- ఊరి గొడవలు — పోలీసులు – ఓ కాసరకాయల కథ
కాశీపురం ప్రభాకర్ రెడ్డి –
ఇప్పుడంటే కాసర కాయల ఉపయోగం అందరికీ తెలిసింది కాబట్టి, వీటి వాడకం ఎక్కువైంది. ధర కూడా బాగా డిమాండ్ అయిపోయింది. ఒకప్పుడు ఇది చేలల్లో కలుపుమొక్క.
నల్ల రేగడి పొలాల గట్లల్లో యాడజూసినా ఈ మొక్కలే. వీటిని ఏరుకోలేక మేం సతమతం అయ్యే వాళ్ళం.ఇది కేవలం మా రాయలసీమ రైతు ఇళ్లల్లో తప్ప
మార్కెట్ లో ఎక్కడా అమ్మేవారు కాదు. కొనేవాళ్ళు ఉంటే గదా..! మాది కరువు సీమ కాబట్టి మార్కెట్ వెళ్లి కూరగాయలు కొనలేం కాబట్టి, రోజు మార్చి రోజు..
ఈ కాసరకాయల వేపుడే. మేం స్కూల్ నుంచి వచ్చేసరికి పెన్నం మీద జొన్న రొట్టెలు ఈ కాసరకాయ కూర తయారు గా ఉండేవి. ఎప్పుడోసారి వంకాయ పులుసో..
లేదంటే ఉర్లగడ్డ పులుసో చేస్తే మహా భాగ్యం గా తినేవాళ్ళం.కాసరకాయ కూర లో ఉండే గింజలు భలే మధురంగా ఉండేవి.తింటుంటే కరుం కరుం అని పంటికింద శబ్దంవచ్చేది.
దీని వేరు పెద్ద సైజ్ గడ్డ లా భూమిలో అల్లుకొని ఉండేవి.దీంతో ఎద్దులతో ఎంతదున్నినా ఈకలుపు మొక్క పోయేది కాదు.నేను మీ ఆరోగ్యానికి ఉపయోగంరా బాబూఅంటూ..
మళ్ళీ మళ్ళీ మొలకెట్టేది. ట్రాక్టర్లు రావడంతో వ్యవసాయంలో ఆధునికత పెరిగింది. సేద్యం సులువై కూర్చుంది. దీంతో మా ప్రాంతం లో రైతులు దీన్ని దుంప నాశనం చేసేసారు.
ఇప్పుడు ఆరోగ్య రీత్యా, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కు ఇవి మంచివి అని తేలడంతో తినే వాళ్ళు పెరిగిపోయారు.
దీంతో ఇప్పుడు వీటిని కమర్షియల్ గా పండించడం మొదలైంది.
- ఇదంతా పక్కన బెడితే నేను చెప్పాలనుకున్నది ఇది కాదు.
AP నంద్యాల జిల్లా : మా అవుకు మండలం లోని ఒక ఊర్లో పార్టీ తగాదాలు ఉండేవి. రాళ్లు, బాంబులు సబ్జెక్టు పక్కన బెడితే.. ఇరువర్గాల పైనా కేసులు ఉండేవి.
దీంతో ఈ ఊరును highly volatile గ్రామం గానో లేదా సెన్సిటివ్ గ్రామం గానో పోలీస్ లు రికార్డుల కెక్కించే వారు.
అల్లర్లు ఎక్కువ జరక్కుండా పోలీస్ ఔట్ పోస్ట్ పెట్టి ముగ్గురో, నలుగురో కానిస్టేబుల్స్ ను డ్యూటీ లో పెట్టే వారు.
ఇంతవరకు బాగానే ఉంది.ఈపల్లెల్లో వీరికి భోజనం ఎట్లా..?
స్టేషన్ ఎస్సై లేదా సి ఐ గారు ఈ ఊరొచ్చి ఇరువర్గాల వారిని పిలిపించి ఒక వారం ఒక వర్గం, ఇంకోవారం ఇంకో వర్గం భోజనం పెట్టాలని తీర్మానించే వారు.
ఇక తప్పుతుందా..? పార్టీ గొడవలు అన్నాక నిరంతరం పోలీసులతోనే పని.. మగోళ్ళకేం మొహమాటం కొద్దీ సరే నంటారు.
