ఆస్ట్రేలియా గొర్రెల పెంపకంలో అధిక లాభాలు

Sheep farming in Australia

Sheep farming in Australia

మహబూబ్ నగర్ జిల్లా దోనూరు గ్రామంలో గొర్రెల పెంపకం చేస్తున్న డా. తలపనేని కోటయ్యగారు ఇటీవల ఆస్ట్రేలియా సందర్శించి అక్కడ గొర్రెల పెంపకం గురించి పరిశీలించి మన రైతులకోసం అందిస్తున్న కథనం.

ఆగస్టు 4-5 తేదీలలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మహానగర సమీపంలో హాల్డేన్ గ్రామంలో జరిగిన ‘షేప్ వెన్షన్’ (గొర్రెల పెంపకందారులు, శాస్త్రజ్ఞుల సదస్సు)కు హైదరాబాదు నుండి నేను ఒక ప్రతినిధిగా హాజరయ్యాను. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా దోనూరు గ్రామంలో 8 ఎకరాల స్థలంలో సుమారు వెయ్యి జోడిపి మరియు రాంబుల్లెటిన్ జాతుల గొర్రెలు కలిగిన ఎం.ఆర్.ఎఫ్ (మందాకిని రిసెర్చి ఫారము)ను గత నాలుగు సంవత్సరాలుగా నేను విజయవంతంగా నిర్వహిస్తున్నాను. గొర్రెల పెంపకం ఒక ముఖ్య పరిశ్రమగా వర్ధిల్లుతున్న ఆస్ట్రేలియా తన జాతీయ ఆదాయంలో ముఖ్య భాగాన్ని గొర్రెల పెంపకం ద్వారా పొందుతోంది. నాకు గొర్రెల పెంపకం మరియు ఈ రంగంలో పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తితో ఈ సదస్సులో పాల్గొని, మెల్బోర్న్ పరిసరాలలో విస్తరించిన కొన్ని గొర్రెల ఫారాలను సందర్శించాను. ఈ సందర్శనలో నేను గ్రహించిన కొన్ని వాస్తవాలను మన తెలుగు రాష్ట్రాలలోని నా సోదర పెంపకందార్లతో పంచుకోవాలనే ఉద్దేశంతో నా అనుభవాలను మీముందు ఉంచుతున్నాను.

ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం

ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఉన్నితో పాటు, జీవాల చర్మాలకు కూడా మార్కెట్లో గిరాకీ తగ్గిపోతున్నందున. ఒకప్పుడు ఉన్ని ఉత్పత్తికి పేరుగాంచిన మెరీనో జాతి గొర్రెల స్థానంలో అధిక మాంసాన్ని అందించగల డార్సెట్ జాతి గొర్రెలు పుట్టినప్పుడు 3.5 నుండి 4.0 కిలోలు, రోజుకు ప్రాథమిక దశలో 200-250 గ్రాముల చొప్పున పెరుగుతూ 8 నెలల వయస్సుకు సుమారు 60 కిలోల శరీర తూకాన్ని అందులో 50 శాతం మాంస ఉత్పత్తిని అందించగలవు.

వీటిలో వ్యాధినిరోధక శక్తితో పాటు, వాతావరణ తీవ్రతలను తట్టుకుని, నాసిరకం గ్రాసాలు, చెట్ల ఆకులను కూడా సమర్థవంతంగా ఇవి జీర్ణించుకోగలవు. రెండేళ్లలో మూడు సార్లు ఈతకు 2-3 పిల్లలకు జన్మనిచ్చి, వాటికి అవసరమైన పరిమాణంలో జున్నుపాలను, ఆ తర్వాత 3 నెలల వరకు పాలను అందించి పోషించగలవు. వీటి ప్రత్యుత్పాదక జీవిత కాలం 7 సంవత్సరాలు పైగా ఉంటుంది. అందంగా వుండే ఈ తెల్ల డార్పర్ గొర్రెల మందలు ఎటువంటి ఆశ్రయం గానీ కనీసం చెట్టు నీడ కూడా లేని పచ్చిక బీళ్లలో వేల సంఖ్యలో మందలు మందలుగా రోడ్ల ఇరువైపులా బహుసుందరంగా మనకు కనిపిస్తాయి. వీటి వెంట్రుకలను కత్తిరించవలసిన పనిలేదు. వాటంతట అవే రాలిపోతాయి.

దొంగల బెడద ఉండదు

సాధారణంగా 3000 నుండి 5000 గొర్రెలు ఒక్కొక్క యాజమాన్యంలో కేవలం ఒకే ఒక వ్యక్తి నిర్వహణలో ఉంటాయి. కొన్ని మందలలో పదివేల జీవాల వరకు ఉన్నాయని నేను విన్నాను. గొర్రెల మార్కెట్లలో ఒకేరోజు లక్ష గొర్రెల వరకు విక్రయాలు జరుగుతాయని నాకు తెలిసింది. ఆస్ట్రేలియాలో భూమికి కొరత లేనందువలన ఒక్కొక్క ఫారమ్ క్రింద వందల ఎకరాల సారవంతమైన పచ్చిక బీళ్లు అవసరమైన నీటిసదుపాయంతో అందుబాటులో ఉంటాయి. ఈ గొర్రెలకు ప్రత్యేకంగా ఎటువంటి షెడ్లు ఉండవు. దొంగల బెడద కానీ వన్యమృగాలు, క్రూరజంతువుల భయం కానీ ఉండనందువల్ల, పచ్చికబీళ్లలోనే అవసరమైతే కదిలించే కంచెల మధ్య ఆవరణల్లో ప్రత్యేకంగా వేరు చేయవలసిన లేదా నట్టల మందు పట్టించుటకు, టీకాలు వేయించుటకు కానీ ఆవరణల్లో ఏర్పాటు చేసుకుంటారు.

Plzaap Instalationhttps://play.google.com/store/apps/detailsid=com.ravindra.news&pli=1

మన దేశీ జాతి గొర్రెలలో ఈనేసమయంలో ఎక్కువగా కనిపించే ఇబ్బందులు అక్కడ కనిపించవు. అక్కడి డార్పర్ గొర్రెల శరీరం భారీగా ఉండుట వల్ల రెండే కాదు మూడు పిల్లల్ని కూడా ఒక్కొక్క తల్లి ఒకేసారి సునాయాసంగా ఈనగలదు. వీటన్నిటికీ అవసరమైనన్ని జున్ను పాలతో పాటు పాలను కూడా అందించి, వాటి వేగవంతమైన ఎదుగుదలకు దోహద పడగలవు. ఈ కారణంగానే కవలల జన్మలకు కారణమయ్యే బి+జీన్ కలిగిన పొట్టేళ్లు, ఆడ గొర్రెలతో సంతతి అభివృద్ధికి కృషి జరుగుతోంది.

పొట్టేళ్ల మాంసానికి మన దేశంలో గిరాకీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆడ గొర్రెల మాంసానికి, విత్తులు లేని మగ గొర్రెల మాంసానికి గిరాకీ ఎక్కువ. కాబట్టి మగ పిల్లల వృషణాలు ఎదగకుండా వాటి తిత్తిపై భాగంలో రబ్బరుబ్యాండును అమర్చి రక్తపు ప్రసారాన్ని నిలిపివేసి వృషణాలను కృశింపచేస్తారు. ఆస్ట్రేలియాలో అధీకృత ఫారాలు, పరిశోధనల కొరకు మందలలో ప్రతి జీవానికి ఒక్కొక్క నెంబరు పోగును బిగించి, వాటి లక్షణాలను సమీక్షిస్తూ యాజమాన్య విధానాలను అమలు చేస్తారు. అందులో పుట్టుక తూకం, మూడు నెలల వయస్సులో (పాలు మానే దశలో) తూకం, మార్కెట్కు తరలించే ఎనిమిదో నెలలో శరీరతూకం కవలజననాలు తదితర వివిధ లక్షణాలను కంప్యూటర్లలో నిక్షేపించి, విశ్లేషిస్తారు.

