ఎన్నో సంవత్సరాల నుంచి నాగరికతకు దూరంగా ఉంటున్న చెంచు గిరిజనుల బాధలు వర్ణణాతీతం. పాలకులు మాత్రం అడవిపుత్రుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించామని ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. వాస్తవ పరిస్థితిని గమనిస్తే తాగునీటిని తెచ్చుకోడానికి కిలో మీటర్ల దూరం బిందెలతో ప్రయాణం సాగించాల్సిన దుస్థితి. నీడ సైతం కరువై.. ఎండలకు మండిపోతున్నారు. మరోవైపు కొన్ని స్వచ్చంద సంస్థలు సైతం కంటితుడుపు సేవతో చేతులు దులుపుకుంటున్నాయి. ఈ క్రమంలో విద్య, వైద్యం అందక గిరిపుత్రులు పడుతున్న బాధలపై ప్రత్యేక కథనం.
ఇప్పుడే.. ఇప్పుడే సమాజంలో కలిసిపోతున్న ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా అభివృద్ధి మాత్రం మాటలకే పరిమితం అయ్యింది. సమాజంలో తమ జాతి ఒకటి ఉందని చాటుదామంటే అవకాశాలు లేక దుర్భర పరిస్థితుల నడుమ జీవనం సాగిస్తున్నారు. కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా లేని పరిస్థితి. కొంత స్థలం చుట్టూ టార్పాళ్లు కట్టుకుని ఎండకు మగ్గుతున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో ఒకే ఇంటిలో ఆరు కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.. అంటే ఆ కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దీన్ని చూస్తే అర్థమవుతుంది.
శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నంద్యాల జిల్లాలో 42 చెంచు గూడేలు 14 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని బైర్లూటి గూడెం, నాగులూటి, చెంచుగూడెం, రుద్రకోడూరు, పెద్దచెరువు, కొట్టాల చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెంచుగూడేల్లో చెంచులు అవస్థలు పడుతున్నారు. ఆపదొస్తే వారికి సరైన సమయంలో వైద్యం అందించే దిక్కులేదు. మరోవైపు చదువుకుంటే గిరిజనులు ఉన్నత స్థాయి శిఖరాలు చేరుకొని నేటి సమాజంతో పోటీపడతారని అధికారులు గొప్పగా చెప్పుతున్నారు. వాస్తవంగా బాగోగులు పట్టించుకునే నాథుడు లేడు. వేసవికాలంలో దాహార్తి తీర్చుకునేందుకు మూడు కిమీటర్లదూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఊర్లో చేతి పంపులు ఏర్పాటు చేయాలని పలు చెంచుగూడేల వాసులు కోరుతున్నారు. నాయకులు వచ్చారు. కురుకుంద గ్రామంలో గతంలో జగనన్న కాలనీ రోడ్డు కోసం ఆర్డీటీ సంస్థకట్టించిన తమ ఇల్లు పడగొట్టారని.. ఇక సొంతింటి కల నెరవేరే భాగ్యం లేదా అంటూగిరిజనులు అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పనులు కల్పించాలని అధికారులను కోరుతున్నా… అదిగోఇదిగో అంటుండటంతో పిల్లా పాపలతో పస్తులుఉంటున్నామని చెబుతున్నారు.
ఆర్డీటీ ఇళ్ల నిర్మాణంతో సొంతింటి కల నెరవేర్చండి..
రాష్ట్రంలో ఆర్డీటీ స్వచ్చంద సేవా సంస్థ చెంచు గిరిజనులకు సొంతింటి కళ నేరవేరుస్తోంది. ఆత్మకూరు డివిజన్ లోని కొట్టాల చెరువు, బైర్లూటి, నాగలూటి, కొత్తపల్లి మండలంలోని జనాల గూడెం, బలపాల తిప్ప పాలెం చెరువుతో పాటు పలు చెంచు గుడెలలో అభివృద్ది పనులు జరుగు తున్నాయి. అయితే కళ్ల ముందే ఒకే ఇంట్లో ఆరు కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నామని గిరిజనులు ఆర్డిటీ అధికారులకు మొరపెట్టుకున్నా.. పది కుటుంబాలు ఉంటేనే అక్కడ ఇల్లు నిర్మిస్తామని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక గొంతు ఎండుతున్నాయని అంటున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి చెంచు గిరిజనుల అభివృద్ధికి పాటుపడే నాథుడే కరువయ్యారు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
అడవిలో దొరికే ఫలాలు, తేనె, బంక ఆయుర్వేదానికి ఉపయోగపడే వనమూలికలు, అడవిలో సేకరించి మార్కెట్లో విక్రయించి వచ్చే పదోపరకతో కుటుంబాలను పోషించు కుంటున్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో రాణిం చేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్న ప్పటికీ గూడేలకు వెళ్లి చూస్తే వారి పరిస్థితులు తెలుస్తాయి. ఎండలో మగ్గుతున్నాం.. సారూ అంటున్నా పట్టించుకునే దిక్కు లేదు. పేదోడీ సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్న ఈ తరుణంలో.. చెంచుగిరిజనులకు ఆర్డీటీ సంస్థద్వారా అయినా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.
మాట చెప్పి తప్పించుకున్న గ్రామ నాయకులు
కురుకుంద గ్రామంలో పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకు చెంచు గిరిజనులు నిర్మించున్న ఇళ్లను ఏడాదిన్నర క్రితం ఆర్డీటీ సంస్థ పట్టా భూముల్లో కట్టించి ఇచ్చిన ఇళ్లను అధికారులు పడగొట్టారు.. కాలనీ కోసం రోడ్డు.. ఇళ్లను త్యాగం చేసిన చెంచులను గ్రామ నాయకులు రోడ్డుపై వదివేశారు. ఇదేమని అడిగితే తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతతం మండు వేసవిలో తార్పాళ్ల మధ్యలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందని గిరిజనులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు ఐటీడీఏ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అంటున్నారు. బాధిత కుటుంబాలపై కాస్త కనికరం చూపాలని ఆత్మకూరు డివిజన్ లోని పలు గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Article by ———- సగినాల రవి కుమార్ – 8309888954
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV