మూడొంకాయలు (జానపద హాస్య కథ) – డా.ఎం.హరికిషన్
అనగనగా ఒక ఊర్లో ఎల్లన్న అని ఒకడుండేటోడు. వానికి చిన్నప్పటి నుంచీ వంకాయ కూరంటే చానా చానా ఇష్టం. కానీ ఆ వూర్లో ఆ సంవత్సరం ఎవరూ వంకాయ తోట ఎయ్యలేదు. దాన్తో తినాలని ఎంత కోరికున్నా వంకాయలు దొరకక బాధపడా వుండేటోడు.
ఒకరోజు వానికి పనుండి పక్కూరికి పోతా వుంటే దారి నడుమ ఒక చెట్టుకు మూడు వంకాయలు కనబన్నాయి. దాండ్లను చూడగానే వాని నోట్లో సర్రున నీళ్ళూరినాయి. “ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు” అని లొట్టలేసుకుంటా బెరబెరా ఆ మూడు కాయల్నే తెంపుకోని, పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చేసినాడు.
అట్లా ఇంటికి రావడం, రావడం పెండ్లాన్ని పిల్చి “ఏమే!…నాకు పక్కూల్లో కొంచం పనుంది. జర్రున పోయి జర్రునొస్తా.
అంతలోపల బాగా మసాలా యేసి ఈ మూడు కాయల్తో ఘుమఘుమలాడేలా గుత్తి వంకాయ కూరొండు.
రుచి గనుక బాగా లేదనుకో కిందా మీదా యేసి తంతా చూడు” అని చెప్పెల్లిపోయినాడు.
Also Read అత్తగారింటికి వెళ్ళడానికి RTC బస్సు చోరీ..అల్లుడు
ఆమె చానా అమాయకురాలు. మొగుడు ఎట్లా చెప్తే అట్లా చేయడం తప్ప ఆమెకు ఏమీ తెలీదు.
దాంతో మొగుడు చెప్పినట్లే ఆ మూడు వంకాయలూ తీసుకోని, మాంచి మసాలా చేసి, వంకాయలకు నాలుగువైపులా గాట్లు పెట్టి, లోపలంతా మసాలా కూరి పొయ్యిమీదికి ఎక్కిచ్చింది.
కాసేపున్నాక ఆమెకు వంకాయలు బాగా ఉడికినాయా లేదా అని అనుమానమొచ్చింది. కూర బాగాలేకపోతే మొగుడు తన్నినా తంతాడనుకోని భయపడి..
చూద్దామాగు అని ఒకటి తీసుకోని నోట్లో ఏసుకోని వుడికిందో లేదో చూసింది. బాగా ఉడికిందిలే ఇంకా భయం లేదు. నా మొగుడు బాగా మెచ్చుకొంటాడు అనుకొంది.
కాసేపున్నాక ఆమెకు మల్లా వంకాయలకు ఉప్పూ కారం బాగా పట్టిందా లేదా అని అనుమానమొచ్చింది. కూర బాగా లేదనుకో మొగుడు తన్నినా తంతాడని భయపడి “చూద్దామాగు” అని ఇంగోదాన్ని తీసి నోట్లో ఏసుకోని ఉప్పూకారం పట్టిందో లేదో చూసింది. బాగా సరిపోయింది ఇంక భయం లేదు అనుకొంది.
అంతలో ఆమె మొగుడు పనులన్నీ పూర్తిచేసుకొని వంకాయ కూర తిందామని వురుక్కుంటా ఇంటికొచ్చినాడు. ఇంట్లోకి రావడం, రావడం వానికి మసాలా వాసన ఘుమ్మని తగిలింది. నోట్లో నీళ్ళు సర్రున వూరుతా వుంటే పల్లెం తెచ్చుకొని ముందు పెట్టుకోని “ఏమే! వాసన అదిరిపోతా వుంది! దాదా… తీసుకోనొచ్చి ఏద్దురా. ఆకలి చంపేస్తా ఉంది” అన్నాడు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఉడికిందా లేదా అని ఒకటి, ఉప్పూకారం పట్టిందా లేదా అని మరొకటి వండేటప్పుడే తినేసింది గదా! ఇంగ అక్కడ మిగిలినేది ఒకే ఒక్కటి. దాంతో ఆమె వాని పళ్ళింలో ఆ ఒక్క వంకాయనే వేసింది. అది చూసి వాడదిరిపడ్డాడు.
“అదేందే! నేను తెచ్చినేది మూడయితే నువ్వు ఒకటే ఏసినావు మిగతా రెండూ ఏమయిపోయినాయి” అన్నాడు కోపంగా.
వంకాయ కూరంటే నాకెంత ఇష్టమో?
దానికామె “నువ్వేగదా రుచిగా లేకుంటే కిందా మీదా ఏసి తంతాననింది. అందుకే వంట చేస్తా… చేస్తా… ఉడికిందో లేదో చూద్దామని ఒకటి, ఉప్పూకారం పట్టిందో లేదో చూద్దామని మరొకటి తిన్నా” అనింది.
దానికి వాడు “ఏమే! నీకు తెలీదా వంకాయ కూరంటే నాకెంత ఇష్టమో? ఐనా తెలిసి తెలిసీ ఎట్లా తింటివే ఆ రెండూ” అన్నాడు కోపంగా.
ఆమె అమాయకురాలు గదా దాంతో “ఎట్లా తింటివే” అని మొగుడు అడుగుతా వున్నా చూపియ్యకపోతే ఏమంటాడో ఏమో అని బెదపడి వణికిపోతా వానీ పళ్ళెంలో వున్న ఆ ఒక్క వంకాయను గబుక్కున నోట్లో వేసుకోని నములుతా “ఇదిగో ఇట్లా తింటి” అని చూపిచ్చింది.