అనగనగా ఒక ఊరిలో చలపతీ, శేషాద్రీ అనే ఇద్దరు యువకులు చదువులు పూర్తిచేసి నగరంలో ఉద్యోగం చెయ్యాలన్న మోజులో ఉన్నారు. నగర పాలక సంస్థలో ఖాళీలు ఉన్నట్టు తెలిసి, ఇద్దరూ దరఖాస్తులు పంపుకున్నారు. ఫలానారోజున ఉద్యోగుల ఎన్నిక జరుగుతుందని ఇద్దరికీ కబురు అందింది.
చలపతి తండ్రికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి కావలసిన మనిషి మురహరి అనే ఆయన నగరంలో వుంటున్నాడు. అందుచేత తండ్రి చలపతితో సత్రంలో దిగవద్దని మురహరి ఇంటికి వెళ్ళమని చెప్పి తన స్నేహితుడిచేత మురహరికి ఒక లేఖ రాయించి చలపతికి ఇచ్చాడు.
చలపతి మురహరి ఇంటికి వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు. కాని శేషాద్రి ముక్కు, ముఖమూ తెలియనివారింట దిగటం ఏమాత్రం ఇష్టంలేక సత్రంలో దిగుతానన్నాడు. వాళ్ళ ప్రయాణం అనుకున్నంత చురుకుగా జరగక ఉద్యోగస్తుల ఎన్నికకు ముందురోజు సాయంత్రం నగరం చేరవలసిన వాళ్ళు మర్నాడు చివరిజాములో అక్కడికి చేరారు. తెల్లవారితే ఉద్యోగుల ఎన్నిక.
శేషాద్రి సత్రం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కాగితంమీద రాసివున్న చిరునామానుబట్టి తాను బసచేయవలసిన ఇల్లు సులభంగానే తెలుసుకుని చలపతి అక్కడికి చేరాడు.
అయితే అతను తలుపు తట్టకముందే ఒక 40 ఏళ్ల మనిషి తలుపు తెరుచుకుని ప్రయాణం చేయబోతున్నవారిలాగ పెట్టె ఒకటి చేతబట్టుకుని బయటికి వచ్చాడు.
“మురహరిగారిల్లు ఇదేనా అండి?” అని చలపతి ఆ మనిషిని అడిగాడు.
“అవును” ఇదే నేనే మురహరిని, మీరెవరు?” అని ఆ మనిషి చలపతిని అనుమానంగా చూస్తూ అడిగాడు.
చలపతి తన విషయం ఆ మనిషికి చెప్పి “తెల్లవారితే పరీక్ష. అలసిపోయి వున్నాను. కాసేపు విశ్రాంతి తీసుకుందామని వచ్చాను” అన్నాడు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ఆయన ఎంతో నొచ్చుకుని “మా అన్నగారికి ఒంట్లో ఏమీ బాగాలేదని కబురుఅంది కంగారుగా బయలుదేరుతున్నాను. ఇల్లు మీదే అనుకోండి. రేపు సాయంత్రానికి వచ్చేస్తాను” అని వెళ్ళిపోయాడు.
లంకంత ఇల్లు, చలపతి ఒకసారి ఇల్లంతా చుట్టి మధ్యగదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు. అతనికి కునుకుపట్టినట్టన్నా అనిపించకుండానే తలుపు ఎవరో దడదడబాదారు, చలపతి ఉలిక్కిపడి లేచి తలుపుతీశాడు. బయట బాగా తెల్లవారిపోయింది. ఇంటిబయట పదిమంది మనుషులు కర్రలు పట్టుకుని నిలబడివున్నారు. తలుపు తెరిచిన మరుక్షణం వాళ్లు చలపతి మీదికి ఉరికి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.
వారివెంట వున్న ఒక ముసిలాయన “నేను రాననుకుని, దొంగవెధవ చుట్టంలా ఇంట్లో తిష్టవేశాడు! ఎందుకయినా మంచిది, డబ్బూ, నగలూ చూసుకుంటాను” అని లోపలికి వెళ్లి, పెట్టెతెరిచి చూసుకొని, గుండెలు బాదుకుంటూ, “నగలులేవు, డబ్బులేదు, ఈ దొంగవెధవ ఎవరికో ఇచ్చి పంపించేసి ఉంటాడు!” అంటూ చలపతి పీకపట్టుకున్నాడు..
