అనగనగా రాయవరం అనే చిన్న గ్రామం. దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి . వారంరోజుల నుంచి జనం ఎక్కడినుంచో తండోపతండాలుగావచ్చి నదిలో స్నానం చేసి వెళుతున్నారు. వారం పదిరోజులపాటు గ్రామస్థులకు ఇదొక పెద్ద పండుగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్నరైతు దశరధయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండుగ వచ్చింది. అతడి భార్య, భర్తను వేగిరపెడుతూ “చీకటిపడకుండా వచ్చేయండి. దర్జీ ఈసరికి అమ్మాయి పట్టుపరికిణి కుట్టేవుంటాడు. అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి. అసలే ఊరినిండా జనం” అని హెచ్చరించింది.
అయితే, దశరథయ్య దర్జీ దగ్గరకు వెళ్ళేసరికి ఇంకా పరికిణి పని పూర్తికాలేదు. దర్జీ అతణ్ణి కొంతసేపు కూర్చోబెట్టి పని పూర్తిచేశాడు. అతదు పరికిణి తీసుకుని బయలుదేరేసరికి చీకటి పడుతున్నది.
దశరథయ్య ఇంటిని సమీపిస్తుండగా ఒక పాతికేళ్ళ కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు. దశరధయ్య అతణ్ణి ఏనాడూ చూసివుండలేదు.ఆ కుర్రాడి బెదురుచూపులు, కంగారు చూస్తూనే దశరథయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది. అతడు పరుగునపోయి వాడిమెడ పుచ్చుకుని “నువ్వెవరు? ఇంట్లోంచి ఏం దొంగిలించావ్?”అన్నాడు కరకుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలురాక కాస్తతడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి “దొంగ వెధవా! నిజం చెప్పు, దొంగిలించిన వస్తువెక్కడ అంటూ పెద్దగా అరిచాడు.
అదివిని అతని భార్య, కూతురేకాక పక్క ఇళ్లవాళ్లు కూడా అక్కడికి వచ్చారు. “ఈ వయసులో కష్టపడి పనిచేసుకోక దొంగతనాలకు దిగాడన్నమాట. నాలుగు తన్ని బుద్ధి చెప్పండి” అన్నాడొకడు అక్కడ చేరిన గుంపులోంచి, “ముందు ఏం కాజేశాడో చూడండి” అన్నాడు మరొకడు. దశరథయ్య వాడి దుస్తులు తడిమిచూశాడు. జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరేమీ లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి “నేను దొంగనుకాదు. నన్ను వదిలిపెట్టండి” అన్నాడు. “ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతు న్నారట. పుష్కరాలు గనుక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చివుంటాడు” అన్నదొకావిడ. గుంపులోంచి ఇద్దరు ముందుకు తోచుకువచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయేంతలో వాడు “అయ్యా, ఆగండి. ఇంట్లో దేవుడి మందిరం పక్కనవున్న ఎర్రసంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా, సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్రసంచి తీసుకువచ్చింది. దానినిండా గలగలలాడుతూ వెండి నాణాలున్నవి.
దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. కుర్రాడు గొంతు సవరించుకుని “ఆ సంచిలో వెయ్యి వెండికాసులున్నవి. ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే. ఎందుకు పెట్టానో చెప్పమంటారా?” అన్నాడు. దశరథయ్యతోపాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడికేసు చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు… పన్నెండు సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బుచేసింది. వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తేనేకాని పిల్లవాడు బతకడని చెప్పారు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బులేదు. పొరుగూరిలో అతడి చిన్ననాటి స్నేహితుడొకడున్నాడు. అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడు.
ఉంగరం తళుక్కుమంటూ అతడి కంటపడింది
అయితే, ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం, ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది. కుర్రవాడి తండ్రి అక్కడినుంచి అతడికోసం ఈ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగినా అంతమంది తీర్ధ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేదిలేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగావున్న మండువా ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు. ఇంటావిడ తలుపుతెరిచి అతడికి మంచినీళ్లిచ్చి తిరిగి తలుపు మూసింది. గకుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గిర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తళుక్కుమంటూ అతడి కంటపడింది. అతడు దాన్ని తీసుకుని చూసి తలుపుతట్టి ఇంటివాళ్లకు ఇద్దామనుకున్నాడు. కానీ చప్పున తన కొడుకు స్థితి గుర్తుకురాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామం చేరాడు.
అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుక్కు పట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడు ఇదంతా చెప్పి దశరథయ్యతో “అయ్యా, ఆ తరువాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అయినా సాధ్యపడలేదు. అయితే నెలరోజుల క్రితం బాగా జబ్బుచేసి చనిపోయేముందు మా నాన్న ఈ జరిగినదంతా చెప్పి తన కర్మకాండకు అట్టే ఖర్చు పెట్టవద్దని ఇంట్లోవున్న 800 కాసులకు మరి రెండువందలు ఎలానైనా చేర్చి తమకివ్వవలసిందనీ చెప్పారు. పోయిన మా నాన్నను గురించి దొంగగా చెప్పడం మనస్కరించక 1000 వెండికాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోని దేవుడి మందిరం పక్కన పెట్టాను. ఆ డబ్బు తమదే” అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ.
ఆ కుర్రాడి నిజాయితి చూసి అక్కడ చేరినవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. “సంగతేమిటో కనుక్కోకుండా కనబడినవాళ్లను పట్టుకుని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏం మర్యాద’ అంటూ జనం దశరథయ్యను చివాట్లు పెట్టి వెళ్లిపోయారు.
కుర్రాడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోగానే దశరథయ్యను తన కూతురు చేతిలోవున్న డబ్బుసంచీ
తీసుకోబోతూ “నీ పుట్టిన రోజున మంచి బహుమతి లభించింది. ఆ డబ్బుతో నీకు బంగారు గొలుసు
చేయిస్తాను” అన్నాడు. ఆ మాటకు భార్య అడ్డువచ్చి “ఇంకా నయం, పసిపిల్ల వంటిమీద బంగారం వుండడం ప్రమాదం. ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను” అన్నది. సుమతి డబ్బు సంచివున్న చేతిని వెనక్కులాక్కుని తండ్రిని “ఈరోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్నా?” అని అడిగింది.
“నాకు ఆ మాత్రం గుర్తులేదనుకోకు తల్లీ! ఈ రోజుతో నీకు 9 నిండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. “ఆ అబ్బాయి తీర్చిన బాకీ 12 ఏళ్ల కిందటిది. మనం ఈ ఇల్లు కొన్న తరువాత ఏడాదికి నేను పుట్టాను. అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతదన్నమాట.
Also Read తిరమందార్ల స్పెషల్ బంగి ఉండలు – లివర్ పచ్చడి
కూతురి గొప్ప మనసుచూసి ఆమె తల్లిదండ్రులు
పిల్లలు సరిగా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాలలో వున్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది. ఇది తాతకు ఇచ్చివస్తాను” అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య, అతడి భార్య తమ కూతురి దయాగుణానికి అబ్బురపడ్డారు. దశరథయ్య భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి “ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వవచ్చులేతల్లీ. ఇప్పుడు మనం గుడికివెళ్ళాలి” అన్నది. “ఈరోజు గుడికి వెళ్ళక పోయినా పరవాలేదు. తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది” అంటూ రామయ్యతాత ఇంటికేసి పరుగుతీసింది సుమతి. వయసులో చిన్నదయిన తమ కూతురి గొప్ప మనసుచూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనంద పడ్డారు.