తరంగిణి తెలివి – చందమామ కథలు

Tharangini's intelligence - chandamama kathalu

Tharangini's intelligence - chandamama kathalu

చింతలపూడి అనే గ్రామంలో వుండే చెన్నయ్య ఇరవై ఏళ్ళవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా, వాణ్ణి పెంచి పెద్దచేసిన అవ్వ, చనిపోయే ముందు, వాడికి తను కూడబెట్టిన ఐదువేల రూపాయలు అటకమీద జాడీలో వున్నవని చెప్పి, “ఒరే, చెన్నా! నువ్వు అమాయకుడివి, భయస్థుడివి. ఈ సంగతి గ్రామంలో అందరికీ తెలుసు. కనక, నువ్విక్కడ సుఖంగా బతకలేవు. అందువల్ల డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి, నాలుగు గేదెలు కొనుక్కుని పాల వ్యాపారం చేసుకో. నోరులేని జీవాలు నీకు కీడు చెయ్యవు!” అని చెప్పింది.

చెన్నయ్య, అవ్వ చెప్పినట్టే చేయాలనుకుని వారం తర్వాత పట్నం ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగాడు. పట్నంలో ముందు అద్దె ఇల్లొకటి చూసుకుని, తర్వాత సామాను తీసుకుని వెళ్ళిపోవాలన్నది వాడి ఆలోచన. అయితే, ఇంట్లో ఐదువేలు వుంచి, ఇంటికి తాళం పెట్టడం ప్రమాదం! అవ్వ అప్పుడప్పుడు గ్రామంలోని షావుకారు శెట్టి దగ్గిర డబ్బును దాచడం ఎరిగిఉన్న చెన్నయ్య డబ్బును ఒక సంచీలో వేసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో శెట్టికీ, ఆయన భార్యకూ తగువు జరుగుతున్నది. రెండురోజుల్లో రాబోతున్న తన తల్లి కోసం కొత్తచీర ఒకటి కొనుక్కురమ్మని పోరుపెడుతున్నది. శెట్టి భార్య, ఆమె తల్లి, మొక్కుబడి తీర్చేందుకు తిరుపతిపోతూ, దారిలోవున్న తన కూతురింట ఒకరోజు గడపబోతున్నది. “దారేపోయే వాళ్ళందరికీ చీరలూ సారెలూ పెడితే, ఇల్లుగుల్లవుతుంది, నావల్ల కాదు!” అంటూ అరుస్తున్నాడు శెట్టి.

“మా అమ్మ అట్లా దారేపోయే మనిషా? ఒక చీర తెస్తే నీ కొంపేమీ కూలదులే!” అంటూ భర్తకంటే బిగ్గరగా అరిచింది శెట్టి భార్య. “చీరకాదు ముందు కురమాడుతున్నట్టున్నది. వంటింట్లోకి తగలడు!” అన్నాడు శెట్టి వంటింటికేసి చేయిచూపుతూ. చెన్నయ్య రావడంచూసి శెట్టి భార్య అప్పటికీ మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చెన్నయ్య తన ప్రయాణం గురించి శెట్టికి చెప్పి, “రెండురోజుల్లో అక్కడ అద్దె ఇల్లు చూసుకుని వచ్చేస్తాను. అప్పటిదాకా, ఈ ఐదువేలూ మీ ఇంట్లో దాచిపెడితే, మీ మేలు మరవను!” అన్నాడు డబ్బుసంచీ శెట్టి చేతికిస్తూ. “దానికేం భాగ్యం, చెన్నయ్యా! దిక్కులేనివాళ్ళకు సహాయపడితే, ఆ పుణ్యం ఊరికేపోదు గదా!” అన్నాడు శెట్టి. ఆ సమయంలో భర్తమీద కోపంతో ఉడికిపోతున్న శెట్టి భార్య, కాళ్ళతో నేలను గట్టిగా తాటిస్తూ మంచినీళ్ళకుండ ఎత్తి బలంగా గోడకేసికొట్టింది.

ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి తలుపుతీసి

also read మనిషికి శాపం ! – చందమామ కథలు

ఆ ధ్వనికి హడలిపోయిన చెన్నయ్య, “ఇల్లంతా అదిరిపోతున్నది! ఏమిటీ విపరీతం శెట్టిగారూ?” అన్నాడు. ఏం చెప్పాలో తెలియని శెట్టి, “అదా… భూకంపం, చెన్నయ్యా, భూకంపం! నువ్వు క్షేమంగా పట్నంవెళ్ళి లాభంగా తిరిగిరా” అంటూ చెన్నయ్యను బయటికి సాగనంపాడు. చెన్నయ్య మర్నాడు పట్నంచేరి, అద్దె ఇంటికోసం అక్కడాయిక్కడా తిరిగి విసిగిపోయి, సాయంత్రానికి పట్నానికి పెడగావున్న ఒక ఇంటిని చూసి మంచినీళ్ళకోసం ఆ ఇంటి తలుపు తట్టాడు. ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి తలుపుతీసి “ఏం కావాలి?” అన్నది చెన్నయ్యవంక అనుమానంగా చూస్తూ. “మంచినీళ్ళు” అన్నాడు చెన్నయ్య. “నాన్నా, నువ్విలారా! ఎవరో వచ్చారు” అంటూ పెరట్లో వున్న తండ్రిని కేకపెట్టి, ఆయన వచ్చాక మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళిందామె.

దిక్కులు చూస్తున్న చెన్నయ్యతో “ఏమీ అనుకోకు బాబూ! నేనూ, అమ్మాయి తరంగిణి మాత్రమే. ఈ లంకంత ఇంట్లో వుంటున్నాం. కొత్తవాళ్ళు ఎవరు వచ్చినా కొద్దిగా భయంగానూ, అనుమానంగానూ వుంటుంది. పక్కవాటా అద్దెకు ఇద్దామంటే – పట్నానికి దూరం కదా! ఎవరూ రావడంలేదు” అన్నాడు తరంగిణి తండ్రి ముకుందం.
చెన్నయ్య, తరంగిణి తెచ్చియిచ్చిన మంచినీళ్ళుతాగి, తను ఎందుకు పట్నం వచ్చాడో చెప్పి, “గేదెలను పెట్టుకోవడానికి అభ్యంతరంలేకపోతే మీ పక్కవాటాలోకి అద్దెకు వస్తాను” అన్నాడు. ముకుందం, చెన్నయ్య పేరు అడిగి తెలుసుకుని “నువ్వు రేపే మా ఇంటికి అద్దెకు రావొచ్చు. అద్దె ఎంత ఇచ్చినా ఫర్వాలేదు” అన్నాడు ఆనందంగా.తరంగిణి కల్పించుకుని “ఏ వ్యవహారం అయినా ఖచ్చితంగా తేల్చుకోవాలి. అద్దె నెలకు వందరూపాయలు!” అన్నది.

రెండు రోజుల్లో సామాను తీసుకుని వచ్చేస్తానని చెప్పి తన ఊరు తిరుగు ప్రయాణమయ్యాడు చెన్నయ్య. చెన్నయ్య శెట్టి ఇంటికి తను దాచిన డబ్బు తీసుకోవడానికి వెళ్ళేసరికి నలుగురితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు శెట్టి. “నేను పట్నం వెళ్ళిపోతున్నాను శెట్టిగారూ!” అన్నాడు చెన్నయ్య. “శుభం, వెళ్ళిరా!” అన్నాడు శెట్టి. “వెళ్ళాక తిరిగి వచ్చేదిలేదు. అక్కడ గేదెలు కొని పాల వ్యాపారం మొదలు పెడతాను. నా ఐదువేలూ ఇవ్వండి” అన్నాడు చెన్నయ్య. “ఐదువేలా? ఏమిటీ రూపాయలే! ఐదుకాన్లకు కొరగాని వెర్రివెధవ్వి, నా దగ్గర ఐదువేలు దాచావా! ఎప్పుడూ?” అంటూ కళ్ళెర్రచేశాడు శెట్టి. చెన్నయ్య నివ్వెరపోయి, “ఎప్పుడంటారేమిటి? భూకంపం వచ్చిన రోజున యిచ్చాను. దయచేసి నెమ్మదిగా గుర్తుచేసుకోండి” అన్నాడు. శెట్టి భళ్ళుననవ్వి, “నేను పుట్టిబుద్దెరిగి, భూకంపం రాలేదీ ఊళ్ళో. మీరెవరైనా ఎరుగుదురా?” అని అడిగాడు చుట్టూ వున్న వాళ్ళను. “ఎరగం! ఎరగం!” అన్నారు వాళ్ళు. “అవ్వ పోయాక అమాయకపు వెధవకు అతి తెలివి అబ్బినట్లుంది! అవతలికిపో” అంటూ చెన్నయ్యను తరిమేశాడు శెట్టి.

తరంగిణి కొంతసేపు ఆలోచించి

శెట్టితో గట్టిగా పోట్లాడలేక, లోలోపల దుఃఖిస్తూ, పట్నానికి వెళ్ళి జరిగిందంతా ముకుందానికి చెప్పి, “ఇక ఆ ఊళ్ళోనే ఆపనీయీపనీ చేసుకుని పొట్టపోసుకుంటాను. మీ ఇంట్లో అద్దెకు రావడంలేదనీ చెప్పడానికే వచ్చాను” అన్నాడు చెన్నయ్య. ఇది విన్న ముకుందం బాధగా, “అలాగేలే బాబూ! ఎవరికెక్కడ ప్రాప్తమో!” అన్నాడు. ఐతే పక్కనేవున్న తరంగిణి కల్పించుకుని “అదేంమాట నాన్నా! ఆ శెట్టిలాంటి మోసకారిని మార్చలేకపోయినా ఈయన డబ్బు తిరిగి వచ్చేలా చేయవద్దూ” అన్నది. “సరే, మనమేం చేయగలం?” అన్నాడు ముకుందం నిరాశగా. తరంగిణి కొంతసేపు ఆలోచించి, “ఇలా చేయండి!” అంటూ, ఏం చేయాలో ఇద్దరికీ వివరించి చెప్పింది. కూతురు ఇచ్చిన రేకుపెట్టె చేత్తో పట్టుకుని, అప్పటికప్పుడు చెన్నయ్య వెంట వాళ్ళ ఊరుకు బయల్దేరాడు ముకుందం.

వాళ్ళు ఊరు చేరేసరికి బారెడు పొద్దెక్కింది. చెన్నయ్య, శెట్టి ఇల్లు ముకుందానికి చూపించి, తను మాత్రం వీధిమొగలోనే ఆగిపోయాడు. ముకుందం, శెట్టి ఇంటికి వెళ్ళేసరికి, శెట్టి ముందు గదిలో కుర్చీలో కూర్చుని వున్నాడు. ముకుందాన్ని చూస్తూనే “ఎవరు? మీరు ఏం పని మీద వచ్చారు?” అని అడిగాడు గుచ్చిగుచ్చి చూస్తూ. “అయ్యా, నేను చెన్నయ్య కాబోయే మామగారిని” అన్నాడు ముకుందం, శెట్టి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ. చెన్నయ్య పేరు వింటూనే శెట్టి ఉలిక్కిపడి, “ఇంతకూ మీరొచ్చిన పనేమిటో చెప్పలేదు” అన్నాడు. “చెన్నయ్య పెళ్ళి ఇక్కడి రామాలయంలో చేస్తానని అతడి అవ్వ మొక్కుకున్నదట! పెళ్ళి ఖర్చులకోసం డబ్బు తెచ్చాను అరవైవేలు” అంటూ ముకుందం, పక్కనేవున్న రేకు పెట్టె చూపించి, “పెళ్ళిపనులు ఆరంభమయ్యాక, అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా డబ్బు తీసుకుంటాను. పెద్ద గృహస్థులు! దీన్ని మీ దగ్గిరే వుంచండి! శ్రమ యిస్తున్నాను” అన్నాడు.