ఎవరు తెచ్చి పెట్టాలి? ఎవరు వండి వార్చాలి? మా పల్లెల్లో ఆడోళ్ళే గదా..! రోజూ ఉర్లగడ్డ, వంకాయ కూర లు యాన్నుంచి వస్తాయ్..? మాకు సులభంగా దొరికేవి, మేం ఇష్టం గా తినేవి ఈ కాసర కాయలే కదా..!
ఈ కాసర కాయ కూర నచ్చడం లేదు
ఆడోళ్ళు అవే వండి పెడుతున్నారు. ఏం పెట్టినా మగోళ్లు స్టేషన్ కు వెళ్ళినప్పుడు పోలీస్ ‘ట్రేట్మెంట్ ‘ లో తేడా ఉండేది కాదు.
మనం ఇంత కష్టపడి పోలీసోళ్లకు బువ్వ వండి పెడుతుంటే మన మగోళ్లను తిట్టడంలో మాత్రం వీళ్ళు తగ్గడం లేదు గదా అని తీవ్రంగా మదన పడ సాగారు.
ఊర్లో గొడవలు దాదాపు సద్దు మణిగినా ముందు జాగ్రత్త కోసం అన్నట్టు, ఈ ఔట్ పోస్ట్ తీసెయ్యడం లేదు.
ఈ లోగా అంగాము కాలం వచ్చింది. అంటే పొలాల్లో విత్తనాలు వేసుకునే కాలం. ఇహ అప్పుడు పనుల ఒత్తిడి మామూలుగా ఉండదు
. ఒక్కోసారి పొలం పనులు ఆలస్యం అయితే, పోలీసోళ్లకు వేళ పొద్దుకు వంట చేసి పంపడం కోసం ఆడోళ్ళు చాలా టెన్షన్ పడే వాళ్ళు.
ఈ సమస్య నుంచి ఎలా గట్టేక్కాలా అని సమయం కోసం ఎదురు చూస్తున్నారు.ఇలా ఉండగా కర్నూల్ నుంచి
వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులకు ఈ కాసర కాయ కూర నచ్చడం లేదు.
వాళ్ళు వెళ్లి బనగానపల్లె సి ఐ కి ఫిర్యాదు చేశారు. ఏమంటే, రోజూ ఎద్దులకు పెట్టే పత్తిగింజల మాదిరి కరుం కరుం అనే కూర ఏదో పెడుతున్నారు.
ఆ ఊర్లో ఎట్లా ఉద్యోగాలు చెయ్యాలి సార్ అని. దీంతో సి ఐ మళ్ళీ ఇరువర్గాలను విడివిడిగా పిలిపించి మాట్లాడాడు. “పోలీసులు అంటే లెక్క లేదా..? కాస్త మంచి కూరలు వండి పెట్టండి” అని గద్దించినట్లు చెప్పాడు.
ఇందుకు వీళ్ళు “సార్..వర్షాధార పొలాలు మావి. ఇక్కడ కూరగాయలు పండవు. మేమేం తింటున్నాము .. మీ వాళ్లకు అదే
పెడుతున్నాం. ” అని సమాధానం ఇచ్చారు. దీంతో చేసేది లేక ఆ సి ఐ తన వాళ్ళకే సర్ది చెప్పేశాడు. ఈ సంఘటన తర్వాత ఆ ఊరి
ఆడోళ్ళకు మరింత పౌరుషం వచ్చింది. వాస్తవానికి ఇరువైపుల ఆడోళ్ళకు కూడా మాటల్లేవ్. అయితే ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారో
తెలియదు గానీ.. ప్రతి రోజూ జొన్న రొట్టె, కాసర కాయ కూర మాత్రమే వండి వారికి పంపించ సాగారు.
ఈ వర్గం వాళ్ళు పెట్టినా కాసర కాయే.. వాళ్ళు పెట్టినా అదే.
నెల రోజుల్లో పరిష్కారం దొరికింది.
ఎట్టకేలకు ఈ కాసర కాయ దెబ్బ తట్టుకోలేక పోలీసులు తమ ఔట్ పోస్టే ఎత్తేసుకున్నారు. ఇదీ ఆ ఊరి కాసరకాయల కథ…
ఆ ఊరేదో మా నియోజకవర్గం మిత్రులకు బాగా తెలుసు… Also Read నల్లమలకు అడవి దున్న
Buy it a good pen drive #కాసరకాయ #kasarakaya #prabhakarreddykasarakayakatha #Kasarakayafry #sannakakarakayarecipe #Rayalaseemaspecial