భారత్‌లో తగ్గనున్న గ్యాస్ కష్టాలు… ఖతార్ నుంచి భారీగా ఎల్పీజీ సరఫరా
హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్ ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’ నౌక – మరో ఎల్పీజీ ట్యాంకర్ ‘నందాదేవి’ కాండ్లా పోర్టుకు రేపు చేరిక
దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఖతార్ నుంచి భారీ పరిమాణంలో ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకొస్తున్న ట్యాంకర్ నౌకలు భారత తీరానికి చేరుకుంటున్నాయ
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక ‘శివాలిక్’ ఖతార్‌లోని రాస్ లఫాన్ ఓడరేవు నుంచి బయలుదేరి ఇరాన్‌కు సమీపంలోని హర్మూజ్ జలసంధిని దాటి గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో రాస్ లఫాన్ పోర్టు నుంచి బయలుదేరిన మరో ఎల్పీజీ ట్యాంకర్ నౌక ‘నందాదేవి’ ప్రస్తుతం గుజరాత్ తీరానికి సమీపంలో ఉంది. ఈ నౌక రేపు (మార్చి 17) ఉదయం 6:30 గంటలకు గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకునే అవకాశం ఉందని షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ రెండు నౌకలు కలిపి సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ను భారత్‌కు తీసుకొస్తున్నాయి. ఈ గ్యాస్‌ను దేశంలోని వివిధ గ్యాస్ నిల్వ కేంద్రాలకు తరలించి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన కొంత ఒత్తిడి తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
భారత్ అవసరాల్లో పెద్ద భాగం ఎల్పీజీ గ్యాస్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా వంటి మధ్యప్రాచ్య దేశాలు భారతదేశానికి ప్రధాన సరఫరాదారులుగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ రవాణా మార్గాల్లో ఉన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ప్రస్తుతం ఈ నౌకల రాకతో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.











