కొలనుభారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు

VasantPanchami celebrations Kolanubharathi Kshetram

VasantPanchami celebrations Kolanubharathi Kshetram

చదువుల తల్లి నిలయమైన కొలనుభారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగాజరుగుతున్నాయి. సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలు బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాత సేవతో తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. సరస్వతి దేవి అమ్మవారికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టిడిపి నాయకులు మాండ్ర శివానందరెడ్డి శ్రీశైల దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

నంద్యాలజిల్లా,కొత్తపల్లి మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో స్వయం భూగావెలసిన ఆధ్యాత్మిక నిలయం, జ్ఞాన వైభవం, శ్రీ కొలను భారతీ క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ మైన శ్రీశైల మహా క్షేత్రంలో విలీనమైన మొదటి ఏడాదిలో చదువులతల్లి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి దేవి జన్మదిన వేడుకలు కనులపండుగగా జరుగుతున్నాయి.

దక్షిణభారతదేశంలోని అతికొద్ది సరస్వతీ ఆలయాలలో కొలను భారతి క్షేత్రం ప్రసిద్ధి గాంచినది. ఆంధ్రప్రదేశ్ లో ఏకైక సరస్వతి ఆలయంతో పాటు సప్తశివాలయాలు ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత” వసంత పంచమి కావడంతో తమ చిన్నారులకు బీజక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తల్లిదండ్రులు కొలను భారతి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శాలల్లో వేలాది మంది చిన్నారులు ఓంకార నాదంతో అక్షర లోకంలోకి అడుగుపెట్టారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే తమ పిల్లలు విద్యాబుద్ధుల్లో రాణిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం.
​నల్లమల అటవీ అంచ్చుల్లో ప్రకృతి ఒడిలో వెలసిన కొలను భారతీ క్షేత్రం (విశ్వభారతి) ఆధ్యాత్మికతకు, అక్షర జ్ఞానానికి నిలయంగా భాసిల్లుతోంది. నిత్యం వేద మంత్రాలతో, భక్తుల సందడితో ఈ క్షేత్రం పరిడ విల్లుతుంది. జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి ఇక్కడ భారతీ మాతగా కొలువుదీరి భక్తుల కోర్కెలను తీరుస్తోంది. విద్యార్థులు తమ విద్యాభ్యాసం సజావుగా సాగాలని ప్రార్థిస్తూ…. అక్షరాభ్యాసం కోసం వేలది సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు.

​ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ఈ క్షేత్రం పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. నల్లమల అందాలను వీక్షిస్తూ భారతీ మాతను దర్శించుకోవడం భక్తులకు ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి సౌకర్యాలను, రవాణా మార్గాలను ప్రభుత్వం మరిన్ని మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు.
కొలను ​భారతీ క్షేత్రంలో నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమం ఎంతో మంది ఆకలిని తీరుస్తోంది. పండుగ దినాల్లో, ముఖ్యంగా వసంత పంచమి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top