హిడ్మా పుట్టుక, గమనం గమ్యం ఆధునిక భారతంలో పగవాడికైనా నచ్చేంత పాపులారిటీ.
వాడు ఆదివాసి బిడ్డడు,అడవి బిడ్డ అని, శతాబ్దాల తరబడి గజినీకి వెయ్యిరెట్లు అడవి సంపదలు కొల్లగొట్టిన మైదానం, రాజ్యం మునిపెన్నడు కనివిని ఎరుగని వికృత రూపంలో కనీసమైన కనికరం లేకుండా కిరాతకంగా చంపి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కథ చెప్తున్నది.
ఇక్కడే కదా అల్లూరి సీతారామరాజు తెల్లదొర చేతుల్లో రూథర్ఫర్డ్ ఆజ్ఞలతో బుల్లెట్ల జల్లడయ్యింది.
ఆదివాసి వీరుడి గౌరవం తగ్గుతుందనుకుందో ఏమో రాజ్యం… చావుకు స్థల ప్రాశస్త్యం ఉండాలని…అల్లూరి చనిపోయిన మన్యం దగ్గరికి తీసుకొచ్చి, తన సహధర్మచారిని,సహచరులను ఆరుగురిని కలిపి పొట్టన పెట్టుకున్నది.
నాకేమీ ఇది వీరమరణం, ఒక వీరుడు మరణిస్తే ప్రభవించు వేల వేలు, మరో బిర్సముండా…ఇంకో పేరు ఇంకో పేరు.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి యుద్ధంలో పాల్గొన్న వాని గాయాలతో సంబంధం లేకుండా, దానితో పెన వేసుకున్న అనేకనేక సామాజిక అంశాలను తడిమే ధైర్యం చేయకుండా, పొడిపొడిగా జోహార్లు జోహార్లు అని చేతులు దులుపుకునే ఆత్మ వంచన లేదు.
ఇట్లా ఆరుగురిని చంపినారో లేదో అప్పుడే…
మోడీ షా ప్రభుత్వం.. అడవిలో నక్సలైట్ల సంగతి తేల్చిన తర్వాత అర్బన్ నక్సలైట్ సంగతి తేల్చుతామంటున్నది.
అజిత్ దోవల్, అమిత్ షా మాటల ప్రకారం నక్సలైట్ల కంటే అర్బన్ నక్సలైట్లే ప్రమాదకరం. ఇంత పెద్ద మాట మోసిన అర్బన్ నక్సలైట్లు.. అందులో నా పేరు చేర్చిన సరే.. వెంట్రుక సమానం కూడా.రేపు జరిగే పరిణామాలకు భయపడి సాగిల పడవద్దు ఈ ప్రభుత్వాల ముందు. Me too urban naxalite అని ప్లకార్డ్ పట్టుకున్నాం కదా! ఇంకా ఇప్పుడెందుకు భయం.. ఈ దేశంలో దోపిడి పోవాలని ఆలోచించే ప్రతి చదువరి.. విరివిగా అర్బన్ నక్సలైట్ అయితే..
కలివిడిగా ఒడి ఒడిగా అర్బన్ నక్సలైట్ అని పేరు మోయడానికి నాకేమీ అభ్యంతరం లేదని గట్టిగానే అను. అర్బన్ నక్సలైట్ అన్నమాట జీవిత కాలపు పురస్కారం అని, కోటి దీపాల ఆరాధన అని, అమాయక ఆవులు కొమ్ములకు గంటలు కడితే శ్రవణానందకర జే గంటల చప్పుడు అది అని, మనిషిని మాత్రమే కోవెలలో నిలిపి దీపాలు వెలిగించే కార్తీక మాస నాయనానందకర దర్శనమని చెప్పండి.
బండి సంజయ్ కూడా చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. శవాలు అని శివాలెత్తి తడి గుడ్డ స్నానాల గురించి దేవుడు మీద ప్రమాణాల గురించి మాట్లాడే బండి సంజయ్ ఈరోజు ఎన్కౌంటర్ తర్వాత.. కేంద్రంలో ఉన్నది ఆశామసి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం.. తుపాకులు ఉంటే బార్డర్లో ఉన్న సైనికుల దగ్గర ఉండాలి లేదంటే అంతర్గత రక్షణలో ఉన్న పోలీసుల దగ్గర ఉండాలని సూపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. భాష చాలా ఇంప్రూవ్ అయినందుకు అభినందనలే గాని… మీరు రాజేసిన విద్వేషపు అగ్ని ఎంతమంది గుండు సామాగ్రికి బుల్లెట్లకు సమానమై ఎంతమందిని బలితీసుకుందో చెప్పడానికి చాలామంది సిద్ధం.
ఒకడంటాడు… కోటి రూపాయలు తలపై విలువగల హిడ్మా తలలో బుల్లెట్లు దించినమని.
వందేళ్లు దేశం కోసం క్షణం క్షణం కణం కణం అర్పించిన ఈ దేశభక్తులకు ఈ భూమి బిడ్డలు ఇంత కసిగా సంపదలుచుకున్న విదేశీ కిరాయి మూకలా?
…. హిందీలో చాలా ఏళ్ల కింద ఒక సినిమా ఉంది ఆ సినిమా పేరు రుడాలి. బహుశా డింపుల్ కపాడియా అందులో ప్రధాన పాత్ర అనుకుంటా! రాజస్థాన్లో ఆ ప్రాంతాల్లో ఉన్న సంపన్న కుటుంబాల్లో ఎవరైనా చచ్చిపోతే ఏడవడానికి బంధువులు సరిపోకపోతే లేదా వాళ్ళ ఇబ్బంది పడితే కిరాయికి మనుషులు వచ్చి చావులో ఏడవడం.. ఆ ఏడ్చే మనిషిని రుడాలి అనడం సారాంశం అనుకుంటా.
ఇప్పుడు దేశంలో ఎవడు ఎవడి కోసం ఏడవకూడదు. చనిపోయిన వాడి రాజకీయ లక్ష్యం గురించి మాట్లాడకూడదు. చనిపోయిన వాడు ఈ దేశపు భూమి పుత్రుడే కదా అంటే కూడా దేశద్రోహం..
మొన్ననే కదా చత్తీస్గడ్ హోం మంత్రి విజయ్ మెడలో ఎర్రని కండువా వేసుకొని కామ్రేడ్ తీరుగా పువర్తి వెళ్లి హెడ్మా తల్లి, దేవు తల్లి…వాళ్లను కూర్చోబెట్టుకొని లొంగిపొమ్మని చెప్పండమ్మా! అన్ని విధాలా ఆదుకుంటాం, కోటి రూపాయలు మీ ఇంట్లో ఉంటాయి.. ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు గ్రేహౌండ్స్ ఆపరేషన్ పేరా చంపి రేపు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఏం చెప్తారు?
చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షా తో పాటు మోడీతో పాటు పోటీపడి అడవి సంపదకు పోటీ పడుతున్న వాళ్ళ అభిమానం చూడడానికి తన పాత విశ్వరూపాన్ని పునరుద్ధరించుకున్నాడని చెప్తారా?
AI వచ్చింది.. హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లతోటి ఏం వైద్యం చేయించుకుంటాం.. మన జబ్బులన్నిటికీ అదే వైద్యం చేస్తుంది కచ్చితంగా.. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి గడపగడపకు వెళ్లి బాధల్ని తీర్చుతుందని చెప్పి… పోలీస్ ఇంటలిజెన్స్ తోటి
రాజ్యాంగం యెడల కనీస నాలెడ్జి మర్చిపోయిన చంద్రబాబు… నీ వివరణ ఏముంటదో మాకు తెలియనిది కాదు.
ఎంత బీతిల్లితే తెలంగాణ పల్లె… మీసం మొలచిన నేరమే తెలంగాణ పల్లెలో అని పాట పాడి దుఃఖ పడ్డది.. ఆ ఎడతెగని దుఃఖం రక్తపాతం నీ కాలంలోనే కదా ఊపిరి సలపనంత ఉక్కపోత కాలాన్ని సృష్టించింది.
మీరు నలుగురు ఒక గుంపు కట్టి, ఈవీఎంలతో జతకట్టి రాష్ట్రాలు జయిస్తున్నామని ఎన్నికల్లో గెలిచినప్పుడల్లా విర్రవీగుతున్నారేమోగానీ…
మీరు చెప్పుకుంటున్న ప్రధాన రాజకీయ స్రవంతిలో 22 ఏళ్ల ప్రయాణం తర్వాత సవాల్ విసిరి చెపుతున్నా.. మీ అందరికీ తెలిసిన వాన్నే. మీతో కూడా జత కట్టిన వాడిని..
