వై.యస్.ఆర్ జగనన్న భూరక్ష – 2020 – YSR Jagananna Bhooraksha 2020

YSR Jagananna Bhooraksha 2020

YSR Jagananna Bhooraksha 2020

  • వై.యస్.ఆర్ జగనన్న భూరక్ష 2020
  • ప్రచారం పిచ్చితో భూ సర్వే రాళ్లపై తన బొమ్మ ముద్రించుకున్న ఆనాటి సీఎం
  • ఉమ్మడి జిల్లాలో నాలుగున్నర లక్షల సర్వే రాళ్లు
  • ఒక్కోరాయి పాతడానికి రూ.150 చొప్పున తగలేసిన వైసీపీ ప్రభుత్వం
  • జగన్ బొమ్మలు తొలగించేందుకు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం

గత సీఎం జగన్ రెడ్డి బొమ్మల పిచ్చి రైతులకు అష్టకష్టాలు తెచ్చి పెట్టింది. రూ. కోట్ల ప్రజాధనం ఖర్చు చేసిన ఈ విధానం మీద రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సర్వే అవకతవకలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగనన్న భూరక్ష- భూహక్కు పేరుతో పొలాలను సర్వే చేసే కార్యక్రమాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్టు) 2022లో నాటి సీఎం జగన్ రెడ్డి ఎంతో ఘనంగా ప్రారంభించారు. పొలాలను కొలతలు వేసి తన బొమ్మతో రాళ్లు పాతడమే కాకుండా గతంలో ఉన్న పాసు పుస్తకాలను కూడా మార్చేసి తన బొమ్మతో భూహక్కు పత్రాలను రైతు చేతిలో పెట్టారు. ఈ జగనన్న భూసర్వే-భూరక్ష పథకానికి రాష్ట్రంలో దాదాపు రూ.700 కోట్లు ఖర్చుచేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ సర్వే రాళ్లపై ముద్రించిన జగన్ బొమ్మను తొలగించే కార్యక్రమాన్ని ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 914 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 476 గ్రామాలకు గాను 255 గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్లు అది కార వర్గాలు తెలిపాయి. వీటి కోసం 250 లక్షల సర్వే రాళ్లను ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి తెప్పించారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో 438 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఆనాటి జగన్ ప్రభుత్వం 211 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 147 గ్రామాల్లో 1.89 లక్షల సర్వే రాళ్లను పొలాల సరిహద్దులో నాటినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 4లక్షలకు పైగానే సర్వే రాళ్లను నాటినట్లు సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూరక్ష, భూహక్కు పథకం ద్వారా చేపట్టిన పొలాల రీసర్వే కార్యక్రమంలో తమ పొలాల సర్వే సక్రమంగా జరగలేదని, మళ్లీ కొలతలు వేసి తమ భూముల విస్తీర్ణాన్ని సరిదిద్దాలని రెవెన్యూ కార్యాలయాల వద్ద జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో వందలాది మంది రైతులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. పొరపాట్లను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి వినతి పత్రాలను తీసుకుంది. డిసెంబరు చివరికల్లా ఈ తప్పులను సరిదిద్దాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.

సర్వే రాళ్లకోసం రూ.700 కోట్లు ఖర్చు

ప్రధానంగా ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రభుత్వం సర్వే రాళ్లను ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.500 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కోరాయిని తయారు చేసిపొలాల్లో పాతేందుకు రూ.150 ప్రకారం 4 లక్షల సర్వే రాళ్లకు దాదాపు రూ.6 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ కాలంలో 1823లో పొలాల సర్వే జరిగిందని, అప్పటి నుంచి మళ్లీ సర్వే జరగకపోవడం. వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తూ ఆనాటి సీఎం జగనన్న భూరక్ష-భూహక్కు కార్యక్రమాన్ని 2022లో 390 జీవో ద్వారా ప్రవేశ పెట్టారు. దీని వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. పక్క రైతులతో, బంధువులతో, స్నేహితులతో నిత్యం ఘర్షణలు మొదలయ్యాయి. ఈ గొడవలు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వేతో పాటు సర్వేరాళ్లు పాసు పుస్తకాల కోసం ఆనాటి? ప్రభుత్వం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల పాసుపుస్తకాలు, 77 లక్షల సర్వే రాళ్లు తయారు చేయించింది..

సమగ్ర భూసర్వేలో భాగంగా పొలాల్లో పాతిన రాళ్లపై బొమ్మను చెరిపేసేందుకు రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని కూటమి ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, డిసెంబరు నెలాఖరు నాటికి ఎక్కడా సర్వే రాళ్లపై జగన్ ఫొటో ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. అదే విదంగా రైతులకు అందించిన భూహక్కు పత్రాలపై కూడా జగన్ బొమ్మను తొలగించేందుకు కూడా. కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కర్నూలు జిల్లాలో 3 విడతల్లో కలిపి 86,900 భూహక్కు పత్రాలు, అదే విదంగా నంద్యాల జిల్లాలో 73,750 భూహక్కు పత్రాలు రైతులకు అందజేశారు. రైతుల పాసు పుస్తకాలపై పాలకుల బొమ్మలు ఉండడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు ఇవ్వాలనే అభిప్రాయాలువస్తున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ఈ భూహక్కు పత్రాలు రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజముద్రతో రైతులకు త్వరలోనే పాను పుస్తకాలు అందిస్తామని ప్రకటించింది.

సర్వే రాళ్లపై బొమ్మలను చెరిపేస్తున్నాం..

కర్నూలు జిల్లాకు రెండున్నర లక్షల సర్వే రాళ్లను ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి తెప్పించారు. మరో 50వేల సర్వేరాళ్లు రైతుల పొలాల్లో పాతాల్సి ఉంది. కొన్ని సర్వే రాళ్లు ఆయా గ్రామాల్లోని రైతు సలహా కేంద్రాల వద్ద ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రకారం సర్వే రాళ్లపై బొమ్మలను చెరిపేసే కార్యక్రమం చేపడుతున్నాం – మునికన్నన్, సర్వే ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top