- మావోయిస్టు ఆగ్రనేత చిన్నన్న ఎన్ కౌంటర్.
- నంద్యాల జిల్లా,ఆత్మకూరు.
విప్లవోద్యమాలకు పురిటి గడ్డ అయిన నంద్యాల జిల్లా….ఆత్మకూరు మండలం, వడ్ల రామాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు,మృతుడు మావోయిస్టు నేత సుగులూరి చిన్నన్న కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్న దానమయ్య,దానమ్మ లకు ఐదు మంది సంతానం . అందులో మూడవ వాడే సుగులూరి చిన్నన్న. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించిన సుగులూరి చిన్నన్న ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడై అప్పుడప్పుడు వారి ఉపన్యాసాలను వినేందుకు సమీప అడవికి వెళ్లి వచ్చేవారు.
ఈ విషయాన్ని గ్రహించిన చిన్నన్న తల్లిదండ్రులు కొత్తపల్లి మండలం, దుద్యాల గ్రామానికి చెందిన సరోజమ్మ తో పెళ్లి జరిపించారు. వివాహనంతరం చిన్నన్నకు ఇద్దరు కుమారులు జన్మించారు. మావోయిస్టు పార్టీ పట్ల మక్కువ పెంచుకున్న చిన్నన్న భార్యా పిల్లలను వదిలి అడవి బాట పట్టారు. నల్లమలలో మావోయిస్టు కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగుతున్న సమయంలో చిన్నన్న వివిధ హోదాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. భవనాసి దళ కమాండర్ గా పనిచేస్తూ మావోయిస్టులు చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయనపోలీసుల హిట్ లిస్టులోకి చేరారు.
వేంపెంట మరణహోమం లాంటి పెద్దపెద్ద ఘటనలలో సుగులూరి చిన్నన్న పాలుపంచుకోవడంతో అప్పటికే ఆయనను లొంగిపోవాలని పలుమార్లు పోలీసులు విజ్ఞప్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే నల్లమలలో మావోయిస్టుల ఏరువేత పెరుగుతున్న క్రమంలో నక్సల్స్ కు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో సుగులూరి చిన్నన్న నల్లమల నుంచి దండకారణ్యానికి వెళ్లినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నా యి.
మూడు దశాబ్దాల పాటుమావోయిస్టు పార్టీ అగ్రనేతగా పేరుగాంచిన సుగులూరు చిన్నన్న అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్ గా పిలువబడుతూ తన కార్యకలాపాలను కొనసాగించారు. చత్తీస్ గడ్ రాష్ట్రం రాజ్ నంద్ గావ్ జిల్లా మదన్వాడ-కాంకర్ అటవీ సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో చిన్నన్న మృతి చెంది నట్లు పోలీసులు వెల్లడించారు. 1990 దశకంలో సాధారణ గ్రామ రైతు కూలి సంఘం సభ్యుడుగా విప్లవ ప్రస్థానం ప్రారంభించిన సుగులూరి చిన్నన్న రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.
చిన్నన్న మావోయిస్టు పార్టీకి అంకితమైన నేపథ్యంలో చిన్నన్న సతీమణి తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టినిల్లు అయిన దుద్యాల గ్రామంలో జీవిస్తుంది. చిన్నన్న కుమారులు ఇద్దరు ప్రభుత్వ భాగస్వామ్య ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. పోలీసుల సమాచారం మేరకు చిన్నన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేతృత్వంలో చిన్నన్న కుటుంబ సభ్యులు చత్తీస్ ఘడ్ ఆటవీ ప్రాంతానికి బయలుదేరారు. మృతుడు చిన్నన్న పై రూ. 25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు చిన్నన్న మృతితో ఉమ్మడి కర్నూలు జిల్లా ఉలిక్కిపాటుకు గురైంది..