వాసిరెడ్డి పద్మ రాజీనామా

వాసిరెడ్డి-పద్మ-Vasireddy-Padma-Resignation.jpg

ఆంద్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆమె అందించారు. వాసిరెడ్డి పద్మ రాజీనామాతో వైసీపీకి మరో షాక్ తగిలిందని భావించారు. కానీ.. తాజాగా ఆమె పదవికి ఎందుకు రాజీనామా చేశారో వివరించారు.వైసీపీ కోసం ఎన్నికల్లో పని చేయడం కోసమే రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు అర్థం చెప్పిన పాలన గురించి ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గురువారం విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. పేద ప్రజలు బాగుపడాలంటే జగన్‌ కలకాలం సీఎంగా ఉండాలని ప్రజలకు చెప్పాలనే సదుద్దేశంతో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే తన స్వస్థలం జగ్గయ్యపేట నుంచి పోటీ చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో మహిళా సాధికారత అంటే ఏమిటో చూపించిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని కొనియాడారు. గత ప్రభుత్వాలు చెప్పిన మహిళా సాధికారత మాటలకే పరిమితమైతే.. ఈ ప్రభుత్వం మాత్రం అది చేసి చూపించిందన్నారు. కుటుంబానికి కేంద్రం మహిళ అని నిరూపించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని కితాబిచ్చారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రతి మహిళ భుజానికి ఎత్తుకోవాలని పిలుపునిచ్చారు వాసిరెడ్డి పద్మ.

అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీ కోసం పనిచేసేందుకే పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల గురించి ఆలోచించేవారు, మహిళల ఎదుగుదలకు కృషి చేసేవారు, వారంతా బాగుండాలని కోరుకునేవారంతా వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. తాను రాజకీయాల్లోకి రాకముందు అనేక సంఘాల్లో పనిచేశానని, ఒక న్యాయవాదిగా మహిళల కష్టాల్ని చూశానన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పల్లె ప్రాంతాల్లో సైతం మహిళా సాధికారత కనిపిస్తోందని, మహిళల కోసం కృషిచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మీడియా మిత్రులు ప్రశ్నించగా.. పోటీ చేయాలన్న ఆలోచనతో రాజీనామా చేయలేదన్నారు. పార్టీలో పోటీ చేసే అర్హత, ఆలోచనలు చాలా మందికి ఉన్నా.. కొంతమంది వ్యక్తులుగా నష్టపోయినా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. కాగా.. వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీఓ విడుదల చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టక ముందు ఆమె వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. డిగ్రీ వరకూ చదువుకున్న ఆమె.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత 2012లో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top