షర్మిలాస్త్రం ఎవరిపై ఎవరు ఎక్కుపెట్టినట్లు..?
కురుక్షేత్ర సంగ్రామం జోరుగా సాగుతోంది. కౌరవులు, పాండవులు ఒకరిపై ఒకరు అస్త్ర, శస్త్రాలు సంధించుకుంటూ గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. చివరికి సమఉజ్జీయులైన కర్ణుడు, అర్జునుడుల మధ్యన పోరు రసవత్తరంగా ఉంది.
ఒక దశలో కర్ణుడు ప్రత్యర్థి అర్జునుడి పైకి నాగాస్త్రం సంధించాడు. దీంతో రణక్షేత్రంలో హాహాకారాలు మిన్నంటినాయి. ఇక అర్జునుడి పని అయిపోయినట్టేనని అంతా తలంచారు. అయితే అర్జునుడి రథసారథి అయిన శ్రీకృష్ణుడు సమయానుకూలంగా వ్యవహరించి రథపీఠం కిందికి నొక్కడంతో ఆ అస్త్రం గురి తప్పి అర్జునుడి కిరీటాన్ని మాత్రమే చేదించగలిగింది.
దీంతో కర్ణుడు తీవ్రంగా నిరాశ చెందుతాడు.
అప్పుడు నాగాస్త్రం మళ్ళీ కర్ణుడి చెంతకు వెళ్లి ఇలా అంటుంది.
“ఓ కర్ణుడా..!. ఆ శ్రీకృష్ణుడి మాయోపాయం వలన నా గురి తప్పినది. నీవు చింతించ వలదు. మరి యొక్కసారి నీ విల్లు సంధించి నన్ను ఎక్కుపెట్టు. ఈసారి గురి తప్పకుండా అర్జునుడి శిరస్సు చేదిస్తా.”
అయితే, ఈ ప్రతిపాదనకు కర్ణుడు ఒప్పుకోడు.
“ఓ దివ్యాస్త్రమా… ఖాండవ దహనం లో నీ వాళ్ళ చావుకు కారణం అయ్యాడన్న కసి తో ఆ ఫల్గునుడిపై పగ సాధించేందుకు నాకు అస్త్రంగా మారినావు. కానీ లక్ష్య చేదనలో నీవు విఫలం చెందావు. ఒకసారి సంధించిన బాణాన్ని మళ్ళీ ఎక్కుపెట్టే అలవాటు నాకు లేదు ” అంటాడు.
దీంతో ఈ నాగాస్త్రం కథ ఇంతటితో ముగిసిపోయింది.
అది మళ్ళీ ఇంకెవరికైనా అస్త్రం గా ఉపయోగపడినదీ లేనిదీ మనకు తెలియదు. వేదవ్యాసుడు ఇంకెక్కడా ప్రస్థావించలేదు కూడా.
……
వైస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి షర్మిల అనే అస్త్రాన్ని జైలు నుంచే సంధించాడు.
తాను జగనన్న ఎక్కుపెట్టిన బాణాన్ని అంటూ ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరిక చేసింది. తొలుత వైరి మూకలను చెదరగొట్టి కొన్ని విజయాలు అందించినా, 2014 ఎన్నికలు వచ్చేసరికి ఈ అస్త్రం అంతగా పనిచేయ లేదు.
అయితే, కర్ణుడి లాంటి నియమమేదీ జగన్ పెట్టుకోలేదు.
2019 ఎన్నికల కురుక్షేత్రంలో ఈ షర్మిలాస్త్రాన్ని మరింత పదునెక్కించి అధికార టీడీపీ పైకి వదిలాడు. తాను కర్ణుడిని కాదు అంటూ చెప్పకనే చెప్పాడు.
ఈ సారి బాణం బాగా దూసుకు పోయింది.
“బై బై బాబూ..” అంటూ షర్మిల ఊదిన సమర శంఖం వైసీపీ శ్రేణుల్లో కదనోత్సాహం రెట్టింపు చేయడమే కాదు.. శత్రు గుండెల్లో గింగిరాలు పెట్టింది. జగన్ కు అప్రతిహత విజయాన్ని అందించింది.
…. ఇంతవరకూ బాగానే ఉంది..
అసలు ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియదు కానీ,
ఈ అస్త్రం తెలంగాణ రంగంలో స్వయంగా దిగింది.
చరిత్ర ఏం చెబుతోంది అంటే.. ఒక అస్త్రం ఏదైనా సమర్థంగా పనిచేయాలంటే, ఒక విల్లు ఉండాలి.. దాన్ని ఎక్కుపెట్టే విలుకాడు ఉండాలి.
తెలంగాణ ప్రజలకు ఆది నుంచి ఒకటే అనుమానం.
షర్మిలస్త్రాన్ని తెలంగాణలో ఎవరు ఎవరిపై ఎక్కుపెట్టారో తెలియక గందరగోళంలో పడిపోయారు.
విలుకాడు లేని అస్త్రంలా షర్మిలను దాదాపు పట్టించుకోలేదు. . దీంతో ఈ అస్త్రం చివరికి అసలు కదన రంగంలోనే లేకుండా పోయింది.
……
ఇప్పుడు ఈ షర్మిలాస్త్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో పాలు పంచుకునేందుకు ఉరకలు వేస్తోంది.
యుద్ధ రంగంలో అసలు ఉందో లేదో తెలియని కాంగ్రెస్ అంబులపొదిలో చేరినట్టు చెబుతున్నా… రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరు ఎవరిపై ఎక్కు పెట్టేందుకు ఈ అస్త్రాన్ని సిద్ధం చేశారో..! మాలాంటి పామరులకు అంతు పట్టడం లేదు.
అంబులపొది ఏదైనా కావచ్చు..
సమర్థుడైన విలుకాడు (లేదా విలుకత్తె) లేకుండా ఏ అస్త్రమూ యుద్దాన్ని గెలవలేదు.
అస్త్రం సిద్దమైంది. విలుకాడు ఎవరు అన్నదే తేలాల్సి ఉంది.
రచయిత ;- కాశీపురం ప్రభాకర్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్ )