వివేక్ లంకమల -Tiger Nallamala
2024 జూన్ 17 వ తేదీ కారుపై పెద్దపులి దాడి వార్త సంచలనం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె వద్ద జరిగిందీ సంఘటన.
ఇంజిన్ భాగం నుజ్జు నుజ్జయిన తీరు చూస్తే కారు చాలా వేగంగా వెళ్తున్నట్టు ఉంది. వేగంగా వెళ్లే కారు మీద పెద్దపులి అంత మూర్ఖంగా దాడి చేస్తుందా?
పులి దాడి చెయ్యని పక్షంలో పులి రోడ్డు దాటుతుండగా పొరపాటున ఢీకొట్టి, వైల్డ్ లైఫ్ చట్టాలకు భయపడి అదే మా కారు మీద దాడి చేసినట్టుగా చెప్పే అవకాశం కూడా లేకపోలేదు.
బాగైతే సరే లేదంటే అసలే సున్నిత మనస్కురాలైన పులి(వేటలో కాదు జీవన శైలిలో) కనపడని గాయాల వల్లనో,
తనకేం జరుగుతుందో తెలియని మానసిక సంఘర్షణ వల్లనో ఎక్కడోచోట నడక ఆపుతుంది.

ఇవన్నీ పక్కనపెడితే అసలు పులి అక్కడి వరకూ ఎలా వచ్చిందనేది పెద్ద ప్రశ్న.
పెద్ద పులుల సంరక్షణలో భాగంగా 1973 లో ప్రాజెక్ట్ టైగర్ మొదలుపెట్టారు. నల్లమల కేంద్రంగా..
1983 లో నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏర్పాటైంది. 2018 పులుల గణన ప్రకారం NSTR లో 73 పెద్ద పులులు ఉన్నాయి. ఇప్పుడవి ఇంకా పెరిగుండొచ్చు.
పులి స్వేచ్ఛా జీవి. తన టెరిటరీకి అది రారాజు. పులుల సంఖ్య పెరిగేకొద్ది టెర్రిటరీ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.
ఆ ఒత్తిడి తగ్గాలంటే దాని పరిధి విస్తృతమవ్వాలి. నల్లమల తర్వాత పులికి ఆవాసంగా కాగల అవకాశం శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ లో ఉంది.
కానీ ఎలా శేషాచలంలోకి ఎలా నడిపించాలనేది పెద్ద సవాలు.
అదే ఈ నల్లమల శేషాచలం వయా లంకమల.
మహబూబ్ నగర్, నల్గొండ దగ్గర మొదలయ్యే నల్లమల కర్నూలు, పశ్చిమ ప్రకాశం నుంచి దక్షిణాన కడప జిల్లాలోని వనిపెంట వరకూ వ్యాపించి ఉంటాయి.
అక్కన్నుంచి ఎద్దడుగు కనుమ బ్రహ్మంగారి మఠం, జంగంరాజు పల్లె బీట్ నుంచి బద్వేల్ మైదుకూరు మధ్యన భొగాది కనుమ దాటితే లంకమల వస్తుంది.
లంకమలకు పులి చుట్టం చూపుగా వచ్చిపోవాల్సిందే తప్ప ఇక్కడ ఉండేదానికి లేదు. శాపం అంటారు పెద్దోళ్లు.
మల్లెంకొండ గురించి కూడా ఇదే ప్రచారంలో ఉంటుంది. నిజానికి లంకమల, మల్లెంకొండలో దోమలెక్కువ. దోమలున్న చోట పులి నిలబడదు.
లంకమలకు దక్షిణాన సిద్ధవటం చుట్టుపక్కల పెన్నా నదిని దాటి భాకరాపేట పరిసరాల్లో ..
పాలకొండలు చేరడంతో శేషాచలంకు మార్గం దొరుకుతుంది. అక్కన్నుంచి అదొక స్వేచ్ఛా ప్రపంచం.
అయితే లంకమల నుంచి దక్షిణం వైపు పోకుండా హరిపాయ కనుమ(సిద్ధవటం – అట్లూరు) మీదుగా తూర్పుకు నడిచిందంటే..
పెనశిల లక్ష్మీ నరసింహా వైల్డ్ లైఫ్ శాంక్చుయరీలోకి చేరుతుంది. ఇక్కడ సోమశిల డ్యాం దానికి పెద్ద అడ్డంకి. తూరుపు కొండ రిజర్వ్ ఫారెస్ట్, మల్లెంకొండ మీదుగా వెలిగొండల్లోకి చేరుతుంది.
వెలిగొండల మీదుగా పెంచలకోన
వెలిగొండల మీదుగా పెంచలకోన, రాపూరు ఘాట్, రైల్వే కోడూరు మీదుగా శేషాచలం వైపు నడిచే అవకాశం ఉంది గానీ సోమశిల డ్యాం పెద్ద అడ్డంకి.
- సీతారామపురం మీదుగా కంభం రిజర్వ్ ఫారెస్ట్
దాటే అవకాశం తక్కువ. అందుకని ఉదయగిరి, సీతారామపురం మీదుగా కంభం రిజర్వ్ ఫారెస్ట్ వైపు, అటునుంచి తిరిగి నల్లమల వైపు కదిలే అవకాశం లేకపోలేదు.
లంకమలలో పులి అడుగులు, సీసీ టీవీ ఫుటేజెస్ 2018 లో కనిపించాయి. తర్వాత వనిపెంట, ఇటుగుళ్లపాడు, వరికుంట్ల వంటి నల్లమల పాద ప్రాంతాల్లో,
అరటి తోటల్లో పులి సంచరిస్తున్నట్టు రికార్డ్స్ ఉన్నాయి. గత సంవత్సరం కూడా బ్రహ్మంగారి మఠం చుట్టుపక్కల, వంకమర్రి డ్యాం దగ్గర పులి తిరిగిన వార్తలు బయటికి వచ్చాయి.
అక్కడ తిరిగిన పులి బీ.కోడూరు, నక్కలగండి మీదుగా బద్వేల్ పెద్ద చెరువు, కాలువపల్లె, బోయినపల్లె మీదుగా వెలిగొండలు చేరింటది.
వెలిగొండలు తూర్పు పాద ప్రాంతమైన చాబోలు పరిసరాల్లో పులి సంచరినట్టు ఈ మధ్య కొంతమంది స్థానికులు చెప్పారు.
అది మర్రిపాడు మండలం. ఈ యాక్సిడెంట్ జరిగిన కదిరినాయుడు పల్లె కూడా మర్రిపాడు మండలమే.
నిన్న పెద్దపులి, మొన్న వనిపెంట దగ్గర పునుగుపిల్లి, నల్లమలలో చిరుతపులి, అంతకముందు అట్లూరు వద్ద ఎలుగుబంటి వంటి సంఘటనలు..
మనిషి వేగం అమాయకమైన వణ్యప్రాణులకు ప్రాణ సంకటం అని గుర్తుచేస్తుంటాయి. అదే మాట మనిషితో అంటే ఎక్కడో ఒకటీ అర యాక్సిడెంట్లు జరుగుతున్నాయని నా పరుగును ఆపాలా అంటాడు.
ఏదైతేనేం రిజర్వ్ ఫారెస్ట్ అయితే తప్ప అడవి చివరి అంచు వరకూ సాగిపోతున్న మనిషి, తరిగిపోతున్న పాద ప్రాంతపు పొద అడవులు,
లైట్లు, వాహనాలు, డ్యాములు, పొలాలకు వేసే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ లు ఏదైతేనేం పులి మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది.
మనిషి నుంచి పులికి, పులి నుంచి మనిషికి జరిగే సంఘర్షణలో పులికి చట్టపరమైన రక్షణ ఉంది
కానీ సామాజికంగా అది ఏకాకి. అంతిమంగా మనిషికే రక్షణ దొరుకుతుంది.
నల్లమల పులి శేషాచలంలోకి అడుగుపెట్టడానికి లంకమల, బద్వేల్ ప్రాంత ప్రజలు, పరిస్థితులు పులిని తమ జీవినంలో భాగం చేసుకుని సంయమనం పాటించక తప్పదు.