ముఖ్యమంత్రి చంద్రబాబు గారూ…AP లో రాయసిమ కూడా వుంది

ముఖ్యమంత్రి చంద్రబాబు గారూ...

ముఖ్యమంత్రి చంద్రబాబు గారూ...

తేదీ-1 జూలై ,2024 – అరుణ్, రాయలసీమ విద్యావంతుల వేదిక. ఫోన్—9440294462

ముఖ్యమంత్రి చంద్రబాబు గారూ…

మీ విశాల దృష్టిలో ఏ అంటే అమరావతి,పి అంటే పోలవరం,వెరసి ఏపి అంటే ఆ రెండిoటి వల్ల అత్యధికంగా లబ్దిపొందే కృష్ణా,గుంటూర్ జిల్లాలు మాత్రమెనని అనుకుంటున్నాం. .కానీ,మాలాంటి సామాన్యులకు,అదీ,మొదటి నుండీ అన్ని పార్టీల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై , వెనుకకు నెట్టబడిన రాయలసీమ వాసులకు, (ఎంతయినా సంకుచిత మనష్కులo గదా ! ) ఏపి అంటే అటు శ్రీకాకుళం నుండి ఇటు చిత్తూర్ జిల్లాల వరకు వున్న విశాల ప్రాంతం, అందులో వున్న అశేషప్రజానీకం అని అనుకుంటున్నాం.

అభివృద్ధి అంటే.. మీ దృష్టిలో ఏంటి బాబు

అభివృద్ధి అంటే,కేవలం ఇప్పటికే అభివృద్ధిచెందిన కృష్ణా,గుంటూ జిల్లాలె గాక, అదేవిధంగా ఉత్తరాంధ్రలోని విశాఖ నగరమే గాక,ఉత్తరాంధ్రలోనిఇతర ప్రాంతాల, రాయలసీమ,ప్రకాశం జిల్లాల అభివృద్ధి అని మాలాంటి అమాయకులు (,బహుశా మీలాంటి మేధావుల దృష్టిలో అజ్ఞానులు) అనుకుంటున్నాం.

మరమ్మత్తులకు నోచుకోని అలగనూరు రిజర్వాయర్

ఇక సీమ వాసులుగా,మాకు ఏ అంటే, దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలో ఒకటైన అనంతపురం జిల్లా అని,(దేశంలోని అత్యంత వెనుకబడిన 52జిల్లాలో,4 సీమ జిల్లాలున్నాయని మీలాంటి రాజనీతిజ్ఞులకు తెలియనిది కాదు.) అంతేగాక ఏ అనగానే మాకు జగన్ పాలనా కాలంలో కొట్టుకపోయిన అన్నమయ్య ప్రాజెక్టు(ఆయనగారి జిల్లా కడప) కేవలం ఏభై కో.రూ. తో రిపేర్ చేయగల, ఐదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని అలగనూరు రిజర్వాయర్ గుర్తుకు రావడం మీరు తప్పుపట్టరనుకుంటా..

పట్టిసీమ నుండి రాయలసీమకు 80 టిఎం సి ల నీరు బాబు

ఇక, పి అంటే మీకు పోలవరం.దాని నిర్మాణం ఆలస్యమవుతుందనీ,పాపం కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీరు ఎక్కడ సకాలంలో అందదేమోనని ఆఘమేఘాల పైన రికార్డ్ టైం లో నిర్మించిన పట్టిసీమ అని మాకు తెలుసు. పట్టిసీమ అనగానే,మాకు మాత్రం అసెంబ్లీ సాక్షిగా, మీరిచ్చిన వాగ్దానం –దాని వల్ల అదా అయిన 80 టిఎం సి ల నీటిని రాయలసీమకు కేటాయిస్తానని చేసిన వాగ్దానం జ్ఞప్తికి వస్తుంది. వాగ్దానం చేసిన వారు దాన్ని మరవడం సహజమే అనుకోండి.

సిద్దేశ్వరం అలుగును మీ అంక్యల్లో చేర్చుకోండి బాబు..

ఇక, సీమవాసులకు పి అంటే, రాయలసీమకు గుర్తుకు వచ్చేది ,తమకు సాగు,తాగు నీరందించే లైఫ్ లైన్, ప్రధాన వనరు, పోతిరెడ్డిపాడు హెడ్ రేగ్యులేటరని వేరే చేప్పాలా. దాని ద్వారా కర్నూల్,కడప,,చిత్తూర్ జిల్లాలకు నీరందించే గాలేరు -నగరి అని,పొతే దశాబ్దాలుగా పూర్తిగాని తెలుగు గంగా,హంద్రీ-నీవ,వెలిగొండ ప్రాజెక్టులు అనుకుంటున్నాం. అంతేగాక, మాకు ఆంగ్ల అక్షర మాలలో కేవల ఏ, పి అనే రెండు అక్షరాలే గాక,ఇతర అక్షరాలూ గుర్తుకున్నాయి.ఏమైనా అక్షరాస్యతలో మేము పూర్తిగా వెనుకబడి లేము లెండి. మాకు జి అంటే,మీరే పరిపాలనా అనుమతులిచ్చిన గుండ్రేవుల రిజర్వాయర్, గుంతకల్ రైల్వే జంక్షన్(,విభజన చట్టం లో ప్రదేశాన్ని స్పష్టం చేయకపోయినా, రాజకీయ పార్టీలన్నీ విశాఖలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కదా! ) హెచ్ అంటే HLC ఎగువ సమాంతర కాలువ, కే అనే కేఆర్ ఏం బి కార్యాలయం, ఆర్ అనే అక్షరం ఇక మీరే మొదలెట్టిన ఆర్ డి ఎస్ కుడికాలువ ను మాకు గుర్తుకు తెస్తే మా తప్పేమీ కాదుగా! ఎస్ అంటే కడప స్టీల్ ప్లాంట్ (ఇప్పుడు దాన్ని సాధించే శక్తి కలిగి వున్నారు.), అంతేగాదు, గత 8 సం.లుగా ఆందోళన జేస్తున్న (2016 లో మీ అత్యంత నిర్భందాల నెదుర్కొని ప్రజాశంకు స్థాపన గావించిన) సిద్దేశ్వరం అలుగు కూడా ఎస్ అక్షరంతో మొదలవుతుంది. దయజేసి మీరు మీ అభివ్రుద్ధి ప్రణాలికలో ఏ,పి తో పాటు మిగతా ఆక్షారాలను చేర్చండి.ఏ,పి లలో కూడా సీమ అభివృద్ధి పథకాలనూ చేర్చండి.

నెహ్రూ అమలుజేసిన నాటి ట్రికిల్డౌన్ సిద్ధాంతాలు..

ముఖ్యమంత్రిగారూ, మీరు గొప్ప దార్శినికులు.అందుకే అమరావతీ నగరం, దాని చుటూ నవనగారాల నిర్మాణంతో అక్కడ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తాయనీ,ఒక సింగపూర్ వలె అది వెలుగొందుతుందనీ,దాంతో అందరికీ ఉపాధి కలుగుతుందని, ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్రం నలుమూలల జాలువారుతాయని మీ స్వప్నం. ఆనాడు, నెహ్రూ అమలుజేసిన నాటి ట్రికిల్డౌన్ సిద్ధాంతాన్ని మీరూ అమలుజేయాలనుకుoటున్నారనేది మాలాంటి వారి బావన. మీరే కాదు,గత ముఖ్యమంత్రిగారు విశాఖ అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అని పాపం ఏంతో కష్టపడ్డాడు. ఫలితం దక్కలేదు. కానీ,మీరు మీ స్వప్నాన్ని నిజం చేసుకోవడం లో విజయవంతం అవుతారని మా నమ్మకం.కానీ,విషాదేమంటే,అప్పుడు రాలే అభివృద్ధి ఫలాలకై వేచిచూచే శక్తి మాకు లేదు.

వలసబోతున్న సీమ వాసులు..

కరువుకాటకాలతో,తాగు,సాగునీరు లేక అక్టోబర్ నెలనుండే కడుపు చేతపట్టుకొని పొరుగు రాష్ట్రాలకు,అంతెందు గుంటూర్ జిల్లాలో మిరప,పత్తి చేన్లలో పనిజేసే కూలీలుగా వలసబోయే సీమ వాసులు, అమరావతి అభివృద్ధి చెంది,దాని ఫలాలు అందే దాక జీవిoచివుండే భాగ్యం లెదు. పెద్ద వానొస్తే (నిల్వ చేసుకొనేందుకు రిజర్వాయర్లు లేక,ఉన్నవీ తగిన నిర్వహణ లేక,పూడిక నిండిన కాలువలు,చెరువులూ) మునిగిపోయే ఊర్లు,పొలాలు, వానలు రాకపోతే తాగునీటి వెతలు. అభివృద్ధి చెందిన దేశాలకు, చౌక వనరులకు,శ్రమకు ,దోపిడీకి మూడవ ప్రపంచ దేశాలు పెరటితోటలయినట్లు,రాష్ట్రంలోనూ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలు అవసరమేమో! విజ్ఞులే చెప్పాలి.