ఎవడు ఎన్ని మార్ఫింగులు చేసినా, ఎన్ని thought పోలీసింగులు చేసిన, ఎంత మీడియాని కంట్రోల్ లో పెట్టి కొత్త బంగారులోకం, విజన్ 20-20.. సనాతన వినూతన ప్రయోగమని ఎన్ని పిల్లి మొగ్గలేసిన..
ఒక్కసారి అమాయకంగా ప్రజలను నమ్మి అట్లా నెత్తుటి ముద్ద అయిపోయిన ఆ వీరుల ముఖాల ముందు అద్దంలో చూసుకోండి..
మీరంతా కిరాతకంగా కనిపిస్తారు మీకే తెలుస్తుంది.
మీరెంత రక్తపిపాసులో కాన్వాస్ లో బొమ్మ వేసినట్లు కనిపిస్తుంది. ఒక డ్రాకులాకు రెప్లికా గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సంబంధం లేకుండా అద్దంలో కనపడుతున్న మీ బీభత్స ప్రతిబింబం చూసి సిగ్గుపడండి.
చరిత్రలో హిట్లర్లు, నెపోలియన్లు, ప్రజలపై యుద్ధ బీభత్స దాడులు చేసిన ప్రతివాడు.. ఎన్ని తరాల కైనా వాడు బ్రతికుండగా శిక్ష అనుభవిస్తాడో లేదో నాకు తెలియదు గానీ.. పసి మొగ్గల యువ రక్తం కనుపాపల్లో వాడొక కిరాతక చక్రవర్తి. మోస్ట్ అన్వర్తి.
హిడ్మాను టార్గెట్ చేయడంలో భారతదేశంలోని మీడియా ముఖ్యంగా ఛత్తీస్గడ్ రెండు తెలుగు రాష్ట్రాల మీడియా ఫోకస్ చేసి చేసి చాలా తప్పు చేసింది. చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్స్.. ప్రపంచ స్థాయి ప్రజలు చర్చించుకునే ఆధునిక కాలం ఆయుధ సంచార అసమాన సాహస అడవి బిడ్డ నాయకత్వ లక్షణాల్ని భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించడానికి మంటల ఎగదోసింది. అది క్షమించరాని తప్పు.
ఇట్లాంటి తప్పే 1996 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పాలనలోనే వీరన్న కులవర్గ నిర్మూలన పందా తీసుకుని వచ్చినప్పుడు.. అడవితో ఉన్న అనుబంధాన్ని సాకుగా తీసుకొని హైదరాబాదులోని వినాయక్ నగర్ లో పట్టపగలు జనం చూస్తుండగా పట్టుకెళ్ళి ఎక్కడో సిరిసిల్ల దగ్గర గట్ల సింగారం చెట్ల దగ్గర పడేసి భవిష్యత్తులో సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్త ప్రభావితం చేయగలిగే ఒక పెద్ద రాజకీయ నాయకుని రాజకీయ హత్య చేసింది.
ఇప్పుడు కూడా హిడ్మాను చంపడం ద్వారా అట్లాంటి రాజకీయ ఆశ్చర్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది.
ఈ దేశంలో పార్లమెంట్ లో ఉన్న ప్రతిపక్షాలు పొద్దుబోని ముచ్చట్లు చాలా చెపుతాయి గాని
ఇంత అన్యాయంగా ఆపరేషన్ కగార్ పేరుతో మనుషుల్ని చంపుతుంటే కడుపులో చల్లగా వదలకుండా స్టేట్మెంట్లు ఇస్తూ కాలం గడుపుతాయి.
సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని కొంత తీవ్రమైన ప్రకటన ఇచ్చిన.. విశ్వవ్యాప్తంగా వాళ్ల సిపిఐ పార్టీ, సిపిఎం సిపిఐ ఎంఎల్… అర్బన్ నక్సలైట్లు ముద్ర రాహుల్ గాంధీ గారు, పౌర హక్కుల కోసం పట్టుగొమ్మ అవతారన్న నాటి టిఆర్ఎస్ కెసిఆర్ గారు… ఇంకా ఇంకా చాలామంది ఈ కిరాతకాన్ని ఆపమని పార్లమెంటును కుదపకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎంత డొల్లతనమైందో పసి పిల్లవాడు కూడా చెప్పుకునే స్థితి వస్తుంది










