శ్రీశైలం వచ్చే భక్తులందరికీ విజ్ఞప్తి
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా శ్రీశైలం రహదారి రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు
నంద్యాల, అక్టోబర్
ఈ నెల 16వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా శ్రీశైలం వైపు వెళ్లే రహదారులపై తాత్కాలిక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షెరాన్ సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 16న ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో హైదరాబాద్ నుండి శ్రీశైలం వైపు ప్రయాణించే భక్తులు, అలాగే దోర్నాల మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునే యాత్రికులు తమ పర్యటన ప్రణాళికలను తగిన విధంగా సవరించుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి పర్యటన అనంతరం సాధారణ వాహన రాకపోకలు పునరుద్ధరించబడతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ భక్తులందరినీ సహకారం అందించాలని కోరారు.