దాహంతో అలమటిస్తూ..ఆకలితో అల్లాడుతున్నవారి ఆవేదనలు కడుపునిండిన వారికంతగా అర్థం కావు.

మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది,అప్పుడే ఈ ఆపసోపాలు,విజ్ఞప్తులు,విమర్సలెందుకని ,మీరు గాకపోయినా,మమ్మల్ని తప్పుపట్టే మేధావులూ వున్నారు. దాహంతో అలమటిస్తూ,ఆకలితో అల్లాడుతున్నవారి ఆవేదనలు కడుపునిండిన వారికంతగా అర్థం కావు.కడుపు కాలుతున్నవానికి,మండుతున్న వానికీ సమయమూ,సందర్భమూ గుర్తు జేయడం విజ్ఞత కాదు.

పోలవరం , అమరావతి మాత్రమేనా … మేము ఓ ట్లేశాం…

అంతేగాక, మీరు పదవీ స్వీకరణ చేసిన వెంటనే,పోలవరం సందర్శించారు,అమరావతీ నిర్మాణానికి వoదల కోట్లు మంజూరు జేశారు. అభివృద్ధి పట్ల మీ ఆసక్తి,అభిరుచి, ఆతురుత, వేగం జూస్తుంటే ఆ ప్రయత్నాలలో మమ్మల్నీ భాగస్వామ్యం జేస్తారని ఆశ. గతంలో 2014తర్వాత, మీరు మమ్మల్ని మీకు ఓటు వేయలేదని తప్పు పడుతూ,అందుకని సీమకై ఏ డిమాండ్లను జేసే అర్హత మాకు లేదని అన్నారు. పాపం,ఆ అడగిన వాళ్ళు, ముఖ్యమంత్రి అంటే,కేవలం ఓటువేసిన వారికే కాదు, రాష్ట్రానికంతా ముఖ్యమంత్రే,భాధ్యుడే అని అనుకున్న అమాయకులున్నట్టున్నారు. ఇప్పుడు మేం ఆ తప్పు చేయలేదు లెండి.సీమ జిల్లాలలో మెజారిటీ సీట్లు మీకు కట్టబెట్టాం. మిమ్మల్నీ డిమాండ్ జేసే హక్కు పొందామనుకుంటున్నాం. ఇప్పుడు,మీరు మా అభివృద్ధిని పట్టించుకున్నా,మీరెందుకలా జేస్తున్నారాని మిమ్మల్ని ప్రశ్నించే వారెవరూ వుండరు.

ఒకే ప్రాంతాన్నే అభివ్రుద్ధిజేస్తే,అది ప్రాంతాలమధ్య విబెదాలకు దారితీస్తుంది.

ముఖ్యమంత్రిగారు,అభివ్రుద్ధిపేరిట కేవలం ఒకే ప్రాంతాన్నే అభివ్రుద్ధిజేస్తే,అది ప్రాంతాలమధ్య విబెదాలకు దారితీస్తుంది. అభివృద్ధి కేంద్రీకరణ రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని తెలంగాణా ప్రజలు మనకు పాటం నేర్పారు. మేం అమరావతి ప్రాంత అభివృద్ధిని వ్యతిరేకరించడం లేదు.పోలవర నిర్మాణాన్ని వేగవంతం చేయడం సీమ ప్రాంత ప్రజలకు అభ్యంతర మేమీ లేదు.పొతే,అభివృద్ధి పథకాలల్లో ప్రాధాన్యతల గురించే మా విన్నపాల్.ఏ తలిదంద్రులైనా, తమ పిల్లలో బలహీనంగా వున్న వారిపై ప్రత్యెక శ్రద్ధ జూపుతారు. మీరూ రాష్ట్రానికి ఇంటి పెద్ద.అందుకే మీరు మీ అభివృద్ధి ప్రణాళికలలో రాయలసీమకు ప్రత్యెక స్థానం ఇవ్వాలని మా విజ్ఞప్తి. చివరిగా మా విన్నపం- పోలవరం నిర్మాణ భాధ్యతలను విభజన చట్టం లో హామీ ఇచ్చినట్టుగా కేంద్రానికే వదిలేయండి. అలా అంటూ మీ సమర్థతను ప్రశ్నించడం లేదు. రాష్ట్రం ఆ భాద్యతను నెత్తికెత్తుకొనడంతో, బడ్జెట్ లో సాగునీటి రంగ కేటాయింపులలో సింహభాగం పోలవరానికే కేటాయించవలసి వస్తుంది. దాంతో దశాబ్దాలుగు పూర్తిగాని రాయలసీమ,ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులకు తగినన్ని నిధులుండవు.అసలే అప్పుల్లో రాష్ట్రమాయే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top