- వ్యవసాయ మోటర్ల దొంగలను పట్టుకున్న రైతు..
- ఆత్మకూరు డివిజన్ లో ప్రతిరోజుఎక్కడో ఒకచోట మాయమవుతున్న వ్యవసాయ మోటార్లు , స్టాటర్లు..
- దొంగల బెడదతో బెంబేలెత్తి పోతున్న రైతులు..
నంద్యాల జిల్లా… ఆత్మకూరు మండలం, ముష్టపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు శివాజీ నాయక్ కు చెందిన వ్యవసాయ మోటార్ ను ఇద్దరు వ్యక్తులు అపహరించుకొనిబైక్ పై తీసుకెళ్తుండగా వెంబడించి దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.
సిద్దాపురం చెరువు నుంచి కరివేనకు వెళ్లే నీటి కాల్వకు మోటర్ బిగించుకొని శివాజి నాయక్ పంటకు నీళ్లు కట్టుకుంటూ వుంటాడు. ఇప్పటికే రెండు మోటర్లను దొంగిలించడంతో… తరచూ పొలం దగ్గరకు వచ్చి వెళ్తూ..వారి కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా వున్నాడు.
అయినా సరే దొంగలు శివాజీ నాయక్ కళ్ళు కప్పి మోటార్ ను అపహరించుకొని వెళ్తున్న సమయంలో శివాజీ నాయక్ వారిని గుర్తించాడు. అప్పుడు వారిని అడ్డగించగా.. వారు కత్తి చూపించి చంపేస్తామని బెదిరించి.. బైక్ పై మోటార్ ను తీసుకోని పరారయ్యారు.
తన మోటర్ ను తీసుకెళ్తున్న వారిని వెంబడించిన శివాజీ నాయక్ ను తప్పించుకొని దొంగలు అతివేగంగా వెళ్తూ ప్రమాదవశాత్తు సైడ్ కాలువలోకి పడిపోయారు.. మోటర్ కాళ్ళ మీద పడి గాయాలు కావడంతో వారు రెడ్ హ్యాండ్ డ్ గా దొరికిపోయారు.
గ్రామస్తుల సహాయంతో ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ సమస్య ఒక శివాజీ నాయక్ ఒక్కడిదే కాదు ఆత్మకూరు డివిజన్ లో ప్రతి రైతుది ఈ దొంగల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలకు పెట్టిన పెట్టుబడి భారం పెరగడంతో.. గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక రైతులు కుదేలవుతున్న తరుణంలో.. ఈ మోటార్ దొంగలు గుదిబండగా మారారు. పోలీసులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని శివాజీ నాయక్ కోరారు..