జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, ఆర్‌టిఓ జి.వి. శివారెడ్డి, డిఎస్పీలు,మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గుర్తించిన 25 బ్లాక్ స్పాట్లలో పెండింగ్లో ఉన్న పనులను వచ్చే సమావేశం నాటికి పూర్తి చేయాలని మునిసిపల్, ఆర్ అండ్ బి, ఏపీఆర్డిసి అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు ఎన్ హెచ్ 40 రహదారి విస్తరణ, ఎన్ హెచ్ 44 రోడ్డులోని టోల్ గేట్ నుండి డోన్ వరకు లైటింగ్, నిఘా కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే బేతంచర్ల, ఆళ్లగడ్డ, డోన్ తదితర ప్రాంతాల్లో గుర్తించిన 34 బ్లాక్ స్పాట్ల ప్రమాదకరమైన మలుపుల్లో స్పీడ్ బ్రేకర్లు, ప్రధాన హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు ఆర్ అండ్ బి ప్రతిపాదనల మేరకు జాతీయ రహదారుల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆర్టీవో శివారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రహదారుల్లో గుర్తించిన ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులు, పోలీసు సంపద అధికారులందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అవసరమైన ప్రదేశాల్లో నిఘా కెమెరాలు, గుర్తింపు సూచికలు స్ట్రాటజీ స్థాయిలో పెంచి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం వరకు ప్రమాదాల బారిన పడిన మరణాల సంఖ్యను తగ్గించగలిగామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో విద్యార్థులకు ప్రమాదాల నివారణపై ప్రత్యేక సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి సమాచారం అందించి ఆదుకునే వారికి ప్రభుత్వం పరంగా రూ.5 వేలు పారితోషికం ఇచ్చే విషయంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఎస్పీ సూచించారు.