“శ్రమా! మీరు పెద్దవారు. ఏదో ప్రాథేయపడుతున్నట్టు మాట్లాడకూడదు, ఆజ్ఞాపించాలి. డబ్బును మహారాజుగా మా ఇంట్లో దాచుకోవచ్చు” అన్నాడు శెట్టి అతి వినయంగా. ఇంతలో చెన్నయ్య హడావిడిగా లోపలికి వచ్చి శెట్టితో, “నేను రెండురోజుల క్రితం వచ్చినప్పుడు మీకు ఐదువేలు ఏరోజు ఇచ్చానని అడిగారు కదా? ఆ రోజు మీ ఇంట్లో కూరమాడిపోయింది. ఏదో భూకంపం కూడా వచ్చిందన్నారు” అన్నాడు తరంగిణి అనమన్నట్టుగా.శెట్టి కుర్చీలోంచి లేచి చెన్నయ్య భుజంమీద చెయ్యివేసి, “నువ్వు నా దగ్గర ఐదువేలు దాచడం గుర్తులేకకాదు, ఆ రోజు నిన్ను గట్టిగా కసిరింది. ఆ సమయంలో నా పక్కన ఒక జూదరీ, తాగుబోతూ వున్నారు. వాళ్ళకు అప్పుగా డబ్బు కావాలట, లేదన్నాను. ఒకవేళ నీ ఐదువేలూ నీకిస్తే వాళ్ళు నిన్ను వెంబడించి భయపెట్టి, ఆ డబ్బు గుంజుకుపోయేవాళ్ళు. నువ్వసలే అమాయకుడివి, పిరికివాడివి. ఇదుగో, ఇప్పుడే నీ ఐదువేలూ ఇస్తాను” అంటూ లోపలిగదిలోకి పోయి డబ్బు సంచీ తెచ్చి చెన్నయ్యకిచ్చాడు.

రెండురోజుల్లో పట్నం మకాంమార్చిన చెన్నయ్య

చెన్నయ్య డబ్బు అలా అతడికి చేరగానే ముకుందం కుర్చీలోంచి దిగ్గున లేచి, శెట్టితో “అయ్యా, మీ మేలు ఈ జన్మకు మరవలేను. మీ మాటలవల్ల, ఈ చెన్నయ్య నైజం ఎలాంటిదో తెలిసిపోయింది. మా అమ్మాయి తరంగిణికి అమాయకులన్నా, పిరికివాళ్ళన్నా తగని రోత! నేనీ పెళ్ళి చేయదలచలేదు!” అంటూ రేకుపెట్టె తీసుకుని బయటికి నడిచాడు.చాలా బరువుగా వున్నట్టు కనబడే పెట్టెతో ముకుందం, వెనకనే ఐదువేల రూపాయల సంచీతో చెన్నయ్యా పోతూంటే, “అయ్యో, అరవైవేలు చేజారిపోయాయే!” అనుకుంటూ శెట్టి కుర్చీలో చేరగిలపడిపోయాడు. రెండురోజుల్లో పట్నం మకాంమార్చిన చెన్నయ్య, ముకుందం, తరంగిణులకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుని “నా జీవితం నిలబెట్టిన పుణ్యం మీదే! మీ రుణం ఎలా తీర్చుకోగలను” అన్నాడు. ఆ మాటలకు ముకుందం నవ్వి, “మా అమ్మాయిని పెళ్ళి చేసుకొని! నీ మంచితనానికి, మా తరంగిణి తెలివితేటలు తోడయితే, మీ జీవితం మూడు పూవులూ, ఆరుకాయలుగా వుంటుంది” అన్నాడు.
తనకు అంత అదృష్టం పట్టడం నమ్మలేక, చెన్నయ్య ఆశ్చర్యంగా తరంగిణికేసి చూశాడు. ఆ ఆలోచన తనదే అయినందుకు సిగ్గుతో తలదించుకున్నది తరంగిణి.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top