డిజిటల్ అరెస్టులు : ఈ డబ్బున్నవాళ్లు తెలివిగలవాళ్లు కాదు అదృష్టవంతులే !టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను డిజిటల్ అరెస్టు పేరుతో సైబరీ నేరగాళ్లు ట్రాప్ చేసి.. కోటికిపైగా కొట్టేశారు. ఈ మేరకు ఆయన స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ మోసం గురించి విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కొద్దిరోజులుగా డిజిటల్ అరెస్టు మోసాల గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా ప్రధాని మోదీ ఈ మోసాల బారిన పడవద్దని.. మన చట్టంలో అలాంటివి లేవని చెప్పారు. ఎవరో పెద్దగా ఏమీ తెలియని వారు భయపడ్డారంటే అర్థం ఉంది కానీ అన్నీ తెలిసి.. ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు ఇలా మోసం పోవడం అంటే.. ఏమనుకోవాలి ?సైబర్ నేరగాళ్లు ఇటీవల కొత్త పద్దతులతో ప్రయత్నిస్తున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్ సెటప్ వేసుకుని పూర్తి స్థాయి యాక్టర్లతో రంగంలోకి దిగుతున్నారు. వారికి ఏ విధంగా ఫోన్ నెంబర్లు, సమాచారం చేరుతుందో ఎవరికీ తెలియదు కానీ.. మొత్తం సమాచారంతోనే నేరాలు చేస్తున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ చదువులేని వ్యక్తం కాదు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయనకు చాలా అంశాలపై అవగాహన ఉంటుంది . అయినా ఆయనను బురిడీ కొట్టించారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ వారి కన్నా ఒక అడుగు ముందుకు ఆలోచించాల్సి ఉంది. తాను ప్రజా ప్రతినిధినని..ఏమైనా ఉంటే నేరుగా తేల్చుకుంటానని చెప్పాల్సింది. ఆ ధైర్యం ఆయన చేయలేకపోయారు.పుట్టా సుధాకర్ యాదవ్ బయట పడ్డారు కానీ.. ఇలా మోసపోయిన చాలా మంది బయటపడలేకపోతున్నారు. కోట్లు పోగొట్టుకుని మౌనంగా రోదిస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఓ ప్లాన్ మాత్రమే. ఇప్పుడు వారు కోర్టుల సెటప్‌లు కూడా వేస్తున్నారు. హనీ ట్రాప్‌లు చేస్తున్నారు. ఇలాంటి వాటి బారిన పడి ఎంతో మంది ధనవంతులు మోసపోతున్నారు. అది కూడా కోట్లలో. పరువు పోతుందన్న భయంతో ఎక్కువ మంది బయటపడటం లేదు. లోపలే కుమిలిపోతున్నారు. అందుకే ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా.. డబ్బున్న వాళ్లంతా తెలివిగలవాళ్లు కాదు.. అదృష్టవంతులే.

TDP MLA Putta Sudhakar Yadav cheated of Rs. 1 crore









