గ్రామీణ ప్రాంతాలలోని చాలా మందికి కానుగ చెట్టు సుపరిచితమే అయినా దానిలోని ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు. దీని గింజల పప్పు, ఆకులు, పూలు, వేర్లు, కాండం బెరడు వంటి భాగాలలో. మంచి ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులు గుండ్రంగా, పుష్పాలు గుత్తులుగా ఉంటాయి. కాయలు గట్టిగా, ఒకే విత్తనం కలిగి ఉంటాయి. ఆంగ్లంలో ‘ఇండియన్ బీచ్’గా పిలిచే కానుగను శాస్త్రీయంగా పొంగామియా పిన్నేట అంటారు. దీనిలోని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. కానుగ గింజ పప్పును నూరి పావుగ్రాము నుంచి ఒక గ్రాము వరకు తేనెతో కలపి చిన్న పిల్లలకు తినిపిస్తుంటే కోరింతదగ్గు త్వరగా తగ్గుతుంది. కానుగ గింజల పప్పు, పటిక సమంగా కలిపి నూరి తేలుకుట్టన చోట పట్టిస్తే త్వరగా నొప్పి తగ్గుతుంది.
కానుగ లేత ఆకులను కొద్దిగా ఆముదం కలిపి వెచ్చజేసి, నూరి మూలవ్యాధి పిలకలపై పెట్టి కట్టు కట్టాలి. దీనితోపాటు కానుగ పప్పుచూర్ణం, పటిక బెల్లం పొడి సమానంగా కలిపి వుంచుకుని రోజూ ఉదయం పావు స్పూను పొడిని అరగ్లాసు నీటిలో కలిపి తీసుకుంటున్నను లేదా పూటకు మూడుగ్రాముల లేత చిగుళ్ళను నూరిన ముద్దను కప్పు మజ్జిగ అనుపానంతో రెండు పూటలా తీసుకుంటున్నను మూలవ్యాధులు త్వరగా తగ్గుతాయి. కానుగ పప్పు నీటితో నూరి తలకు రుద్దుకుంటూ ఉంటే తలలో పేలు, కురుపులు, మురికి పోతాయి. కానుగ గింజలు నూరి చింతపండు కలిపి గుజ్జు మాదిరిచేసి ఒంటికి పట్టించుకొని కొద్దిసేపు ఆగి స్నానం చేస్తే ఒంటి దుర్గధం పోతుంది. కానుగ పప్పు, వేపచెక్క, వావిలాలాకులను సమపాళ్ళలో తీసికొని నీటితో నూరి పట్టిస్తుంటే అనేక రకాల దీర్ఘకాల వ్రణాలు, చీము, దుర్గంధంతో కూడిన పుండ్లు మానుతాయి.
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
కానుగ, ఆముదం, గచ్చకాయ పప్పులను సమపాళ్ళలో తీసుకొని ఆముదంతో నూరి బీజాలపై పట్టువేస్తుంటే బీజాల వాపు, నొప్పి, పోటు తగ్గుతాయి. పచారి కొట్లలో దొరికే కానుగనూనెలో నిమ్మరసం కలిపి పట్టిస్తుంటే పొలుసులు రాలే చర్మవ్యాధి, గజ్జి, సర్పి, కురుపులు, సిబ్బెం, తామర, చిముడు * వంటి అనేక రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి. కానుగ ఆకుల్ని వేసి కాచిన నీటితో స్నానం చేస్తుంటే కీళ్లనొప్పులు, వాపులు వంటి నొప్పులకు మంచి ఉపశమనం కల్గుతుంది. కానుగ, చిత్రమూలం ఆకులను ఒక్కొక్కటి మూడు గ్రాములు, మిరియాల పొడి, ఉప్పు ఒక్కొక్కటి మూడు నాలుగు చిటికెల వంతున కలిపి మెత్తగా నూరి పది గ్రాముల చొప్పున పెరుగుతో కలిపి కొన్నాళ్ళు తింటే కుష్ఠువ్యాధికి బాగా పనిచేస్తుంది.
ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ.. కానుక
అయితే ఈ ఔషధాన్ని ప్రతిరోజూ తయారుచేసుకొని వాడాలి. బాగా ఎండిన కానుగపూలను పొడిచేసి వుంచుకుని ఉదయం, సాయంత్రం అరచెంచా పొడిని అరగ్లాసు నీటిలో కలిపి త్రాగుచుంటే అతిమూత్ర వ్యాధి అనే మూత్రం ఎక్కువసార్లు వచ్చే సమస్య తగ్గుతుంది. కానుగ వేరు లేదా కాండం బెరడుకు పదింతలు ఆవ నూనె లేదా ఆముదం కలిపి కాచి వడగట్టి రోజూ రెండుసార్లు చచ్చుపడిన అవయవాలకు మర్దన చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎండించిన వేరు లేదా కాండం బెరడును కాల్చి బూడిద చేయాలి. ఉదయం, సాయంత్రం పూటకు పావు నుంచి అరస్పూను ఈ బూడిదకు కొద్దిగా అల్లంరసం లేదా తమలపాకురసం లేదా తేనె కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. నల్ల ఉప్పుపొడికి మూడింతల కానుగ పప్పు పొడి కలిపి వుంచుకుని రోజూ ఒకట్రెండు సార్లు పావు స్పూను నుంచి అరస్పూను పొడివరకు అరగ్లాసు నీటిలో కలిపి సేవిస్తుంటే ప్రేవుల్లోని, ఉదరంలోని క్రిములు పడిపోతాయి. జాత్యాధిఘృతం, బిల్వాదిగుటిక, కరంజాది ఘృతం వంటి ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ కానుక ఉపయోగిస్తారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..