- సైకిల్ ఎక్కిన వైసిపి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, అయన సోదరుడు గ్రామ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిలతో పాటు వారి అనుచరులు దాదాపు 500 మందికి పైగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులు ఎత్తేసిందన్నారు. దీంతో ప్రజలు వైసిపికి 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుందన్నారు.
గ్రామాల అభివృద్ధి, సాగునీరు తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. పార్టీలో చేరిన వారు అందరూ కలిసిమెలిసి పార్టీలో పని చేయాలని సూచించారు. పార్లపల్లి, గువ్వల దొడ్డి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం జెండా ఎగురవేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడిమెట్ల వీరుపాక్షి రెడ్డి. రాఘవేంద్రరెడ్డి. గువ్వలదొడ్డి సుజాత, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.