2024 నైరుతి ఋతుపవనాల కాలం ముగిసింది. ఈ వర్షాకాలం దేశం మొత్తం మీద ఆశాజనకం ఉన్నట్లే. సాధారణ స్థాయి 868.6 మిల్లీ మీటర్లు కాగా 8 శాతం అధికంగా 934.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. విచిత్రం ఏమిటంటే తూర్పు, ఈశాన్య భారతంలో వరదలు వచ్చాయి. వాటితో అపార నష్టం జరిగింది. అయితే సగటు వర్షపాతం సగటు కంటే 14 శాతం తక్కువగా ఈ ఏడాది ఈ ప్రాంతంలో నమోదు కావటం విశేషంగా చెప్పవచ్చు. మరో వైపు మధ్య భారతంలో 19 శాతం మేర అధికంగా వర్షాలు కురిశాయి.
వాయువ్య భారతంలో కూడా ఈ సీజన్లో 7 శాతం, దక్షిణ భారతదేశంలో ఈ సీజన్లో 14 శాతం మేర అధికంగా వర్షపాతం నమోదయింది. ఉదాహరణకు రాజస్థాన్లో 56 శాతం, గుజరాత్లో 48 శాతం, గోవాలో 46 శాతం, మహారాష్ట్రలో 26 శాతం, మధ్యప్రదేశ్, తమిళనాడులో 18 శాతం, తెలంగాణలో 29 శాతం, ఆంధ్రప్రదేశ్లో 27 శాతం మేర అధికంగా వర్షపాతం కురిసింది. 2020 తరువాత 2024 ఖరీఫ్ లోనే నైరుతి రైతుల మీద దయ చూపింది. కొంత ఆశను రేపింది. దీనితో రైతుల్లో ఉత్సాహం పెరిగింది.
ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగానే వివిధ పంటలలో దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. అధిక వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో మినుము పంట దెబ్బ తినటం జరిగింది. దిగుబడి నాణ్యత కూడా తగ్గటం వల్ల మార్కెట్లో ధర తక్కువగా ఉండటం రైతులకు ఆందోళన కలిగించే అంశం. ఒక క్వింటల్ మద్దతు ధర రూ.7400గా ఉంటే మార్కెట్ ధర మాత్రం రూ. 6,870గా ఉంది. దేశంలోని వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల్లో మినుముకు లభిస్తున్న మార్కెట్ ధర 4,150 నుంచి రూ.6600గా ఉంది. ధరలు తక్కువగా ఉండటంకు కారణం ఎక్కువ ఉత్పత్తి కాదు. కేవలం నాణ్యత మాత్రమేనని వాణిజ్య వర్గాలు అంటున్నాయి.
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
ఇదే పరిస్థితి మరికొన్ని ప్రాంతాల్లో, పంటల మీద కూడా కనిపించే అవకాశం ఉంది. అవసరం అయితే ప్రభుత్వాలు తప్పనిసరిగా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు తిరోగమనంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఈ నెల రెండో వారం వరకు కూడా అడపాదడపా పడే అవకాశం ఉంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కూడా ఆశాజనకమైన రీతిలోనే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ మధ్యలో లానినో ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్లో కూడా వర్షాలు బాగానే కురవటంతో రబీ పంటలు బాగా విత్తటం జరిగింది. మొత్తంగా రబీ సీజన్ కూడా రైతుకు భరోసా ఇచ్చే అవకాశం మెండుగా ఉంది.
వాతావరణ మార్పులతో వస్తున్న భూతాపం
ఋతుపవనాలు బాగున్నా, వర్షపాతం పంపిణీ సక్రమంగా లేక రైతులు నష్టపోతున్నారు. వాతావరణ మార్పులతో వస్తున్న భూతాపం ప్రతికూల ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతుంది. 2024 ‘ఫార్మర్స్ వాయిస్ సర్వే’ నివేదిక దీనికి అద్దంపడుతోంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, కెన్యా, అమెరికా, ఉక్రెయిన్ దేశాల రైతుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రతి పదిమంది రైతులలో ఆరుగురు ఇప్పటికే వాతావరణ మార్పులతో ఆర్థికంగా నష్టపోయారు.
వీరు సాధారణ రైతులు కాదు. కొత్త పద్ధతులు ఆచరిస్తూ, లాభసాటి వ్యసాయం కోసం శ్రమిస్తున్న వారే. వాతావరణం అనుకూలంగా లేక చీడపీడల తీవ్రతతో జరుగుతున్న నష్టాలను అధిగమించటానికి అన్ని ప్రాంతాలలో శ్రమిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందుల ధరలు కూడా రైతును అతలాకుతలం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. రాబోయే రోజుల్లో పర్యావరణ సమస్యలు మరింత పెరిగే వీలుందని, అదే రీతిలో వ్యవసాయ ఉత్పాదకాల ధరలు కూడా అధికమయ్యే అవకాశముందని నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ మానవాళికి సరిపడినంత ఆహారం అందించే ప్రయత్నంలో రైతులు ఈ భాధలు భరిస్తూ ముందుకు సాగాల్సిందేనని హెచ్చరించింది కూడా. ఏతా వాతా రైతుకు ఋతుపవనాలు వెసులుబాటు ఇచ్చినా, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగితేనే ప్రయోజనం.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
—- వేంకటేశ్వరరావు