బంగారు ఛాయ.. నలుపు రంగు చారలతో ఆకర్షణీయంగా ఉండే పెద్దపులి వన్యప్రాణుల్లోనే తిరుగులేని రారాజుగా కీర్తి గడిచింది. ఇది ఎంతటి గాంభీర్యంగా కనిపిస్తుందో అంతే క్రూరత్వాన్ని కలిగి ఉంటుంది. మిగతా వన్యప్రాణుల కన్నా పెద్ద పులి జీవన విధానం భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి వేల సంవత్సరాల నుంచే భూమిపై పెద్దపులులు తమ ఉనికిని చాటుకున్నాయి. అయితే 20వ శతాబ్దం ఆరంభం నుంచి ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.
దీంతో పర్యావరణ పరిరక్షణలో త్రికోణ అగ్ర భాగాన నిలిచిన పులులను సంరక్షించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగానే 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో టైగర్స్ సమ్మిట్ను నిర్వహించి 2022 నాటికి రెట్టింపు సంఖ్యలో పులుల సంతతిని పెంచాలని నిర్ణయించారు. అలాగే 13 దేశాల శిఖరాగ్ర సదస్సులో పులుల సంతతి ఉన్న దేశాల్లో ప్రతిఏటా జూలై 29వ తేదీన వరల్డ్ టైగర్స్ డేను నిర్వహించాలని ప్రకటించారు. ఈ క్రమంలో 1972 నవంబరు 18వ తేదీన పెద్దపులిని జాతీయ జంతువుగా ప్రకటించి వాటి సంరక్షణ కోసం భారతదేశం ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేసింది.
29 జులై ‘వరల్డ్ టైగర్స్ డే’ సందర్భంగా కథనం
దేశానికే తలమానికం నల్లమల :- నల్లమలలో విస్తరించిన నాగార్జున సాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పులుల సంరక్షణలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల 20 3727.82 చ.కి.మీల పరిధిలో విస్తరించి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇందులో 2444 చ.కి.మీ. కోర్ ఏరియా ఉండగా, 1283.82 కి.మీ. బఫర్ ఏరియా గుర్తించారు. కాగా గత ఏడాది మార్చిలో నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలోని ముసలిమడుగు సెక్షన్లోని పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో ఓ పెద్దపులి నాలుగు ఆడ పులికూనలకు జన్మనిచ్చింది.
అయితే తల్లిపులి నుంచి పులికూనలు దూరమైనప్పటికీ ఒకే ఈతలో ఏకంగా నాలుగు పులికూనలకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తల్లి నుంచి దూరమైన పులికూనలు ప్రస్తుతం తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూపార్క్ లో ఉన్నాయి. వాటిలో ఒక పులికూన మరణించగా మిగినవి సురక్షితంగా ఉన్నాయి. రెండేళ్ల తర్వాత వాటిని తిరిగి నల్లమల అడవిలోనే వదిలేస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.
- ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన వన్యప్రాణి పెద్దపులి
- ఎన్ఎన్టీఆర్లో పెరిగిన పులుల సంతతి
- సంరక్షణలో దేశానికే తలమానికంగా నల్లమల
శేషాచలం కారిడార్ లోకి పెద్దపులి :- దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్ గా పేరుగాంచిన నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇదే క్రమంలో పులి ఆవాస పరిధిని దాటి శేషాచలం అడవుల వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గతంలో రెండు పులులను కడప జిల్లా పరిధిలోని లంకమల అటవీ ప్రాంతంలో గుర్తించారు. అలాగే చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవిలో కూడా ఓ పెద్దపులి ఉన్నట్లు నిర్ధారించారు.
నెల్లూరు జిల్లాలోకి నల్లమల టైగర్
అంతేగాకుండా గత ఏడాది నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సమీప అటవీ ప్రాంతంలో కూడా ఓ పులి పాదముద్రికను ఆటవీ అధికారులు గుర్తించారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
కాకినాడ, ఏలూరు జిల్లాల పరిధిలోని పాపికొండల నేషనల్ పార్కు పరిధిలో రెండు పులులు ఉన్నట్లు వెల్లడైంది. దీన్నిబట్టి నల్లమలలో పులుల సంతతి పెరగడంతోనే వాటి ఆవాసాన్ని పెంచుకునేందుకే పులుల ఇతర ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే పులి సంచారాన్ని శేషాచలం అడవుల్లోకి విస్తరించాలని ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నల్లమలలో పులుల సంఖ్య రెట్టింపవుతున్న క్రమంలో టైగర్ కారిడార్ను పెంచే అవకాశం ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు.
