Parliament Sessions : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి
ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్ నిర్వహణ
ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు
కిసాన్ సమ్మాన్ 50 శాతం పెంపునకు చాన్స్
ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం
అఖిలపక్ష భేటీలో ఫ్లోర్ లీడర్లకు వెల్లడి
11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షనూ ఎత్తివేత
ఉమ్మడి కార్యాచరణ కొరవడిన ప్రతిపక్ష కూటమి
న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బుధవారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది..