మినీ మహానాడు.. ఎమ్మెల్యే పరిటాల సునీత

Mini Mahanadu.. MLA Paritala Sunitha

Mini Mahanadu.. MLA Paritala Sunitha

  • పార్టీ జెండా మోసిన ఏ ఒక్కరికి అన్యాయం జరగదు
  • ఇది మీరిచ్చిన విజయం.. మీ కోసమే పని చేస్తాను
  • పరిటాల రవి స్ఫూర్తితో స్థానిక సంస్థల్ని ఏకగ్రీవం చేసుకుందాం
  • మినీ మహానాడు వేదికగా ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు
  • తిరుమల దేవర దేవస్థానం వద్ద రాప్తాడు మినీ మహానాడు
  • వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు.. అంతటా పసుపుమయం
  • పలు కీలక తీర్మాణాలకు ఆమోదం.. సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం

పసుపు జెండా మోసి.. పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం రామగిరి మండలం నసనకోట తిరుమల దేవర దేవస్థానం వద్ద ఒక పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు పార్లమెంట్ అధ్యక్షుడు అంజినప్ప, అబ్జర్వర్ కృష్ణమ్మ, నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, వివిధ విభాగాల నాయకులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు.

ముందుగా తిరుమల దేవర, ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి సభకు హాజరయ్యారు. అక్కడ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించిన తర్వాత మహానాడుని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ తాను ఈ విధంగా వేదిక మీద మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనన్నారు. ఆరోజు పరిటాల రవీంద్రని ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానించారని.. ఆ తర్వాత ఇక్కడ పార్టీని రవి ఎంతో బలంగా మార్చారన్నారు.

ఆయనకు మంత్రి పదవి ఇవ్వకూడదని కొందరు అడ్డుపడినా ఎన్టీఆర్ పరిటాల రవికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఆ తర్వాత నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఐదేళ్ల పాటు మంత్రిగా అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు వలనేనన్నారు. గత ఐదేళ్ల పాటు పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నిలబడ్డారన్నారు. వైసీపీ ఎన్ని కష్టాలకు గురి చేసినా, కేసులు పెట్టినా బెదరకుండా పార్టీలో పని చేశారన్నారు. వారి కష్టం వలన నాకు భారీ మెజార్టీ వచ్చిందన్నారు.

నా గెలుపు కోసం పని చేసిన ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తలను మరవనన్నారు. ఇప్పటికే కొంత మందికి వివిధ రూపాల్లో న్యాయం జరిగిందని.. ఇంకా మిగిలిన వారికి కూడా ఈ నాలుగేళ్లలో కచ్చితంగా న్యాయం చేస్తానన్నారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న విషయాల్ని మనసులో పెట్టుకోవద్దని.. అంతా సమిష్టిగా పని చేయాలన్నారు. ఇది మీరు ఇచ్చిన విజయం అని.. మీ కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీకావని.. మన అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే మహిళా కార్యకర్తలతో సహా అంతా రోడ్డెక్కారన్నారు. చివరకు ప్రాణ త్యాగలకైనా సిద్ధంగా నిలిచారన్నారు. ఇటు తోపు బ్రదర్స్ వలన మన కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. వారు చేసిన దౌర్జన్యాలను ఎదుర్కొని నిలిచామన్నారు. అయితే మరో ఏడాదిలోపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయని.. ఆ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి చేయాలన్నారు. ఆరోజు పరిటాల రవీంద్ర జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల్ని ఏకగ్రీవం చేశారని.. అదే స్ఫూర్తితో మనం కూడా ఏకగ్రీవం దిశగా పని చేయాలని సూచించారు….

రాప్తాడులో మళ్లీ అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తోంది

గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం అన్నది మచ్చుకైనా కనిపించలేదన్నారు. పైగా వచ్చిన పరిశ్రమలు వెల్లగొట్టి.. భూములు కాజేస్తూ.. పాలన సాగించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఒక నెలకు 47వేల 186మందికి, సుమారుగా 21 కోట్ల 9లక్ష రూపాయలు పంపిణీ ఇస్తున్నామన్నారు. ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు ద్వారా 42 కిలోమీటర్లు సి.సి.రోడ్లు నిర్మాణాం, 108 కిలోమీటర్లు బి.టి.రోడ్లు నిర్మాణాం మొత్తం వంద కోట్ల వరకు ఖర్చు చేసినట్టు చెప్పారు.

ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ కింద ఇంతవరకు 269 లబ్దిదారులకు గాను 2 కోట్ల 60 లక్షలు పంపిణి చేశామని.. ఎల్ఓసీ కింద ముగ్గురికి 11 లక్షల 25 వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. కార్బన్ సిటీ, తోపుదుర్తి, గొరిదిండ్ల, ముత్తవకుంట్ల గ్రామాలలో 4 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ ల నిర్మాణం, వందల సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ఫ్వార్మర్లు, గోకులం షెడ్స్, డ్రిప్ స్ప్రింక్లర్లు 10ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు వచ్చేలా చేశామన్నారు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తున్నట్టు చెప్పారు. మొదటి సంతకమే మెగా డీఎస్సీ పైన పెట్టారు.. 16 వేలకు పైగా టీచర్ పోస్టులు,రాష్ట్రంలో 200 అన్న క్యాంటీన్లు, ప్రజల ఆస్తిని కాజేసే విధంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు.

వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20వేల రూపాయల ఆర్థిక సాయం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా.. అందరికీ అమ్మకు వందనం కింద 15 వేల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలైన జీడిపల్లి – పేరూరు ప్రాజెక్టు, అనంతపురం రూరల్ పరిధిలోని నడిమివంకకు రక్షణ గోడ, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలలో తహసీల్దార్, హౌసింగ్ నిర్మాణంలో రాక్రీట్ సంస్థ పేరుతో మాజీ ఎమ్మెల్యే తోపు చేసిన అక్రమాలపై విచారణ వేగవంతం, కనగానపల్లి మండలంలో సోలార్ మరియు పవన విద్యుత్ పరిశ్రమలు రామగిరి బంగారు గనులను తెరిపించడం, జాకీ పరిశ్రమ వంటి 22అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మాణాలను ఆమోదించారు. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు..

పరిటాల రవి స్ఫూర్తితో పని చేయండి.. అధ్యక్షుడు, అబ్జర్వర్

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ పేరు చెబితే ఎక్కడైనా గుర్తొచ్చేది పరిటాల రవీంద్ర పేరు అని.. ఆయన ఒక బ్రాండ్ గా మారారని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు అంజినప్ప, రాప్తాడు నియోజకవర్గ అబ్జర్వర్ కృష్ణమ్మ అన్నారు. ఆయన ఏవిధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడ్డారో.. మనం కూడా అదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వాటిన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మినీ మహానాడు అంటేనే మనకు ఒక పండుగ లాంటిదని.. ఈ పండుగ వాతావరణంలోనే మనం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ లో అమలు చేసే విధంగా పని చేయాలని సూచించారు. భవిష్యత్ వైసీపీ నుంచి రాష్ట్రానికి శాశ్వతంగా విముక్తి కల్పించే దిశగా కార్యకర్తలు పని చేయాలన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారని వారు స్పష్టం చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top