సీతాఫలం అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీమ్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు.
ఈ పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్-సీ, విటమిన్-ఎ కలిగి ఉండడంతో దీని గుజ్జు ఐస్క్రీమ్ మరియు పాల ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. సీతాఫలం ఆకులు, గింజలు మరియు ఇతర భాగాల్లో అనోనిన్ అనే అల్కలాయిడ్ ఉండడం వల్ల చేదుగుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. ఆకులు, గింజల నుండి తీసిన రసంలో కీటకనాశని లక్షణాలు ఉంటాయి. గింజల నుండి 27-30 శాతం దాకా నూనె లభిస్తుంది. ఈ నూనెను సబ్బు, పెయింట్ పరిశ్రమల్లో వాడతారు.
రకాలు :బాలానగర్: కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద కళ్ళతో పెద్ద పరిమాణంలో ఉంటాయి. కళ్ళ మధ్య లేత పసుపు రంగు నుంచి నారింజ రంగులో చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. వాణిజ్యపరంగా బాలానగర్ బాగా ప్రాముఖ్యత పొందినది.
అటిమోయా: ఈ పండ్లు తక్కువ గింజలతో ఉంటాయి. గుజ్జు తీపి, పులుపు కలిగి ప్రత్యేకమైన రుచిలో ఉంటుంది.
అటిమోయా X బాలానగర్: లేత గోధుమ రంగు కండ కలిగి ఉంటుంది. పండు బరువు సుమారు 250-300గ్రా. ఉంటుంది. 25 శాతం చక్కెర కలిగి ఉంటుంది.
Plz Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1
వాతావరణం: సీతాఫలం ఉష్ణమండల పంట. ఎక్కువ చలి, మంచుకు తట్టుకోలేదు. అధిక వర్షపాతాన్ని, వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేదు. వేడి రాత్రులు, సాధారణ ఎండలు, పుష్పించే దశలో అధిక తేమ, సాలీనా వర్షపాతం 50-75 సెం.మీ. ఈ పంటకు అనుకూలం. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువైతే పూత రాలిపోయి పిందెలు ఏర్పడవు.
నేలలు: మురుగునీరు పోయే సదుపాయం కలిగిన 6.5-7.5 పి.హెచ్ (ఉదజని సూచిక) గల నేలలు అనుకూలం. సీతాఫలం చెట్లు చౌడు, క్షార నేలలు మినహా అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి. నీరు నిలువని చల్కా నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు, గరప నేలల్లో బాగా పెరిగి దిగుబడినిస్తుంది. రాళ్ళతో కూడిన గరుకు నేలల్లో కూడా సాగు చేయవచ్చు.
మొక్కలు నాటుట: ఎన్నిక చేసిన పొలంలో 60×60×60 సెం.మీ. గుంతలను 5×5 మీ. దూరంలో (ఎకరాకు 160 మొక్కలు) లేదా 6×6 మీ. ఎడముగా (ఎకరాకు 110 మొక్కలు) తీసి నాటుకోవాలి. 3-4 రోజుల ముందు నీరు పారించాలి. వర్షాకాలం ప్రారంభం కాగానే వెనీర్ అంట్లు నాటుకోవాలి. నాటేటప్పుడు అంటుభాగం భూమి నుండి 10-20 సెం.మీ. పైకి ఉండేలా చూడాలి. గుంత మధ్యలో నాటి అవసరమైతే కర్రతో ఊతం ఏర్పాటు చేయాలి.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ఎరువుల యాజమాన్యం:
సీతాఫలం చెట్టు ఎరువులకు బాగా స్పందించి మంచి దిగుబడులనిస్తుంది. 50 కిలోల పశువుల ఎరువు, 1 కిలో ఆముదపు పిండి లేక 1 కిలో వేపపిండి..
ఒక చెట్టు పాదులో ఒకసారి జూన్-జూలైలో వేసుకోవాలి. జీవన ఎరువైన అజటోబ్యాక్టర్ను చెట్టుకి 250 గ్రా. వరకు వేసుకోవటం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు.
నీటి యాజమాన్యం: డ్రిప్ పద్దతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల, దిగుబడి అధికంగా ఉంటుంది.
డ్రిప్ వసతి లేనిచోట 20 లీటర్ల నీరు పట్టేకుండను భూమిలో డ్రిప్ జోన్ దగ్గర పాదుల్లో అమర్చి “పిచ్చర్ పద్ధతి”లో నీటిని ఇచ్చుకోవచ్చు.
కుండలోని చిన్న రంధ్రానికి అమర్చిన వత్తి ద్వారా భూమిలోనికి నీరు సన్నగా బోట్లుగా కారి వేర్లకు నీరు అందుతుంది.
నీటి వసతి లేకపోతే చెట్లు బాగా పెరిగే వరకు (2 నుండి 3 సంవత్సరాల వరకు) వేసవిలో నీరు పోయాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండవు. చెట్లు పాదుల్లో 8 సెం.మీ. మందం వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టును వేసి తేమను ఎక్కువ కాలముండేటట్లు చూడాలి. వరుసకు, వరుసకు మధ్య 5 శాతం వాలు కల్పించి వర్షపు నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవావలి. ఎండాకాలంలో నీరు పెడితే బాగా పెరిగి ముందుగా పంటనిస్తుంది.
కలుపు నివారణ మరియు అంతరకృషి:
మొదట 3-4 సం ; ల వరకు వేరుశనగ, అపరాలు, ఉలవలు, అలసందలు మరియు నీటి వసతి ఉంటే కూరగాయలను అంతర పంటలుగా పండించవచ్చు. పచ్చిరొట్ట
పంటలను చెట్ల మధ్యలో వేసి పూత రాక ముందే (ఆగస్టులో) దున్నాలి.
కత్తిరింపులు: సరైన ఆకృతిని, తెగుళ్ళు సోకిన కొమ్మలను కత్తిరించి (జనవరి-మార్చి) తిరిగి చిగురించే పరిస్థితిని కల్పించాలి. 2-3 సంవత్సరాల వరకు అనవసరపు కొమ్మలు కత్తిరించి చెట్టుకు నిర్దుష్టమైన ఆకారం, పరిమాణం కల్పించాలి.
అధిక దిగుబడుల కోసం కాపుకు వచ్చిన చెట్ల (4 నుండి 5 సం: లు దాటిన చెట్ల) కొమ్మలను 25% మించకుండా గత సం॥రం పెరుగుదలను కత్తిరించినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దిగుబడి: సీతాఫలం చెట్టు నాటిన మూడవ సం: ల నుండి కాపు వచ్చినా మంచి దిగుబడి 5-6 సం: ల వయస్సులో పొందవచ్చు.
మామలూగా ఒక చెట్టు 60-100 వరకు ఫలాలనిస్తుంది. మేలైన యాజమాన్యం పాటించి ఒక్కొక్క చెట్టుకు 100-150 కాయలు చొప్పున ఎకరాకు 3-4 టన్నుల పండ్లు పొందవచ్చు.
యంత్రం సహాయంతో గుజ్జును వెలికి తీయవచ్చు:
తక్కువ సమయంలో ఎక్కువ గుజ్జును వెలికి తీయవచ్చు. మొట్టమొదటిసారిగా మహారాణా ప్రతాప్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉదయపూర్ శాస్త్రవేత్తలు గుజ్జు వెలికితీసే యంత్రాల్ని తయారుచేశారు.
” ఈ పరికరానికి రెండుభాగాలు ఉంటాయి.
1) గుజ్జును విత్తనంతో సహా వెలికితీస్తుంది.
2) విత్తనాన్ని గుజ్జు నుండి వేరు చేస్తుంది.
▪ ఇలా వెలికి తీసిన గుజ్జు ఒక సం: రం వరకు నిల్వ చేసుకోవచ్చు.
ఇలా వెలికి తీసిన గుజ్జు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫ్రీజింగ్ చేసే 18 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ ఉంచినట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
ఈ పరిజ్ఞానం ఉపయోగించి తీసిన గుజ్జును ఎగుమతి చేసుకున్నట్లయితే మంచి ఆదాయం పొందవచ్చు.