ప్రకృతి మనకెన్నో అద్భుత ఔషధ గుణాలున్న మందు మొక్కలను ప్రసాదించింది. అయితే అవగాహన లోపంవల్ల మన ఆరోగ్య పరిరక్షణకు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. మరో వైపు పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల వంటి కారణాల వల్ల విలువైన ఔషధ మొక్కలు కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. అందువల్ల ఇలాంటి మొక్కలను సక్రమంగా వినియోగించుకోవటంతో పాటు కల్చర్ మొదలగు ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతుల ద్వారా వాటిని అభివృద్ధి పరచి ముందు తరాలవారికి అందించాల్సిన నైతిక బాధ్యత మనపై ఉంది. కొన్ని మందు మొక్కలకు సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం వివిధ కారణాల వల్ల ప్రామాణిక వైద్య గ్రంధాల్లో సవివరంగా లభ్యంకానప్పటికీ ఎక్కడో మారుమూల అడవుల్లో, కొండల్లో నివసించే ప్రజల్లో అనుభవ వైద్యంగా నిక్షిప్తమై వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందనే సత్యాన్ని ఇప్పుడిప్పుడే ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు, వైద్యులు, సమాజం గుర్తించటం గమనార్హం.
చెంచులు, యానాదులు, ఆటవికులు, ఇతర వనవాసులు మొదలైన వారు తమ శారీరక ముగ్మతల్ని నివారించుకునేందుకు తరచుగా ఉపయోగించుకునే మందు మొక్కల్లో మేకమేయని ఆకు ఒకటి. మేకలు దీన్ని తినవు కాబట్టి సంస్కృతంలో ‘అజద్విష్ట’ అంటారు. ఈ మేక మేయని ఆకు సంవత్సరమంతా కన్పిస్తూ రెండు మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతూ నేలపై గాని, పొదలపై గాని పాకుతుంది. అరుదుగా పెద్ద చెట్లకు చుట్టుకొని 10 15 మీటర్ల పొడవు వరకు పెరిగే బహువార్షికపు తీగజాతి మొక్క. దీని పత్రాలు కణుపునకు రెండు చొప్పున అండాకారంలోను, పుష్పాలు నక్షత్రాలలాగ ఉండి పసుపుఛాయ కల్గిన లేతాకుపచ్చరంగుతో మధ్యలో ఎర్రగా చూడముచ్చటగా ఉంటాయి. ఈ మొక్కను గిల్లితే లేత పసుపురంగు ద్రవం న వస్తుంది.
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
‘టైలోఫోరా ఇండికా’ అని శాస్త్రీయంగా వ్యవహరించే ఆస్థిపియడేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను వివిధ ప్రాంతాల్లో కుక్కపాల, వెర్రిపాల తీగ, 1 రాటపు తీగ అనే పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లోని వనవాసులు ఎండ్రిన్ లాంటి క్రిమి సంహారక పురుగుమందులు తాగినపుడు మేకమేయని ఆకుల్ని నూరి గంజిలో కలిపి పట్టించి వాంతిచేయిస్తారు. పాము కాటుకి కూడా దంచిన మేకమేయని ఆకుని నీటితో మింగించి వాంతి చేయిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి విష ప్రభావాలకు లోనయ్యే సంఘటనలు కోకొల్లలు.
దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రఖ్యాత ఆధునిక వైద్యశాస్త్రవేత్త డాక్టర్ శివపురి న్యూఢిల్లీలోని పటేల్ చెస్ట్ ఇనిస్టిట్యూట్లో జరిపిన సుదీర్ఘ పరిశోధనల ఫలితమే ఈ మేకమేయని ఆకుకు మంచి డిమాండ్, గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.
మూలశంక వ్యాధికి మంచి ఔషదం
ఉబ్బసవ్యాధికి ప్రశస్త ఔషధం మేకమేయని అకుగా భావించే గిరిజనులు తమ వ్యాధి గ్రస్తులకు నాలుగు ఐదు వారాల పాటు రోజూ పరగడుపున మూడు మిరియాలను మేకమేయని ఆకుతో నూరి మింగిస్తారు. కొద్దిసేపట్లో రెండు మూడు వాంతులవుతాయి. కొద్ది మందిలో వాంతులేవీ కావు. వాంతులయ్యేట్లయితే అవి పూర్తయ్యేవరకు ఎలాంటి ఆహారం ఇవ్వరు. ఈ ప్రక్రియ అత్యత్తమ ఫలితాన్నిస్తుందని వారి స్వానుభవం చెబుతోంది.
ఆధునిక కాలంలో ఈ వ్యాధికి వాడే కృత్రిమ స్టిరాయిడ్స్ ఈ ఔషధ సేవల వల్ల శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అవటమే గాక, కృత్రిమమైన వాటివల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలనూ ఇది నివారిస్తుంది. వ్యాధి నిరోధకశక్తి పుంజుకొని తరచుగా వచ్చే ఉబ్బస తీవ్రత నియంత్రించబడుతుందని ఆధునికులు అభి ప్రాయపడుచున్నారు. గుప్పెడు మేకమేయని ఆకు, ఒక వెల్లుల్లిరేక, పది మిరపగింజలు కలిపి – దంచి నీళ్లతో కలిపి త్రాగిస్తే పశువులకు అజీర్ణం వల్ల వచ్చే కడుపుబ్బరం తగ్గుతుంది. మూలశంక వ్యాధి పీడితులు మేకమేయని ఆకుని మెత్తగా నూరి మొలలపై పెట్టి కట్టుకట్టుకుండే చాలా త్వరగా అవి సమసిపోతాయి.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..