నాగరికత పెరుగుతున్న కొద్దీ ఆధునిక సగటు మానవుడు ఆరోగ్య . విషయాలపై శ్రద్ధ, ఆసక్తి కనబరుస్తూ అవగాహన పెంపొందించుకోవటం సంతోషించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో శరీరారోగ్య పరిరక్షణకు మన చుట్టూ ఉన్న సహజ సిద్ధమైన మందు మొక్కలపై కూడా సమగ్ర అవగాహన కల్పించుకుని దైనందిన జీవితంలో ఆయా వ్యాధులకు వాటిని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని పెంపొం దించుకోవాలనే ఆకాంక్షను కలిగి వుండటం హర్షించదగ్గ పరిణామం.
మనకు ప్రకృతి ప్రసాదించిన మందు మొక్కలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల దృష్ట్యా కూలంకషంగా విశ్లేషణ చేయటం సాధ్యపడలేదు. అయితే మందు మొక్కలు ఆయా వ్యాధులపై ప్రత్యేకంగా పనిచేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయని ప్రాచీన కాలం నుంచి అనుభవాల ద్వారా తెలుసుకుంటున్న నగ్న సత్యం. ప్రస్తుతం కొండ పిండి చెట్టు గురించి తెలుసుకుందాం. కొండపిండి చెట్టు బయలు ప్రదేశాల్లో, బీడు ప్రదేశాల్లో, కొండ ప్రాంతాల్లో, పొలం గట్లపై, రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ 60-70 సెం. మీ వరకు పెరిగే, సంవత్సరమంతా కన్పించే బహువార్షికపు మొక్క ఇది నిటారుగా లేదా నేలబారుగా “వచ్చి పైకి లేచిన కొమ్మలతో దాదాపు వృత్తాకారంలోని పత్రాలు కణుపు దగ్గర కలిగి ఉండి పత్రాల మొదళ్ళలో సూక్ష్మంగా తెల్లగా ఉన్న పుష్పాలు కంకుల్లాగా ఉంటాయి.
ఈ మొక్కను వివిధ ప్రాంతాల్లో కొండపిండి చెట్టు, తెలక పిండి చెట్టు అని పిలుస్తారు. అమరాంథేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయనామం ఇర్వా లేనేట. రాళ్ళను కరిగించే ప్రత్యేక గుణం ఈ మొక్క కలిగి ఉండటం వల్ల షాషాణభేది, అశ్మభేదక, శిలాభిత్ అను వివిధ పేర్లతో సంస్కృతంలో పిలుస్తారు. తాజా కొండపిండిని దంచి రసం తీసి 10 మి.లీ. చొప్పున ఉదయం, సాయంత్రం తాగుతుంటే మూత్రకోశంలోని రాళ్ళు కరిగిపోతాయి. లేదా రెండు స్పూన్ల సమూలంగా ఎండించిన కొండపిండి చూర్ణాన్ని రెండు గ్లాసుల నీళ్లలో వేసి అరగ్లాసు నీరు మిగిలేలా మరిగించి, చల్లార్చి, వడగట్టి ఆ కషాయంలో ఒకటి రెండు స్పూన్ల పటిక బెల్లం పొడి కలిపి తాగితే కూడా రాళ్ళు కరిగిపోతాయి. ఈ కషాయ సేవనం వల్ల చిన్న పిల్లల్లో వచ్చే కడుపులో బల్లవ్యాధులు (లివర్, స్క్రీన్ల భాపు) హరిస్తాయి.
కొండపిండి మొక్కలతో మరొక ఔషదం
ఇప్పుడు చెప్పుకున్న వ్యాధులకు కొండపిండి మొక్కలతో మరొక రకమైన ఔషధాన్ని తయారు చేసుకుని నిల్వ యుంచుకుని రోజూ వాడుకోవచ్చు. ఎలాగంటే మరీ లేతగా వుండని, మరీ ముదురుగా వుండని మధ్య వయసులోని కొండ పిండి మొక్కలను సమూలంగా గ్రహించి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి మెత్తగా దంచి రసం తీసి రసానికి రెట్టింపు పటిక బెల్లం పొడి కలిపి చిన్న మంటపైన లేత పాకం వచ్చే వరకు కాచి దించి చల్లార్చి పూటకు పిల్లలకు అర చెంచా, పెద్దలకు 1 – 2 చెంచాల వంతున రెండు పూటలా కప్పు మంచి నీటిలో కలిపి త్రాగుచుండాలి. కొండపిండి చెట్టు ఆకులు, పూత కలిపి కూరగా వండుకుని అప్పుడప్పుడు తింటుంటే ఖర్చులేని సులభ వైద్యం ద్వారా మూత్రంలో మంట, చురుకు, పోటు, మూత్రం బొట్లు బొట్లుగా పడటం తగ్గుతాయి. పొత్తికడుపులోని దోషాలతో పాటు ఒంట్లో చేరిన దుష్టనీరు కూడా తగ్గుతుంది. మూత్రపిండాలు సక్రమంగా విధులను నిర్వర్తిస్తాయి. మరల మరల మూత్రపిండాల్లో రాళ్ళు చేరే పరిస్థితి నుంచి బయట పడవచ్చు.
కొండపిండి ఆకులకు కొద్దిగా నెయ్యి రాసి వెచ్చజేసి కట్టుకడితే సెగగడ్డలు పగిలిపోతాయి. చరకుడు చరక సంహితలో మూత్రం సాఫీగా ధారాళంగా విసర్జించడానికి పేర్కొన్న మూత్ర విరేచనీయ క్వాధ చూర్ణంలో కూడా దర్భ, వట్టివేర్లు, పల్లేరు వేర్లు మొదలగు వాటితో పాటు కొండపిండి చెట్టును కూడా ఒక అనుఘటకంగా పేర్కొన్నాడు. ఈ మొక్కను తమ అనుభవ వైద్యంలో గిరిజనులు వివిధ వ్యాధుల్లో ఉ పయోగించి సత్ఫలితాలు పొందుతారు. శిశువులకు మూత్రం రంగు తెల్లగా మజ్జిగలాగ, విరిపోయిన పాల లాగ వస్తున్నప్పుడు కొండపిండి కషాయాన్ని తాగిస్తే తప్పకుండా మూత్రం సహజరంగుని సంతరించుకుంటుందని, ఈ కషాయంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగిస్తే పొత్తికడుపు నొప్పి, మూత్ర విసర్జన తగ్గుతాయని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం.
అలానే కొండపిండి సమూలంలో తగినంత వెల్లుల్లి, లవంగాలు కలిపి మెత్తగా నూరి గోరుచుట్టుపై కడితే చాలా త్వరగా మెత్తబడి పగిలిపోతుందని చెబుతారు.
ఆధునిక పరిశోధనలందు కూడా ఈ మొక్కకు మూత్రాశయరాళ్లను కరిగించే గుణమున్నట్లు నిరూపితమైంది.
ఆయుర్వేద వైద్యంలో కొండపిండి, నేరేడు విత్తులు, మామిడి జీడి, బూరుగ బంక మొదలగు ఔషదాలు కలిపి తయారు చేసిన చూర్ణం స్త్రీలకు కలిగే ఎర్రబట్ట, తెల్లబట్ట, ఇతర గర్భాశయ వ్యాధుల్ని నయం చేసేందుకు వివిధ అనుపాన భేదాలతో ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఉపయోగించి పాషాణ భేద్యాదిఘృతం, పుష్యానుగ చూర్ణం మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV