సతీసహగమనం ఇది ఒక మహాజాతరలా జరిగేది. మేళతాలాలతో ఊరేగింపుగా ఊరు ఊరంతా తరలి పోయేవారు. అక్కడ చితిపైన పెద్ద మంచె పెట్టి దానిపైన స్త్రీని కూర్చుండ బెట్టి, చితిపై తన భర్త శవానికి నిప్పు అంటించగానే మంచె నాలుగు కర్రలను నలుగురు తొలిగించేవారు. అలా మంచె పైన స్త్రీ కాలుతున్న చితిపై పడిపోయేది. తను బయటకు రాకుండా పెద్ద కర్రలతో గట్టిగా అదిమి పట్టేవారు. ఆమె అరుపులు వినకుండా పెద్ద శబ్ధాలతో మేళతాలాలు వాయించేవారు. ఇలా ఒక బెంగాల్ లోనే లక్షా నలబై వేల మంది స్త్రీలను “సతీసహగమనం” పేరుతో దహనంచేశారు.
ఈ ఆచారాన్ని తన సొంత అన్నభార్య విషయంలో చూసి చలించిపోయిన రాజారామ్మోహనరాయ్ మొదటిసారి వ్యతిరేకంగా గళం విప్పాడు. అతడికి విలియం కేరీ ఎంతగానో సహాయం అందించాడు. 1818నుడి విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేశాడు. విధవల బంధువులకు నచ్చ జెప్పాడు, పత్రికల్లో వ్యాసాలు రాశాడు, రాత్రిళ్ళు స్మాశాన వాటికల్ని సందర్శించాడు, తన అభిప్రాయాలతో ఏకీభవించే యువకులను బృందాలుగా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించాడు.
విలియం బెంటిక్ చేసిన సంస్కరణ సనాతనుల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. నిజానికి నాడు కొందరు ఆంగ్లేయ అధికారులు ఇదంతా అవసరమా? అనికూడా ఆందోళన పడ్డారు. అయినా బ్రిటన్ నుండి ఉదారవాదుల మద్దతుతో బెంటిక్ ముందుకే నడిచాడు. చట్టాన్ని అంగీకరించని సనాతనవాదులు పార్లమెంటుకు మహజరు సమర్పించారు. తమ సాంప్రదాయాన్ని గౌరవించమనీ, తమ సామాజిక జీవితంలో జోక్యం తగదనీ ప్రస్తావించాడు. దీనికి ధీటుగా రామ్మొహనరాయ్, మిత్రుడు కేరీ సహాయంతో కౌంటర్ సమర్పిస్తూ ఇది స్త్రీల కనీస జీవన హక్కుకీ, మానవీయతకూ సంబంధించిన విషయమని ప్రస్తావించాడు.











