ప్రమాదపు అంచుల్లో జర్నలిస్టులు.
అక్షర సైనికులపై అమానుష దాడులు.
దారి తప్పిన జర్నలిజం- దాడులకు గురవుతున్న జర్నలిస్టులు.
రాయలసీమలోని రాప్తాడు నియోజకవర్గం “సిద్ధం”సభ లో ఆంధ్రజ్యోతి ప్రెస్ ఫోటో గ్రాఫర్ గా చెప్పబడుతున్న కృష్ణ అనే ఫోటో జర్నలిస్ట్ పై జరిగిన దాడి అమాన వీయ చర్యగా జర్నలిస్టులు అందరూ ఖండించాల్సిన విషయం.ఏవైతే మీడియా యాజమాన్యాలు ఉన్నాయో అవి వారికి ఎలా వార్తలు కావాలో… అలా రాయించుకోవడం, ఎటువంటి ఫోటోలు, వీడియో విజువల్స్ కావాలో అలా తీసుకురమ్మని వాటిని ప్రచురణ/ప్రసారం చేసుకోవడం విలువలు విడిచిన నేటి మీడియా విధానంగా మారింది. ఒకప్పుడు విలువలతో పనిచేసిన మీడియా వేరు.ఇప్పుడు మీడియా సిగ్గు లేకుండా రాజకీయ రంగు పులుముకుని ప్రజలకు నిజాలు చెప్పడం మాని ఎంత విషం కక్క గలిగితే అంత కక్కుతూ గొప్పలా మారాయి కొన్ని పత్రికలు/చానల్స్.
ఈ మీడియా పోకడకు, ఇగోలకు,దౌర్జన్యంగా రాసే రాతలకు పాఠకులు/వీక్షకులు కూడా వారు అభిమానించే మీడియా ఏది రాస్తే అదే నిజం అని వర్గాలుగా విడిపోతున్నారు
చాలామంది విద్యార్థులు, సమాజ సేవకులు, రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత మీడియా విధానాలపై ఒకింత గుర్రుగానే ఉన్నారు.ఏ మీడియా ఏది చెప్పినా/రాసినా నమ్మే పరిస్థితిలో లేరు కొందరు ఆలోచనా పరులు.ఇక నేటి మీడియా వాస్తవాలు మరిచింది. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోంది.ప్రస్తుతం అనంతపురంలో ఇదే జరిగింది.మీడియా విష ప్రయోగానికి సగటు జీవులుగా బ్రతికే సామాన్య ఫోటో జర్నలిస్ట్ అచ్చు వేసిన రాజకీయ ఆంబోతుల దాడికి గురి కావడం జరిగింది. ఆడిగేవాడు ఎవడు అడ్డు చెప్పేవారు ఎవరు…?మొత్తానికి మీడియా సంస్థల విషపు ప్రచారానికి కావాల్సిన కొద్దిపాటి సమాచారం దొరికితే చాలు దాన్ని చక్కగా వండి మీడియా పేరిట వడ్డించే వారు ఉన్నారు.ఏ పాపం తెలియని క్రిందిస్థాయి జర్నలిస్టులు,ఫోటో-వీడియో జర్నలిస్టులపై జరిగే దాడులు కొత్తేమి కాదు.
జర్నలిస్ట్ సంఘాలు మేల్కోవాలి…నిద్ర నటిస్తే సరికాదు…!!
