కరీంనగర్ లో..సోదరుడి హత్య-ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘోరం

Brother's murder in Karimnagar - a heinous crime for insurance money

Brother's murder in Karimnagar - a heinous crime for insurance money

  • కరీంనగర్:02-12-2025.
    సోదరుడి హత్య: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘోరం!
  • రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు యత్నం – ముగ్గురు నిందితుల అరెస్ట్
  • కరీంనగర్ పోలీసు కమీషనర్ – గౌష్ ఆలం.

ఆర్థిక ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి, ఏకంగా తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని పన్నిన కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో, ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

రూ. 1.50 కోట్ల అప్పులు, రూ. 4.14 కోట్ల ఇన్సూరెన్స్

రామడుగు గ్రామానికి చెందిన మామిడి నరేష్ (30) వ్యాపారాల్లో, ముఖ్యంగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి సుమారు రూ. 25 లక్షలు నష్టపోయాడు. టిప్పర్ వాహనాల EMIలు సహా మొత్తంగా రూ. 1.50 కోట్ల అప్పుల్లో చిక్కుకున్నాడు. ఈ అప్పుల నుంచి బయటపడేందుకు నరేష్ దుర్మార్గమైన ప్లాన్ చేశాడు.

నరేష్ తన అన్న, మానసిక పరిపక్వత లేని మామిడి వెంకటేష్ (37) పేరుపై ఏకంగా రూ. 4 కోట్ల 14 లక్షల విలువైన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. ఇందులో ఐసీఐసీఐ, ఆదిత్య బిర్లా, టాటా ఏఐజీ, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వంటి సంస్థల నుంచి ఒక్కొక్కటి కోటికి పైగా విలువైన పాలసీలు ఉన్నాయి. దీంతో పాటు, అన్న పేరుపై రూ. 20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడు. వెంకటేష్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, లోన్ మాఫీ అవుతుంది అనే దురుద్దేశంతో ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.

ప్లాన్ అమలు – టిప్పర్‌తో హత్య

ఈ కుట్రలో తన స్నేహితుడు నముండ్ల రాకేశ్ (సహాయం చేసిన వ్యక్తి), టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్‌ను భాగం చేశాడు. ఈ ప్లాన్‌కు సంబంధించిన చర్చల వీడియోను రాకేశ్ తన ఫోన్‌లో భద్రపరిచాడు.

తేదీ 29-11-2025 రాత్రి, ప్లాన్ ప్రకారం…
డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ (TS-02-UD-6261)ను మట్టి లోడ్‌తో రామడుగు శివారులోని భారత్ పెట్రోల్ పంప్ వద్దకు తీసుకొచ్చాడు.
ముందుగా అనుకున్నట్లుగా, బ్రేక్ డౌన్ అయినట్లు నటించి, నరేష్‌కు ఫోన్ చేశాడు. నరేష్ తన అల్లుడు సాయి ద్వారా వెంకటేష్‌ను జాకీ ఇచ్చి టిప్పర్ వద్దకు “జాకీ పెట్టాలి” అనే సాకుతో పంపాడు. నరేష్ అక్కడికి చేరుకున్నాక, టిప్పర్ స్టార్ట్ చేసి ఉంచి, జాకీని టైర్ కింద పెట్టి తిప్పమని తన అన్న వెంకటేష్‌కు చెప్పాడు. వెంకటేష్ సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని జాకీ తిప్పుతుండగా, నరేష్ స్వయంగా టిప్పర్‌ను నడిపి, జాకీ తిప్పుతున్న అన్న వెంకటేష్ పైకి ఎక్కించాడు. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు.
డ్రైవర్ ప్రదీప్‌ను పారిపోవాలని చెప్పి, నరేష్ దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

అల్లుడి సాక్ష్యంతో ఛేదన

వెంకటేష్ మృతిపై నరేష్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని చెప్పగా, నరేష్ అల్లుడు సాయి… టిప్పర్‌ను నడిపింది నరేషే అని తన తండ్రి మామిడి నర్సయ్యకు చెప్పాడు. దీంతో నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు. మృతదేహ పంచనామా, స్థల పరిశీలన, సాక్ష్యాల సేకరణ అనంతరం, ప్రమాద ఘటనపై అనుమానాలు కలగడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ రోజు (02-12-2025) ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు.

నిందితుల నుంచి హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంకు పాస్ బుక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏ.సి.పి శ్రీ విజయ కుమార్ గారి ఆద్వర్యంలో, ఇన్స్ పెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్, ఎస్.ఐ. శ్రీ రాజు మరియు సిబ్బంది ఈ కేసును ఛేదించడంలో కృషి చేశారు. వీరిని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు. నిందితులపై సంబంధిత సెక్షన్లలో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top