ఆరుగురి హత్యకేసులో దోషికి మరణశిక్ష – 2021 ఏప్రిల్ 15న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపిన అప్పలరాజు
విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజుకు మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నిందితుడు దారుణంగా హతమార్చాడు. జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. దొరికిన వారిని దొరికినట్టు నరికిశాడు.
అప్పలరాజు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లూరి రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), బొమ్మిడి ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు) ఘటనా స్థలంలోనే అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం అప్పలరాజును ఈ కేసులో దోషిగా నిర్ధారించి మరణశిక్షతో పాటు రూ.10,000ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.
కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధిత కుటుంబసభ్యులు హర్షం
మా కుటుంబంలో ఆరుగురిని బత్తిన అప్పలరాజు దారుణంగా చంపాడు. నాలుగు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాం. ఇవాళ మాకు న్యాయం జరిగింది. నిందితుడికి తర్వగా మరణశిక్ష విధించాలని కోరుతున్నాం. మా బాధ పగవారికి కూడా రాకూడదు. – బాధిత కుటుంబ సభ్యులు
అసలేం జరిగిదంటే : జుత్తాడకు చెందిన బొమ్మిడి విజయ్ కిరణ్ భార్య, ముగ్గురు పిల్లలతో విజయవాడలో నివసిస్తున్నాడు. తన కుమార్తెపై విజయ్ అత్యాచారం చేశాడని నిందితుడు బత్తిన అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో 2018లో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచీ ఇరు కుటుంబాల మధ్య కేసులు, గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విజయ్ విజయవాడలోని అత్తారింటికి మకాం మార్చాడు. మేనత్త కుటుంబం కూడా అతనితోనే కలిసి ఉంటోంది.
ఉమ్మడిగా నివసించే విజయ్ కుటుంబం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు జుత్తాడకు వచ్చారు. విహహ కార్యక్రమం ఉన్నందున షాపింగ్ చేసి విజయవాడ వెళ్లాలని భావించారు. తన కుమార్తె జీవితం నాశనం చేసిన విజయ్ ఒక్కడినే చంపేస్తే క్షణంలో తేలిపోతుందని కుటుంబాన్నే హతమారిస్తే అతడు జీవితాంతం కుమిలి, కృశించి పోతాడని అప్పలరాజు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో నిందితుడు ఇంట్లోకి చొరబడి వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విజయ్ కుటుంబ సభ్యులు ఆరుగురు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో విజయ్ పెద్ద కుమారుడు అఖిల్ బంధువుల ఇంట్లో నిద్రపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.