పెద్దపులుల ప్రాదేశిక ప్రవర్తన ఇలా ..
పులులు సాధారణంగా ఒంటరిగానే జీవనం సాగిస్తాయి. పులి సంచరించే ప్రాంతాన్ని పెద్దపులి టెరిట రీగా భావిస్తారు. ఆడపులి సుమారు 20 చదరపు కి.మీ. వరకు తన నివాస స్థానాన్ని ఎంచుకోగా, మగపులి 60 నుంచి 100 చదరపు కిమీల విస్తీర్ణాన్ని నివాస స్థావరంగా ఏర్పరచుకుంటుంది. అది జీవించే ప్రాంతం లోకి తనకు హాని కలిగించే మరే ఇతర జంతువును కూడా తన టెరిటరీలోకి ప్రవేశించకుండా అన్ని జాగ్ర త్తలు తీసుకుంటుంది.
పెద్దపులుల సంతాన ప్రక్రియ
సాధారణంగా నవంబరు, ఏప్రిల్ మధ్య వీటి పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుందని జంతు పరిశోధకులు నిర్ధారించారు. ఆడపులి కలయిక కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత సమయంలో జతకూటడం తరుచుగా జరుగుతుంది. గర్భాధారణ సమయం 16 వారాలు ఉంటుంది. ఒక ఈతలో సుమారు కిలో గల 2 నుంచి 4 కూనలకు జన్మనిస్తాయి. ఇవి గుడ్డిగా, నిస్సహాయంగా జన్మిస్తాయి. దట్టమైన ప్రాంతాలు, రాతిపగుళ్ల వంటి ప్రాంతాల్లో వాటిని ఉంచి ఆడపులులు ఆహార సేకరణకు వెళ్తాయి. పూర్తిస్థాయి పులికూనల సంరక్షణ ఆడపులుల పెంపకంలోనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మగపులులు ఆడపులులతో జతకూడటం కోసం పులి కూనలను చంపివేస్తాయి. ముందు ఈతలో కూనలు చనిపోయినట్లయితే ఆడపులి తరువాతి ఈతకు ఐదు నెలలోపు సిద్ధమవుతుంది. మరణాల రేటు పులులలో చాలా అధికంగా ఉంటుంది. సగం కంటే ఎక్కువ పులులు రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా బతకలేవు.
NSTR లో 80కి పైగా పెద్ద పులులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో పులుల సంతతి ఆశాజనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి 2022 పెద్దపులుల జాతీయ గణాంకాల ప్రకారం.. నాగార్జునసాగర్ -శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎన్టీఆర్) పరిధిలో 74 పులులు ఉన్నట్లు అంచనా వేశారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఫేస్ 4 కింద నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో అత్యాధునిక డిజిటల్ కెమెరాల ద్వారా.. పులుల గణాంకాల ప్రక్రియ చేపట్టారు. ఇందులో మొత్తం 1135 లొకేషన్లను గుర్తించి ఒక్కో చోట ఒకజత ఇన్ఫారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి సుమారు 3 లక్షల ఫొటోలను సేకరించారు.
NSTR పరిధిలో 80కి పైగా పెద్దపులు
వాటిని సున్నిపెంటలోని జీవవైవిధ్య కేంద్రంలో బయాలజిస్ట్లను పరిశోధించి చివరకు మూడు వేల ఫొటోలను ఎంపిక చేశారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి NSTR పరిధిలో 80కి పైగా పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారు.
పర్యావరణ పరిరక్షణలో పెద్దపులే కీలకం – వి.సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్
పర్యావరణ పరిరక్షణలో పెద్దపులే ప్రధాన భూమిక పోషిస్తోంది. ఎక్కడైతే పెద్దపులుల ఆవాసం అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని గుర్తించే ప్రపంచ దేశాలన్ని పెద్దపులి సంరక్షణ కోసం కసరత్తు సాగిస్తున్నాయి.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
ప్రతిఏటా జూలై 29వ తేదీన వరల్డ్ టైగర్స్ డే సందర్భంగా వివిధ రూపాల్లో పులుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఇందులో ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలోని ఆయా రేంజ్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం, క్విజ్ తదితర పోటీలను నిర్వహించి అవగాహన కల్పించాం. సోమవారం జరిగే టైగర్ డే రోజున విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడంతోపాటు పలుల సంరక్షణపై అవగాహన కల్పించనున్నాం.