ఎండోమెంట్ వద్దు. – వివేక్ లంకమల
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కాశినాయన ఆశ్రమ అన్నదాన సత్రాలు, గోశాల వంటివి కూలగొట్టడం, ఆశ్రమం ఖాళీ చెయ్యండని నోటీసులు ఇవ్వడం గురించి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా చూపించకపోయినా సోషల్ మీడియా, స్థానిక ప్రజలు ఉద్యమించడం సమస్య తీవ్రతను గమనించి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పి, కూలగొట్టినవి తిరిగి కడతామని హామీ ఇచ్చి, ఆగిపోయిన బస్సును పునరుద్ధరిస్తూ సమస్యకు ముగింపు పలకడం సంతోషం.
అయితే కాశినాయన ఆశ్రమానికి సంబంధించిన అసెంబ్లీ చర్చలో దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ‘కాశినాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు.
ఆశ్రమాన్ని ఎండోమెంట్ లో కలిపి, హిందూ ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్వహణ, పూజలు చెయ్యడానికి కాశినాయన దేవుడా..?
కాశినాయన దేవుడు కాదు, ఇంకా చెప్పాలంటే మా అందరికీ తాత. ఇప్పటికీ మేం కాశినాయన తాతనే అంటాం.
“నా కాళ్లకు మొక్కితే ఏమొస్తుందిరా మట్టి తప్ప. ఆకలని వచ్చిన వాడికింత అన్నం పెట్టండి” అని రైతు తత్వాన్ని బోధిస్తూ తిరిగిన అవధూత.
నిత్యం రైతు తత్వాన్ని ప్రచారం చేసినాడు కాబట్టే చుట్టుపక్కల రైతులు పంటలో కొంత భాగాన్ని తమకై తాము స్వచ్ఛందంగా ఇచ్చి నిత్యాన్నదానాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నారు. అలాంటి రైతు ఆశ్రమాన్ని ఎండోమెంట్ లో కలిపి, కొత్త సంప్రదాయ పద్ధతులు నిర్ణయిస్తారా?
సనాతన ధర్మం మీద దాడి అంటూ హిందుత్వ సంస్థలు,
కాశిరెడ్డి నాయనకు అన్యాయం అంటూ రెడ్డి సంఘాలు ఎవరికి వారు తమ తమ ప్రత్యేక కార్యాచరణను ప్రకటిస్తున్నారు.
ఆయన పుట్టుక రెడ్డి కావొచ్చు కానీ ఆయన ప్రచారం చేసిన రైతుతత్వం కులాలకతీతమైనది.
ఆయన గమనం, మరణం హిందువుగా కావొచ్చు కానీ ఆయన ఆచరించి చూపిన నిత్యాన్నదానం మతాలకతీతమైనది. అలాంటి వ్యక్తిని కులానికి, మతానికి పరిమితం చెయ్యడం భావ్యం కాదు.
కాశినాయన పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక ప్రజలు స్వచ్ఛంద విరాళాలతో మొదలుపెట్టిన గుడికి అనుమతులు లేవని పదేళ్లకు పైగా అసంపూర్ణంగా ఉంది. అది పూర్తి చెయ్యాలి. నిత్యాన్నదాన సత్రం ఎప్పటిలాగే నిరాటంకంగా కొనసాగించాలి. ఎండోమెంట్ లో కలిపితే ఫారెస్ట్ అనుమతులతో సహా ప్రభుత్వం నుంచి ఏ సహాయం అయితే వస్తుందని హామీ ఇస్తారో ఆ సహాయం బయటినుంచే ఇచ్చి కాశినాయన ప్రతిపాదించి, ప్రచారం రైతుతత్వాన్ని తర్వాతి తరాలకు అందించాలి.
ఆశ్రమాన్ని ఎండోమెంట్ లో కలిపి స్థానిక విశిష్టత పక్కకుపోకుండా బ్రహ్మంగారి మఠం, మంత్రాలయం రాఘవేంద్రస్వామి, షిరిడీ సాయిబాబా గుడులలాగా ఆశ్రమ నిర్వహణ స్వతంత్రంగా ఉండేలాగా చూడాలి.