- – ప్రజలపై ఏకంగా రూ.రూ.15,485 కోట్ల వడ్డింపు
- – కరెంట్ చార్జీల పెంపుతో అన్ని వర్గాలపై భారం
- – ఎన్నికల్లో ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి
- – కరెంట్ చార్జీల బాదుడుపై ఈనెల 27న ‘వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట’
- – జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
- – అనంతపురములో బ్రహ్మం గారి గుడి నుంచి ర్యాలీ ప్రారంభం
- – వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత స్పష్టీకరణ
- – పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరణ
అనంతపురము, డిసెంబర్ 23 :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే కరెంట్ చార్జీల రూపంలో ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపారని వైసీపీ అనంతపురము జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. చంద్రబాబు పాలన చంద్రబాదుడుగా మారిందని అన్నారు. సోమవారం వైసీపీ అనంతపురము జిల్లా కార్యాలయంలో ‘కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాలను విస్మరిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కరెంట్ చార్జీలు కూడా పెంచారు.
Also Read చెస్ లో నారా దేవన్స్ ప్రపంచ రికార్డు
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. వైసీపీ పాలనలో కరెంట్ చార్జీలు పెంచారు.. మేం వస్తే పెంచము.. తగ్గిస్తాం అని ఎన్నికల సమయంలో చంద్రబాబు పదేపదే ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక నవంబర్‌లో రూ.6072 కోట్ల భారం వేశారు.. జనవరి నుంచి రూ.9412 కోట్లు భారం వేశారు. పెరిగిన విద్యుత్ చార్జీలతో సామాన్య ప్రజలే కాకుండా కుటీర, మధ్య తరహా పరిశ్రమలు నష్టపోయే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పామిడి, రాయదుర్గం, పెనుకొండ, హిందూపురంలో కుటీర పరిశ్రమలు అధికం. చార్జీల పెంపుతో అవి మూత పడే అవకాశం ఉంది. ఇప్పటికే తాడిపత్రిలో బండల ఫ్యాక్టరీలు మూసి వేస్తున్న పరిస్థితి. రైతాంగం సమస్యలపై ఈనెల 13వ తేదీన వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈనెల 27వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు
ప్రజలను భాగస్వామ్యం చేసుకుని పార్టీ శ్రేణులు ముందుకు కదలాలి. నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తాం. ప్రజల తరఫున వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది. ప్రభుత్వం తక్షణం కరెంట్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి’’ అని తెలిపారు. అనంతపురము నియోజకవర్గానికి సంబంధించి నగరంలోని పాతూరులో ఉన్న బ్రహ్మం గారి గుడి నుంచి ఈనెల 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమై పవర్ ఆఫీస్ వరకు కొనసాగుతుందని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పి ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలపై పన్నుల మీద పన్నులు వేయడం దుర్మార్గమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే రూ.85 వేల కోట్ల అప్పు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసకారి అని అన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ మెడలు వంచేందుకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందని చెప్పారు. ఈనెల 27వ తేదీన జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ ఆరు నెలలైనా ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదన్నారు. విద్యుత్ సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ప్రజలను బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్