“నేను దొంగనుకాను. నాకేమీ తెలీదు. ఇంతకుముందే ఇక్కడికి వచ్చాను!” అని చలపతి జరిగినదంతా చెప్పాడు.
“అంతా అబద్ధం! నీ తోడుదొంగ ఎక్కడ ఉంటాడో చెప్పు!” అంటూ చలపతి వీపుమీద నాలుగు దెబ్బలు వేశాడు ముసలాయన.
అవమానంతో కుంగిపోయాడు
చలపతి అవమానంతో కుంగిపోయాడు. ఉద్యోగ పరీక్ష సమయం అయిపోతున్నదని ఒక పక్క ఆందోళన! కొత్త ఊరు, కొత్త మనుషులూనూ! ఈ ఊళ్లో తనను ఎవరు గుర్తించుతారు? తనకు ఇల్లు అప్పచెప్పినవాడు దొంగ అన్నమాట! నగరంలో దొంగలు అంత ఘరానాగా ఉంటారన్నమాట!
అతను అందరికీ దణ్ణాలు పెట్టి, “ఆ మనిషి దొంగ అని నాకు తెలీదు, నేనిక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను. మా నాన్నగారి మిత్రుడు ఈ చిరునామా కాగితం ఇచ్చాడు. ఇంతకూ ఇది మురహరిగారి ఇల్లు కాదా?” అంటూ తన వద్దవున్న లేఖ వారికి చూపాడు.
Also Readhttps://www.youtube.com/shorts/6ehb5BmDYCE
మురహరి ఆ ఇల్లు ఖాళీచేసి ఆరునెలలయ్యింది.
“వీణ్ణి గదిలో బంధించి ఆ మురహరిని పిలుచుకురండి” అని ఎవరో సలహా ఇచ్చారు. చలపతిని గదిలోకి తోసి గొళ్లెం పెట్టి, మురహరిని పిలుచుకుని వచ్చారు.
అప్పటికి మధ్యాహ్నమయ్యింది. అప్పటికి చలపతి ప్రయాణం బడలికతోనూ నిద్రచాలకా, పరీక్ష మించిపోతున్న ఆందోళనతోనూ సగం చచ్చి ఉ న్నాడు.
మురహరి వచ్చి చలపతి వద్ద ఉన్న లేఖ తీసుకుని చూసి, “ఇది నా మిత్రుడు రాసినదే. ఈ అబ్బాయిని నేను లోగడ చూడలేదు గాని,
ఇతను నిశ్చయంగా మా ఊరివాడే” అన్నాడు.అందరూ చలపతికి క్షమాపణ చెప్పుకుని అతన్ని విడిచిపెట్టారు.
మురహరి అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కాని చలపతి “మీరు నాకివాళ మహోపకారం చేశారు. ఇక నేను మా ఊరు తిరిగిపోతాను. ఇక్కడ పరీక్ష అయిపోయింది? అంటూ ఆ ఇంటినుంచి బయటపడ్డాడు.
శేషాద్రి చలపతికి ఎదురువచ్చి “పరీక్షకు రాలేదేం?” అని ఆదుర్దాగా అడిగాడు.
చలపతి జరిగినదంతా చెప్పాడు. అంతా విని శేషాద్రి “నీకు నగరంలో ఉద్యోగం సరిపడదు. నగరంలో మోసాలు సర్వసామాన్యం.
అయితే వాటిని తెలివిగా ఎదుర్కోవాలి. నువ్వు ఏం చెప్పినా ఆ స్థితిలో వాళ్ళు వినరు కాబట్టి, దొంగను చూపిస్తానంటూ వారిని నగరపాలక సంస్థకు తీసుకురావలసింది.
అక్కడ నేను ఉంటాను. మన దరఖాస్తులు సంస్థలో ఉన్నాయి, వాటిని బట్టి నువ్వు దొంగకాదని తేలికగా రుజువయ్యేది.
నువ్వు పరీక్షకు హాజరుకూడా అయ్యేవాడివి. నన్ను రెండురోజుల్లో ఉద్యోగంలో చేరమన్నారు. ఈలోగా నిన్ను మీ నాన్నకు అప్పజెప్పివస్తా” అన్నాడు.
చలపతి తమ ఊరుచేరి వ్యవసాయం ప్రారంభించాడు.