- ధాన్యం ధర పతనం
- తుఫాన్ హెచ్చరికతో రైతుల్లో ఆందోళన
- కల్లాల్లోనే వరి ధాన్యం
- పెట్టుబడి కూడా చేతికి రాలేదంటున్నరైతులు
- జాడలేని కొనుగోలు కేంద్రాలు
వరి ధాన్యం ధరలు పడిపోయాయి , గిట్టుబాటు ధర లేదని రైతన్న విలవిల లాడుతున్నాడు. పెట్టుబడి కూడా చేతికి రాదని, ప్రభుత్వం తమను ఆదుకోదా? అని ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలో వివిధ గ్రామాల్లో వరి కోతలు ముమ్మరం చేశారు. వరి దిగుబడి బాగా వచ్చినా.. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లా డుతున్నారు . ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టు కుంటున్నారు. మండలంలో 1107 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు వరి నారు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, కూలీల ఖర్చులు మొత్తం కలిపి పెట్టుబడులు ఎకరాకు రూ.40 వేలు నుంచి రూ.50 వేలు వరకు ఖర్చు పెట్టారు. కౌలు రైతులకు మరింత ఖర్చు వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎకరాకు 40 నుంచి 45 బస్తాలు వరి ధాన్యం పండింది. మంచి దిగుబడి వచ్చిందని రైతులు సంతోషపడుతున్నా కనీసమద్దతు ధర లేక పోవడంతో ఆశలు అడియాశలయ్యాయి.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
గత ఏడాది కర్నూలు సోనా బస్తా రూ.2 వేలు నుంచి రూ.2500 వరకు, నంద్యాల సోనా రూ.2,500 నుంచి రూ.2,700 వరకు ధర పలికింది. ఈ ఏడాది నంద్యాల సోనా రూ.1,400 నుంచి రూ.1,500, కర్నూలు సోనా రూ.1,100 నుంచి రూ.1,500 లోపు దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలను చూసి రైతులు పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కనీస మద్దతు ధర కల్పించాలి ; యాగంటినాయక్, రైతు, ఎం తాండ
ఆరుగాలం కష్టించి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. మూడెకరాల్లో వరి సాగు చేశా. ఎకరాకు రూ.40 వేలు నుంచి రూ.50 వేలు దాక పెట్టుబడి పెట్టా. మార్కెట్లో రూ.1,300 విక్రయిస్తున్నారు. వరి ధాన్యం మాత్రం తక్కువ ధరకు కొంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.
దళారుల దోపిడీ నుంచి వరి రైతులను కాపాడాలి ; రవినాయక్, రైతు, ఎం.తాండ
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మూడెకరాల్లో వరి సాగు చేశా. ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టా.. మార్కెట్లో ధరలు బాగా తగ్గిపోయాయి. 75 కేజీల బస్తా రూ.1,300 ప్రైవేటు వ్యాపారులు కౌంటున్నారు. ధర పతనం కావడంతో నష్టపోతున్నాం. దళారుల దోపిడి నుంచి రైతులను కాపాడాలి.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్