జర్నలిస్ట్ సంఘాలు ఎన్నో ఉన్నాయి.ఉండటం వల్ల ఏ జర్నలిస్టులకు ఉపయోగం లేదు.ఈ జర్నలిస్ట్ అసోసియేషన్స్, సంఘాలు ఏదో ఉన్నాం అనే పేరుకు జర్నలిస్టులపై జరిగే దాడులను ఖండిస్తున్నాం అని బాధితుల వద్దకు వెళ్ళి ఫోటోలు దిగి ప్రచురణ చేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ తరువాత ఉండదు. మరో చోద్యం ఏమంటే దాడులకు/ప్రమాదాలకు గురయ్యే జర్నలిస్టులకు వారు పనిచేసే మీడియా సంస్థల నుండి కనీస పరామర్శ కూడా ఉండదు. బాధ్యత వహించని ఈ విధమైన మీడియా సంస్థల పై జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు మన హక్కుల కోసం పోరాడవు.మీడియా సంస్థలు ఇలా ప్రమాదపు అంచుల్లో ఉన్న జర్నలిస్టుల కు అండగా నిలవాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. జర్నలిస్టులు,జర్నలిస్టు సంఘాలు ఏవైనా సరే తిని తొంగోవడం,దోచుకుందాం-దాచుకుందాం,అవకాశాలను చేజిక్కించుకుందాం అనే నిగూఢమైన ఆలోచన లో ఉంటే రేపు జర్నలిస్టుల సంఘాల పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటాయి.ఇప్పటికే కొన్ని జర్నలిస్ట్ సంఘాల మీద పూర్తిగా నమ్మకం కోల్పోయారు మన మీడియా మిత్రులు.
దాడికి గురైన ఫొటో జర్నలిస్ట్ కృష్ణ కు అండగా నిలవండి…
రాజకీయ చట్రంలో ఇరుక్కున్న జర్నలిజం, జర్నలిస్టుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఎవరో పెట్టుబడు దారులు, రాజకీయ నాయకులు పవిత్రమైన జర్నలిజాన్ని వాళ్ళ బూటు కాళ్ళవద్దకు చేర్చుకుని కాలాపాని వంటి జైళ్లలో బంధించి మీ హోదాలకు,గొప్పలకు, ఉత్తుత్తి-ఊక దంపుడు ఉపాన్యాసాలకు అడుగుల కు మాడుగుల ఒత్తేవారు కాదు జర్నలిస్టులు అంటే.. వారికి కుటుంబాలు ఉన్నాయి.బిడ్డల భవిష్యత్ తీర్చి దిద్దాల్సిన భాద్యత లు ఉన్నాయి.అసలు మీ స్వార్ధాలకు-మీ పార్టీల గొప్పలకు మా జర్నలిస్టులు ఎందుకు బలికావాలి...?అందుకే అడుగుతున్నాం ఫోటో జర్నలిస్ట్ కృష్ణ పై దాడికి దిగిన ప్రతి ఒక్కడిని పోలీసులు అరెస్ట్ చేయాలి. ఈ దాడి ఘటన సిద్ధం సభలో జరిగినట్లు తెలుస్తోంది కాబట్టి ఆ సభ నిర్వాహకులు-అక్కడి సభకు సెక్యూరిటీ విధులు నిర్వహించిన పోలీసు అధికారులు దాడి చేసిన వ్యక్తులపై హత్యా నేరంగా పరిగణలోకి తీసుకోవాలి. కృష్ణ ఏ మీడియా ఫోటో జర్నలిస్ట్ గా చెప్పబడుతు న్నాడో చూసి ఆ మీడియా కూడా భాధితునికి అండగా నిలుస్తూ...పోలీసు కేసులు, కోర్టులు,ఉచిత వైద్యం, కుటుంబ పోషణ, సెక్యూరి టీ ఇలా అతను పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతుడి గా తనపని తాను చేసుకునే వరకు ప్రభుత్వం గానీ,తాను పనిచేసే మీడియా గానీ హామీ ఇచ్చే వరకు తోటి జర్నలిస్ట్ సోదరుడికి అండగా నిలిచే ప్రయత్నం మనం-మన జర్నలిస్ట్ సంఘాలు చేయా లని కోరుకుంటున్నాను.
ప్రశ్నించడం మనహక్కు-సరైన సమాధానం రాబట్టుకోవడం మన అసంఖ్యాక జర్నలిస్టుల విధానం.
ఈపూరి రాజారత్నం
MA(Ph.D)
Journalism
సీనియర్ జర్నలిస్ట్
9390062078