YSRCP Manifesto for AP Elections 2024 : త్వరలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుంది. ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోలపై దృష్టి పెట్టాయి. ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ..
తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. మరో వారం రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రచారంతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ పెట్టారు జగన్. 2019 ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో వైసీపీ అధినేత జనగ్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారు. 26 అంశాలతో మేనిఫెస్టోను తీర్చిదిద్దింది.. కేవలం నాలుగు పేజీల్లో కుదించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే నాటి మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలే వైసీపీని విజయతీరాలకు చేర్చాయి. ఆ పథకాలు ఆకట్టుకోవడంతో.. జనాలను వైసీసీకే పట్టం కట్టారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేసేందుకు వందకు వంద శాతం కృషి చేశామని.. ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలు అమలు చేశామని చెబుతున్నారు జగన్.
ఇప్పుడు ఎన్నికల ముంగిట మరోసారి జనాలను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు మరికొన్ని హామీలతో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న జగన్.. ఈ సారి నవరత్నాలకు మించిన హామీలతో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మేనిఫెస్టోపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పెన్షన్ 3 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఇచ్చిన మాట ప్రకారం హామీ అమలు చేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే పెన్షన్‌ను 4 వేలకు పెంచుతామని హామీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఏపీలో పెన్షన్ పొందేవారి సంఖ్య లక్షల్లో ఉంది. ఈ హామీ ద్వారా వారంతా తమకు వైపు మళ్లుతారని భావిస్తున్నారు జగన్. మరో వైపు ఏపీలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరినీ ఆకట్టుకునేలా రైతులకు కీలక హామీ ఇవ్వబోతున్నారని.. రుణ మాఫీ చేస్తామనే హామీలతో ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మహిళా సంక్షేమానికి మరింత కృషి చేస్తామని.. డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాలు తీసుకొస్తామని మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు జగన్ ప్రత్యేక హామీలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు వైసీపీ నేతలు.
ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న వైసీపీకి.. ప్రస్తుతం కసరత్తు చేస్తున్న మేనిఫెస్టో బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందంటున్నారు వైసీపీ పెద్దలు. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. భీమిలిలో తొలి ఎన్నికల శంఖారావ సభను నిర్వహించిన అధికార పార్టీ.. రాష్ట్ర వ్యాప్తంగా సభలకు సిద్ధమవుతోంది. మరి వైసీపీ మేనిఫెస్టో జనాల్లోకి ఎంతు వరకు వెళ్తుంది.. మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు ఎంత వరకు ప్రజలను ఆకట్టుకోగవు.. బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న ఈ మేనిఫెస్టో.. రెండోసారి వైసీపీకి జనం పట్టం కడుతారా.. లేదా అనేది వేచి చూడాలి.