నల్లమల అడవుల విశిష్టత

FB_IMG_1706634532545.jpg

నల్లమల అడవులపై సీనియర్ జర్నలిస్టు నాగారెడ్డి సుబ్బారెడ్డి

నల్లమల ఒక విజ్ఞాన ఖని ….సౌందర్య భోషాణం …. జీవవైవిధ్య ఆవరణం.
+++++++++
అప్పుడెప్పుడో ఒక తమిళ తమ్మి ఈ అడవులకు వచ్చి ఆ కొండలను చూసి పరవశించి నల్ల మలై అనుకున్నాడట …అంటే మంచి లేదా అందమైన కొండలను అర్తం. అదే నల్లమల గా మనకు స్థిరపడి పోయింది. ఈ అడవులగుండా (రైలులో)ప్రయాణించిన భావ కవి దేవుల పల్లి కృష్ణ శాస్త్రి కవితావేశం ఉద్భవించి’ ఆకులో ఆకునై … పూవులో పూవునై …. ఈ అడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా ….. అంటూ ఏకంగా కృష్ణపక్ష మనే కావ్య గానం చేశారు.అలాగే ఈ దేశంలో క్రైస్తవాన్ని పాదు కొల్పెందుకు అమెరికాలో సుశిక్షితు డై వచ్చిన స్తాంటన్ దొర మచిలీ పట్నం నుంచి గుంటూరు వచ్చి కర్నూలుకు (అప్పటి కర్నూలు స్టేషన్ ద్రోణాచలమే) రైలులో వస్తు ఈ అడవి అందాలకు మైమరచి క్రీస్తును స్తుతించడం మాని పకృతి కాంతకు దాసోహమన్నారు.ఆయన రాసిన అవేక్ ఆఫ్ ఇండియా అన్న పుస్తకంలో ఆయన మనోభావాల సుమ భావనలు స్పష్టంగా a
అగుపిస్తాయి.అడవిని కాపాడాలన్న స్పృహతో బ్రిటిష్ వాడు అడవుల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి యురోపియన్ వాస్తు శిల్పంతో అందమైన బంగ్లా లు కట్టించారు.అవన్నీ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నల్లమలలో కవర్ తీసుకున్న పోరాట యోధులను వేటాడేందుకు వచ్చిన మలబార్ పోలీసులకు ఆశ్రయం ఇచ్చాయి అందుకే ఇవి విప్లవకారులచే తగుల బెట్టబడి శిధిలమై కనిపిస్తాయి.అప్పటి బ్రిటిష్ దొరల ఆనవాళ్లు ఉడ్స్ , సిమ్స్ పైర్ లైన్లుగా , ఉడ్స్ ప్లాంటేషన్ గా ఇప్పటికీ నల్లమలలో కనిపిస్తుంటాయి.అటవిరక్షణకు ఎంతో కృషి చేసిన ఉడ్స్ తమిళనాడు అడవుల్లో మృతి చెందగా ఆయన్ను అక్కడి అడవిలోనే ఖననం చేశారు.
చెంచులు ఆదిమగిరిజన తెగకు చెందిన వారు.వీరికి నల్లమల మాత్రమే ఆవాసంగా ఉంది.ఇప్పటి ఆఫ్రికా ఖండంగా పిలువబడే ప్రాంతంలో భూమిపై తొలి మానవుడి ఆవిర్భావం జరిగిందని ఆంత్రో పాలజిస్టులు భావిస్తారు.భూమి ఖండాలుగా విడివడి కాలంలో ఆఫ్రికా అడుగు భాగం ఇప్పటి భారత ద్వీప కల్ప భాగాన్నుంచి విడి వడిందని చెబుతారు ఎలా ఆఫ్రికా విడిపోవడంతో తూర్పు కనుమల్లో నిలిచి పోయిన ఆది మానవుడే నేటి నల్లమల చెంచు అని నాభావం.ఇకపోతే ఆసియాఖండంలోనే అద్భుతమైన జీవవైవిధ్యాన్ని నల్లమలలో మాత్రమే చూడగలం . పర్యావరణ పిరమిడ్ లో అగ్రసూచీగా చెప్పబడే పెద్ద పులులకు నల్లమల సురక్షితమైన ప్రాంతం.విటి పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన NSTR (నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్)పులుల అభయారణ్యం దేశంలోనే (విస్తీర్ణంలో) అతి పెద్దది. చేపలు,ఉభయచరాలు,పక్షులు,సరీసృపాలు,క్షీరదాలు లెక్కకు మించి ఉన్నాయి.వృక్ష జాతులు,పొదలు,తీగలు, పుష్పించని మొక్కలు ఎన్నో ఉన్నాయి.వనమూలికలు వీటికి అదనం ఇంతటి చరిత్ర కలిగిన నల్లమల గుండా మూడురోజులు పలు ప్రదేశాలలో తిరుగాడడం బల్లో చదివిన పాఠాలను ఇంట్లో మననం చేసుకున్నట్లు అయ్యింది.ఒకరా ఇద్దరా 20 మంది అమితాసక్తి గల వాళ్ళు ఒకచోట చేరడం విజ్ఞానాన్ని కుప్ప పొందినట్లుగా కనిపించింది .ఎంతో చరిత్ర కలిగిన మధ్యతరహా ప్రాజెక్ట్ వరదరాజస్వామి డ్యాం నుంచి మొదలైన మా అడవి ప్రయాణం వైయస్సార్ స్మృతివనం గుండా నాగలుటి వీరభద్రాలయం వరకు సాగింది.విజయనగర రాజుల చే నిర్మించ బడ్డ ఈ ఆలయం సమీపంలోనే అంతకు ముందే శ్రీశైలానికి వెళ్ళే నడక దారిలో రెడ్డిరాజులు నిర్మించిన మెట్ల మార్గం కూడా గోచరం చేయించాం.ఆ తరువాత నల్లమలలో కప్పడి పోయిన వెయ్యేళ్ల పూర్వపు మహత్తర నగరం సిద్దాపురం ఆనవాళ్లను పరిశీలించడం జరిగింది . నాటి నాగరికతా విశేషాలను విశ్లేషించుకున్నాం.చెంచుల రాజధాని అయిన పెచ్చేర్వు ప్రయాణం అనుకోకుండా రద్దవడంతో నేను మునుపెన్నడూ చూడని అక్క మహాదేవి గుహలు చూశాం.గుహలు ప్రాచీన నాగరికత,చరిత్ర కు ఇప్పటికీ నిలిచిన ఆనవాళ్లు. టూరిజం బోటులో నదిలో ప్రయాణం అంత ఆహ్లాదకరంగా సాగక పోవడానికి ఆ ప్రయాణంలో మా పక్కనే కూర్చున్న ఓ పోలీసు అధికారి కుటుంబం కూడా ఉండడం ఓ కారణం కావచ్చు. వీర శైవానికి దారులు తీసిన ప్రాంతాలు … ఆంగ్లో – చెంచు సంపర్క విశేషాలు నడిచే చరిత్ర శివ ద్వారా తెలుసుకున్నాం.అక్కడ నాక్కనిపించిన అద్భుతం శిలాతోరనం . ఇది తిరుమలలో ఉన్న దానికంటే భారీ ప్రకృతి నిర్మాణం.అట్లాంటా నుంచి కమలాపురం వరకు మాతో నల్లమల సోయగాల అనుభవాలు పంచుకున్న అందరికీ అభివాదాలు,అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top