కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ లోనూ ప్రారంభవాక్యాలు వ్యవసాయాభివృద్ధి గురించి, రైతు సంక్షేమం గురించి తామెంతో చేస్తున్నట్లు చెప్పుకుంటుంటాయి. ముఖ్యంగా ఎరువుల సబ్సిడీకి కేంద్రం
ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. సకాలంలో చెల్లించే రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తున్నది. కొన్ని నీటి పారుదల, వ్యవసాయాభివృద్ధి పథకాలకు పాక్షిక మద్దతునందిస్తుంది. ఎన్ని చేసినా కేంద్ర బడ్జెట్ లో 3 శాతానికి లోబడే ఖర్చు చేస్తుంది. ఈ సంవత్సరం వ్యవసాయరంగానికి 1.52 లక్షల కోట్లు ప్రతిపాదించింది. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణా బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 72 వేల కోట్లు కేటాయించింది. వ్యవసాయాభివృద్ధిని సమన్వయపరిచే బాధ్యత కేంద్రానిదైనా నిర్వహణ భాధ్యత రాష్ట్రాలదే. నీటి పారుదల ఖర్చుల పై సబ్సిడీ, ఉచిత విద్యుత్స బ్సిడీలను రాష్ట్రాలే భరిస్తాయి. కేంద్రం కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తున్నా సేకరణలో కీలక బాధ్యత రాష్ట్రాలదే. కేంద్ర, రాష్ట్రాలన్నీ కలిపి అందించే బడ్జెట్, మార్కెట్ మద్దతుల కన్నా ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు కలిగే నష్టాలు ఎంతో ఎక్కువని జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు తెలుపుతున్నాయి.
పెరుగుతున్న ఖర్చుల వల్ల రైతుల నికరాదాయాలు తగిపో తగ్గిపోతున్నాయి. రైతుల రుణగ్రస్తత పెరుగుతున్నది. రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు రుణమాఫీ చేసింది. 1990లో ఒకసారి, 2008లో మరోసారి సంస్థాగత రుణాలను కొంతవరకు మాఫీ చేసింది. చాలామంది రైతులు ఇప్పటికీ వడ్డీ వ్యాపారస్తుల నుండి ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. రుణమాఫీల వల్ల సక్రమంగా రుణాలు తిరిగి చెల్లించిన రైతులు నష్టపోతున్నారనీ, తిరిగి చెల్లించే సంస్కృతి కనుమరుగవుతున్నదనే ఆందోళన మొదలైంది. దానికి మారుగా పెట్టబడి సాయాన్నందించాలనే ఆలోచన మొదలైంది. ఐనా రుణమాఫీ వాగ్దానాలు రైతుల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో రైతు రుణగ్రస్తత గ్రసత దేశం మొత్తంలోనే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో గెలిచిన పార్టీలు రుణమాఫీని అమలు చేసాయి. ఆంధ్రప్రదేశ్లో లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
రైతు రుణమాఫీ
తెలంగాణాలో లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తామని నిర్ణయాన్ని వెల్లడించింది. కానీ నిధుల కొరత కారణంగా దశల వారీగా రుణమాఫీ జరిగింది. 2018 ఎన్నికల్లో తెలంగాణాలో నెగ్గిన బి.ఆర్.ఎస్. ప్రభుత్వం మళ్ళీ లక్ష రూపాయల లోపు రుణాల్ని మాఫీ చేస్తామని ప్రకటించింది. కాని ఆ కార్యక్రమాన్ని తమ పాలనలోని ఆఖరి సంవత్సరంలో చేపట్టింది. పదవీ కాలం ముగిసేలోగా పూర్తి కాలేదు.2023 ఎన్నికల్లో రెండు లక్షల రుణమాఫీ హామీతో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చింది. పెట్టుబడి సాయానికి తెలంగాణా ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకాన్ని తెచ్చింది. సంవత్సరానికి ఎకరానికి ఎనిమిదివేల రూపాయలతో మొదలు పెట్టి, తర్వాత పదివేల రూపాయలకు పెంచింది. 2023 ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సాయాన్ని ఎకరానికి 15 వేల రూపాయలకి పెంచుతామని హామీ ఇచ్చింది. రైతులతోపాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12 వేలు ఇస్తామని ప్రకటించింది. తెలంగాణాలో ప్రారంభించిన ‘రైతు బంధు’ పథకం దేశంలోని చాలామంది పాలకులకు ప్రేరణగా నిలిచింది. కేంద్రంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం పి.ఎమ్. కిసాన్ పథకాన్ని తెచ్చి ప్రతి రైతుకీ సంవత్సరానికి రూ. 6 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఆ ఆరువేల రూపాయలకు మరో ఏడు వేల ఐదువందలు కలిపి రూ.13,500 రైతులకు సంవత్సరానికి చెల్లించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం దానిని రూ. 20 వేల రూపాయలకు పెంచుతామన్నారు. కౌలుదార్లకీ, వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొండంత హామీలిచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటి అమలుకి ఆపసోపాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాలోకి నిధులు మెల్లమెల్లగా చేరతాయి. కాని వాగ్దానాల అమలుకి ఆ వేగం చాలదు. అందిన వరకు అప్పులు చేసినా హామీల అమలు సాధ్యం కాదు. అప్పులు కూడా చాలక ఏవో ఆంక్షలు, నిబంధనలు పెట్టి తమ భారాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తాయి. ప్రతిపక్షాలు ఆ చర్యలను దుయ్యబడతాయి. ఐదేళ్ల పదవీకాలంలో ఎన్ని హామీలను ఏ మేరకు అమలు చేస్తాయో తెలుగు రాష్ట్రాల రైతులు వేచి చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో కనీస మద్దతు ధరలపై కమిటీని వేసింది.
తాజాగా సుప్రీంకోర్టు రైతు సమస్యల పరిష్కారానికి మరో కమిటీని వేస్తామని ప్రకటించింది. ఈ కమిటీలు రైతులకు విధానాల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎంతమేరకు పూడ్చే పరిష్కారాలు చూపుతాయో వేచి చూడాలి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రుణమాఫీ, పెట్టుబడి సాయం, వరికి బోనస్ వంటి హామీలను అమలు చేసి, రైతులను ఎంత మేరకు ఆదుకుంటాయో చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు నష్టాలను, కష్టాలను తీరుస్తాయని ఆశిద్దాము.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్ & కన్సల్టెంట్ ఇక్రిసాట్), ఫోన్: 83098 59517, 70328 11608
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV