మే 31 న జరిగే ఛలో సిద్దేశ్వరం ప్రజాబహిరంగసభను విజయవంతం చేయండి.
— ప్రజలకు పిలుపునిచ్చిన రాయలసీమ సాగునీటి సాధన సమితి⁹
పాలకుల వివక్ష రాయలసీమ సమాజానికి పెనుశాపంగా మారిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఆరోపించారు.
సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా మే 31 న సంగమేశ్వరం లో జరిగే ప్రజా బహిరంగసభ విజయవంతానికై నంద్యాల పట్టణం ఛాంద్ బాడా, బాలాజీ కాంప్లెక్స్ మరియు మండలం లోని చాబోలు, మునగాల,అయ్యలూరు, పెద్దకొట్టాల, పోలూరు, పాండురంగాపురం గ్రామాలలో సమితి నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సమితి నాయకులు భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, జానో జాగో కన్వీనర్ మహబూబ్ భాష, చంద్రశేఖర్ రెడ్డిలి మాట్లాడుతూ…
రాయలసీమలో మరమ్మత్తులకు నోచుకోక ఉన్న ప్రాజెక్టులు..వీటి కింద వున్న పంటకాలువల మరమ్మత్తులకు 1500 కోట్లు ఖర్చుపెడితే వచ్చే ఖరీఫ్ సీజన్ కు పదిలక్షల ఎకరాలకు నీరందించవచ్చనీ..తద్వారా ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పాదనలతో పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్డించవచ్చనీ రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక రూపాలుగా ప్రభుత్వానికి నివేదించినా పాలకులలో చలనం రావడం లేదని విమర్శించారు. సాగునీటి హక్కులను పూర్తిగా వినియోగించుకోవడానికై రిజర్వాయర్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం ముందు వుంచితే నిధులు లేవంటూనే అమరావతి కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారనీ రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు వివరించారు.
పట్టిసీమ పూర్తయితే శ్రీశైలం నీళ్ళన్నీ రాయలసీమకే అన్న పాలకులు ఆ హామీని నిలబెట్టుకుపోగా ఇప్పుడు గోదావరి బనకచర్ల తో రాయలసీమకు గేమ్ ఛేంజర్ అంటూ మరోసారి రాయలసీమ సమాజాన్ని మోసపుచ్చేందుకు చూస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాల పంపిణీలో అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని రాయలసీమ సమాజం ముక్తకంఠంతో ఎలుగెత్తుతుంటే అదేమీ చెవికెక్కనట్లుగా KRMB ని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం రాయలసీమ సమాజాన్ని అపహాస్యం చేయడమేనని ఘాటుగా విమర్శించారు.
సిద్దేశ్వరం అలుగు నిర్మించడం వలన 60 tmc ల నీరు నిల్వ వుండి గొంతెండిపోతున్న రాయలసీమ ప్రాంతానికి త్రాగునీరు ఇవ్వడమే గాక లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని రాయలసీమ ప్రజల ఆకాంక్ష ఐన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వలన రాయలసీమ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలను సమితి నాయకులు ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు.
మే 31 న సంగమేశ్వరంలో జరిగే ఛలో సిద్దేశ్వరం ప్రజా బహిరంగసభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయా గ్రామాల ప్రజలకు సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించి కరపత్రంతో పాటు డిమాండ్లతో కూడిన స్టిక్కర్ ని గడప గడపకు పంపిణీ చేసారు.