**రేషన్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి
***కూటమి పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన
***జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో- కన్వీనర్ పెంటేల బాలాజి
AP: గుంటూరు జిల్లా, చిలకలూరిపేట : ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే మాఫియాపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. ఆయన జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో- కన్వీనర్ పెంటేల బాలాజి విలేకర్లతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ దిశగా అస్తవ్యస్తంగా మారిన ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సిద్దం కావడం హర్షనీయమని వెల్లడించారు.
వైసీపీ పాలనలో రేషన్‌మాఫీయా ఆగడాలు
గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్‌బియ్యం అక్రమరవాణాకు అడ్డులేకుండా పోయిందని, పేదలకు అందాల్సిన బియ్యాన్ని పంపిణీ చేయకుండానే బొక్కేసారని మండిపడ్డారు. అప్పట్లో అధికారులు కూడా రేషన్‌బియ్యం మాఫియాను కట్టడి చేయలేకపోయారని వెల్లడించారు. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖలో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు. జిల్లాతో పాటు చిలకలూరిపేటలోనూ రేషన్ మాఫియా అగడాలు పెరిగిపోయాయని వెల్లడించారు. రాయితీపై అందించే నిత్యావసర సరకులను గత వైసీపీ ప్రభుత్వం కుదించుకుంటూ వచ్చిందన్నారు. ఇచ్చేది నాలుగు రకాలే అయినప్పటికీ బియ్యం మినహా మిగతావి అరకొరగానే సరఫరా చేసిందని వెల్లడించారు. . మధ్యలో కొన్ని నెలలు కందిపప్పు పంపిణీ పూర్తిగా మానేశారని, తర్వాత గోధుమ పిండి సరఫరా కూడా లేకుండా పోయిందని, పంచదార కూడా కొంతమందికే అందేదని గుర్తు చేశారు. . ఇంటింటికీ రేషన్ పేరుతో ఎండీయూ వాహనాలను తీసుకొచ్చినప్పటికీ లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదన్నారు. . ప్రతినెలా 1 నుంచి 17వ తేదీ వరకు వీటిద్వారా సరకులు పంపిణీ చేసినప్పటికీ సమయానికి అందుబాటులో లేని లబ్ధిదారులకు సరకులు అందేవికావని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్లిపోవడంతో సరకులు తీసుకోలేకపోయేవారని పేర్కోన్నారు. ఇంటింటికీ పంపిణీ అని చెప్పినప్పటికీ వీధి చివరిలో రోడ్డుపై వాహనం ఆపి పంపిణీ చేయడంతో అక్కడ వరుసలో నిలబడి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగిందన్నారు. . మరోపక్క బియ్యం పెద్ద మొత్తంలో పక్కదారి పట్టి నల్లబజార్లకు తరలిపోయేదన్నారు.
ప్రక్షాళన దిశగా పంపిణీ వ్యవస్థ
అయిదేళ్ల వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన ప్రజాపంపిణీ వ్యవస్థను గాడినపెట్టే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ప్రతినెలా పేదలకు అందించే రేషన్ సరకుల్లో అవకతవకలు, అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయనుందన్నారు. ఇప్పటికే తూకాల్లో తేడాలు గుర్తించి సరఫరా నిలిపివేయించి తనిఖీలకు ఆదేశించారని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి జరిగితే అంతకమించిన దౌర్భాగ్యం ఉండదన్నారు. ప్రభుత్వం మాత్రమే పారదర్శకంగా ఉంటే సరిపోదని వ్యవస్థను నడిపే రేషన్‌డీలర్‌లు కూడా నిజాయితీగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడిన పడుతుందని, అన్ని సరకులు ప్రతినెలా సక్రమంగా అందుతాయని బాలాజి ఆశాభావం వ్యక్తం చేశారు.