ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్ర స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లా , ప్రస్తుత నంద్యాల లోని సంగమేశ్వరం. ఆలయం . నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కనుక నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్దికెక్కింది.
పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు.. ప్రతిష్ట సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేప మొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు.,.. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడట. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమై పోయింది.
సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి.
అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురావాస్తు శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.
ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం
ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభం అవుతాయి. ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.
ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి. కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘మచ్చుమర్రి’ గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయట పడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్.టి.సి.వారు బస్సులను నడుపుతారు. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్