ఒకేసారి అవసరమైనన్ని గొర్రెలను ఎదలోకి తెప్పించుటకు ఎదసమన్వయం (ఈస్ట్రస్ సింథ్రానైజేషన్) కొరకు సాధారణ యజమాని సైతం ఆడగొర్రె గర్భద్వారం లోపలకు ప్రవేశపెట్టగల చిన్న డివైజ్ (కాప్సూల్ వంటిది) ద్వారా ప్రొజెస్టరాన్ హార్మోన్ను ప్రవేశపెట్టి, ఎదకు రావలసిన కొన్ని గంటల ముందు వాటిని సులువుగా వెలుపలకు తీసివేస్తే అవి కోరుకున్న సమయానికి స్పష్టమైన ఎద లక్షణాలను ప్రదర్శిస్తాయి. వీటి వద్దకు ఎంపిక చేసిన గొర్రెపోతుల్ని వదలి. అవి కట్టు నిలిచే విధంగా తగిన చర్యలు తీసుకుంటారు.

కృత్రిమ గర్భధారణ.. ఘనవీర్యంతో

కృత్రిమ గర్భధారణ విధానాన్ని ద్రవనత్రజని ఉష్ణోగ్రతలో భద్రపరచిన ఘనవీర్యంతో అమలు చేస్తున్నారు. కొన్ని ఫారాలలో లాపరోస్కోపీ విధానంలో ఉదరం ప్రక్క నుంచి చిన్న రంధ్రం గుండా నేరుగా వీర్యాన్ని ఆడగొర్రె గర్భాశయంలో నిర్దిష్ట స్థానంలో ప్రవేశపెట్టి ఒకేసారి 8 నుండి 10 అండాలకు ఫలదీకరణ జరిపి అధిక సంఖ్యలో పిండాలను ఉత్పత్తి చేసి, ఆ తర్వాత వాటిని సేకరించి ఇతర ఆడగొర్రెలలో ప్రవేశపెట్టి కూడా (పిండమార్పిడీ-సారోగసీ) అధిక సంఖ్యలో అత్యుత్తమ శ్రేణి గొర్రెపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. స్కానింగ్ ద్వారా 90 శాతం ఖచ్చితత్వంతో గర్భనిర్ధారణ పరీక్షలను రోజులో 6-7 గంటలలో 500 నుండి 600 గొర్రెల వరకు వేగంగా పూర్తి చేయగల నైపుణ్యం అక్కడి సాధారణ చూడి నిర్ధారణ వ్యక్తిలో ఉంటుంది.

ఇందుకు అతను గొర్రెకు సుమారు 70-80 ఆస్ట్రేలియన్ సెంట్లు (50-60 రూపాయలు) వసూలు చేస్తాడు.
కబేళాలకు తరలించే ఒక నెల రోజులు ముందు నుంచి గింజ ధాన్యాలు (కార్బొహైడ్రేట్స్) ఎక్కువగా వుండే దాణాలను మేపి మంచి కండపుష్టి కలిగిన జీవాలను విక్రయించి అధిక ఆదాయాలను పొందుతున్నారు. ఇంచుమించు ఒకే శరీర తూకం, రూపము, మాంసం దిగుబడితో రుచి, రంగు కలిగిన మాంసాన్ని ఇవ్వగల జీవాలను విక్రయించి మార్కెట్లో తమ ఉనికిని కాపాడుకొనుటకే గొర్రెల పెంపకందారులందరూ ప్రాధాన్యతనిస్తున్నారు.

