాయర్ గా కూడా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాయలసీమ ప్రాంతానికి దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. రాయలసీమ ప్రాంతం ఎగువన ఉంది. ఈ ప్రాజెక్టు దిగువున ఉంది.
ఇక్కడ ఒక బ్యారేజ్ ఉంటే నీటి సమస్య తొలుగుతుంది. సిద్దేశ్వరం వద్ద ఒక ఐకానిక్ బ్రిడ్జి మంజూరు అయింది.
ఆ బ్రిడ్జి తో పాటు అక్కడ ఒక బ్యారేజ్ ఏర్పాటు చేస్తే 60 టీఎంసీల నీరు సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలించాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… 20 సంవత్సరాలు అనంతరం జూలై మాసంలో ప్రాజెక్టు నిండడం శుభదినంగా పేర్కొన్నారు.
అమ్మవార్ల ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు నీరు
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు నిండింది.
అన్నిచోట్లకు నీరు పంపేందుకు కృషి చేస్తాం. గిట్టని వారు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన అవన్నీ అధిగమించి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం.
2014-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి వాటాలకు చాలా సమస్యలు ఉన్నా…
పట్టిసీమ ఏర్పాటు చేసి రాయలసీమకు నీరు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రిది. ఈ ప్రాంతంలో త్రాగడానికి నీరు లేదు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
15 రోజులకు ఒకసారి నీరు వస్తోంది. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కి విన్నవించారు. ఇక్కడ గతంలో అభివృద్ధికి రూ. 17 కోట్లు ఇచ్చారు. 3500 కుటుంబాలకు పట్టాలు ఇచ్చాము. ఇక్కడ భూ ఆక్రమణలు ఎక్కువ అయ్యాయి.
ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు నిరుద్యోగ సమస్య ఉంది ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా,
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గౌరు చరితారెడ్డి,
కోట్ల జయప్రకాశ్ రెడ్డి, గిత్త జయసూర్య, ఎమ్మెల్సీలు, వివిధ నాయకులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్ఓ, నంద్యాల వారి ద్వారా జారీ