నేను ఒక వారం రోజుల్లో హామిల్టన్ పరిసరాలలో సందర్శించిన షీప్ ఫారాలలో కొన్నింటిలో మాత్రము ప్రత్యేక షెడ్లలో పెరిగే ఆడగొర్రెలకు, విత్తులు లేని (కాస్ట్రేషన్ చేసిన) మగ గొర్రెలను ఒక్కొక్క జీవానికి ఒక చదరపు మీటరు స్థలాన్ని కేటాయించి పెంచుతున్నారు..ఇప్పుడిప్పుడే పిండ మార్పిడీ పద్ధతి ద్వారా అత్యుత్తమ స్థాయి గొర్రెల పిండాలను, పిల్లలను ఉత్పత్తి చేస్తూ 40 శాతం వరకు విజయవంతంగా సంతతిని పొందుచున్నారు. మరిన్ని శాస్త్రీయ పరిశోధనా ప్రయత్నాలతో ఈ శాతాన్ని 60-70 శాతం వరకు పెంచవచ్చునని ఆశిస్తున్నారు.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

ఆస్ట్రేలియా జాతీయ ఆదాయంలో గొర్రెల పెంపక పరిశ్రమ ముఖ్య పాత్ర పోషిస్తోంది. అక్కడ గేదెల పెంపకం కూడా నాకు కనిపించింది. ఆస్ట్రేలియాలో ఉన్నంతగా మనకు భూలభ్యత లేకపోవచ్చును. అనేక పరిశ్రమలకు వందల ఎకరాల భూముల్ని కేటాయిస్తున్న మన ప్రభుత్వాలు, ప్రయోగాత్మకంగా 5000 గొర్రెల పోషణకు అవసరమైన 40-50 ఎకరాల భూమిని కొందరు ఔత్సాహిక యువ పశువైద్యశాస్త్రజ్ఞులకు కేటాయించి అక్కడ వాణిజ్య సరళిలో మేలుజాతి గొర్రె పొట్టేళ్ల వీర్యాన్ని, పిండాలను ఉత్పత్తి చేసి ఇతరులకు కూడా విక్రయించి, వేగంగా సంతతి వాసిని, రాశిని పెంచే విషయమై పరిశీలన చేయాలి.

ఆస్ట్రేలియా కంటే గొర్రెల పెంపకంలో మనమే

వాస్తవానికి ఆస్ట్రేలియాలో కంటే భూలభ్యతలో తప్ప మన దేశంలోనే మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, సాధన సంపత్తి ఎక్కువగా ఉన్నందున, మనమే ఆస్ట్రేలియా కంటే గొర్రెల పెంపకంలో ఎక్కువగా రాణించగలమని నా అభిప్రాయం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా అమలులో ఉన్న షీప్ బ్రీడింగ్ పథకాన్ని ఆస్ట్రేలియా రీతిలో గొర్రెల పెంపకాన్ని పాక్షిక సేంద్రియ పద్ధతిలో ప్రోత్సహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పశువైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థల సమీపంలో ఈ గొర్రెల పెంపక, పరిశోధనా కేంద్రాలను ప్రారంభిస్తే, ఆస్ట్రేలియాలో కంటే మెరుగైన ఫలితాలను సాధించగలమని నా అభిప్రాయం.. ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం, బ్రీడింగ్, లేపరోస్కోపిక్ పద్ధతిలో వీర్యదానం, అధిక సంఖ్యలో అత్యున్నత స్థాయి జాతి పిండాల ఉత్పత్తి వంటి అనేక విషయాలలో నాకు అమూల్యమైన సమాచారాన్ని అందించిన ప్రముఖ శాస్త్రజ్ఞులు డాక్టర్ కొలీన్ ఎర్ల్ మరియు డాక్టర్ బ్రియాన్-షర్రాక్ తదితరులకు నేను సదా కృతజ్ఞుడను.

డా. తలపనేని కోటయ్య, ఎం.వి. ఎస్సీ, ఇండ్ బ్రో పౌల్ట్రీ మరియు

ఎం ఆర్ ఎఫ్ సిఫ్- ఫారమ్స్ , హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top